బాహుబలిలా శ్రమించాం
దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో బెంచ్ మార్క్ పెట్టారని కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు రౌద్రం, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజా చిత్రం కాష్మోరా. యువ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఇందులో నయనతార, శ్రీదివ్య నాయకిలుగా నటించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మించారు.
సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోకుల్, కథానాయకుడు కార్తీ, నిర్మాతల్లో ఒకరైన ఎస్‌ఆర్.ప్రభు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిని, బాహుబలి చిత్రాన్ని పదే పదే ప్రస్తావించడం విశేషం.దర్శకుడు మాట్లాడుతూ హిస్టారికల్ అంశాలతో కూడిన పిరియడ్ కథా చిత్రం కాష్మోరా అని తెలిపారు. ఇందులో హిస్టారికల్ సన్నివేశాలు అవసరం అయ్యాయన్నారు.
ఈ సన్నివేశాలను రూపొందించడనాకి సిద్ధం అయినప్పుడు బాహుబలి చిత్రం గుర్తు కొచ్చిందన్నారు. ఆ చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాల విషయంలో దర్శకుడు రాజమౌళి బెంచ్‌మార్క్ పెట్టారన్నారు. తాము అంతగా కాకపోయినా కనీసం 30 శాతం అయినా చేయాలని భావించామని తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటించారని చెప్పారు. అదే విధంగా నయనతార, శ్రీదివ్య చాలా బాగా నటించారని తెలిపారు.
బాహుబలిలా శ్రమించాల్సి వచ్చింది
చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ కాష్మోరా తన కేరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు గోకుల్ ఈ చిత్రంలోని ఒక పాత్ర గురించి చెప్పినప్పుడే అందులో నటించగలనా అని భయమేసిందన్నారు. కాష్మో రా లాంటి చిత్రం చేయడానికి నిర్మాతలకు సినిమా ప్యాషన్ ఉండాలన్నారు. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ కఠిన శ్రమ కాష్మోరా అని పేర్కొన్నారు.
చిత్రంలో హిస్టారికల్ సన్నివేశాలు చోటు చేసుకోవడంతో బాహుబలి చిత్రంలా శ్రమించాల్సివచ్చిందన్నారు. చిత్రాన్ని తమిళం,తెలుగు భాషలలో దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చాలా కాలంగా కోరుకుంటున్న మోడరన్ పాత్రను పోషించే అవకాశం కాష్మోరాలో కలిగిందని శ్రీదివ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు సంతోష్‌నారాయణన్ పాల్గొన్నారు. అయితే షరామామూలుగానే నయనతార పాల్గొనలేదన్నది గమనార్హం.