Kasmora
-
మళ్లీ కత్తి పడుతుందా?
మహా అయితే ఓ పావుగంట కంటే ఎక్కువసేపు కూడా ఉండదేమో! కార్తీ ‘కాష్మోరా’లో రత్నమహాదేవిగా నయనతార క్యారెక్టర్! అయితే ఏంటి? యువరాణిగా నయనతార ఆహార్యం, కత్తి చేతపట్టి చేసిన యుద్ధ విన్యాసాలు కాసేపే అయినా కుర్రకారును బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడా సినిమా ప్రస్తావన ఎందుకంటే... నయనతారకు మళ్లీ అలాంటి సినిమా ఆఫర్ ఒకటి వచ్చింది. ‘సంఘమిత్ర’ నుంచి శ్రుతీహాసన్ బయటకు వెళ్లడంతో తెరచుకున్న తలుపులు ఇంకా అలా ఓపెన్‌గానే ఉన్నాయి. ‘సంఘమిత్ర’లో యువరాణిగా టైటిల్ రోల్లో నటించే కథానాయిక కోసం దర్శకుడు సుందర్ .సి, చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ స్టూడియోస్ ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. ఆ అన్వేషణలో నయన అయితే బాగుంటుందనే అభిప్రాయం చిత్రబృందానికి వచ్చిందట! వెంటనే ఆమెను సంప్రదించడం కూడా జరిగిందని కోడంబాక్కమ్ వర్గాల టాక్. నయనతార మళ్లీ కత్తి పడుతుందో? లేదో? -
ఆయనకు విలన్‌గా అయితే ఓకే!
‘‘కాష్మోరా పాత్రను చాలా వైవిధ్యంగా చూపించాం. రాజ్ నాయక్ పాత్ర కోసం నలభై కిలోలుండే కాస్ట్యూమ్‌తో విలనిజం చూపుతూనే, తనేంటో హావభావాలతో బయటపెట్టాలి. దర్శకుడు ఈ పాత్రలను తెరపై చూపించిన విధానం సూపర్’’ అన్నారు హీరో కార్తీ. ఆయన హీరోగా నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ‘కాష్మోరా’ ఇటీవల విడుద లైంది. కార్తీ మాట్లాడుతూ -‘‘కాష్మోరా’ రెగ్యులర్ కాన్సెప్ట్ చిత్రం కాదు. హారర్‌కు వినోదం జోడించడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఫస్టాఫ్ ఇరవై రోజుల్లో షూట్ చేశాం. సెకండాఫ్‌కు ఏడాదిన్నర పట్టింది. అన్నయ్య (హీరో సూర్య) ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశారు. ఆయనకు నచ్చడంతో యూనిట్‌ను అభినందించారు. ‘కాష్మోరా’కు ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. పూర్తి స్థాయి విలన్‌గా చేసే ఉద్దేశం లేదు. అన్నయ్య హీరో అయితే విలన్‌గా చేయడానికి ఓకే. ప్రస్తుతం మణిరత్నంగారి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఎనిమిది రోజుల షూటింగ్ మినహా పూర్తయింది’’ అన్నారు. -
విషయం ఉంటే విజయం!
‘‘దీపావళికి విడుదలైన మా ‘కాష్మోరా’ చిత్రం ఘనవిజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రం చూసి ఎంజాయ్ చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు. కార్తీ, నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం ‘కాష్మోరా’. పీవీపీ మాట్లాడుతూ -‘‘సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాలో అది ఉంది కాబట్టే విజయం సాధించింది. ఈ విజయం వెనక కార్తీ, గోకుల్, చిత్రబృందం అందరి కృషి ఉంది. ‘కాష్మోరా’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రానా హీరోగా తెరకెక్కించిన ‘ఘాజీ’ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నాం. ‘ఊపిరి’ తర్వాత నాగార్జునతో ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’ చిత్రం నిర్మించబోతున్నా. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబుతో ఓ చిత్రం నిర్మిస్తా’’ అన్నారు. -
హాలీవుడ్ స్థాయిలో కాష్మోరా
హాలీవుడ్ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో కాష్మోరా చిత్ర విజువల్స్ భ్రమింపజేస్తాయని ఆ చిత్ర కథానాయకుడు కార్తీ పేర్కొన్నారు. ఈయన ద్విపాత్రాభినయం చేసి, మూడు విభిన్న గెటప్‌లలో కనిపించనున్న చారిత్రక, సాంఘిక సన్నివేశాలతో కూడిన బ్రహ్మాండ చిత్రం కాష్మోరా. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ అధినేతలు ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్ 60 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న చిత్రం ఇది. నయనతార, శ్రీదివ్య నాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు రౌద్రం, ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా చిత్రాలను తెరకెక్కించిన గోకుల్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కాష్మోరా. కార్తీకి తండ్రిగా ప్రముఖ హాస్యనటుడు వివేక్ నటించిన ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ పొందడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం నగరంలోని ఓ నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ ఇందులో తాను పోషించిన కాష్మోరా, రాజ్‌నాయక్ పాత్రల గెటప్‌లు అదుర్స్ అనిపిస్తాయన్నారు. ఈ గెటప్‌ల కోసం రోజూ ఐదు గంటల సమయం పట్టేదన్నారు. జియోటెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో హాలీవుడ్ చిత్రాల స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరకెక్కించిన చిత్రం కాష్మోరా అన్నారు. చిత్రంలో చారిత్రక సన్నివేశాలు అరగంట పాలే చోటు చేసుకున్నా బాహుబలి చిత్రం స్థాయిలో శ్రమించి ఆ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అదే విధంగా చిత్రంలో గంటన్నర పాటు గ్రాఫిక్స్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం కాష్మోరా అని కార్తీ తెలిపారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పవర్ రేంజర్స్: అఫీషియల్ టీజర్ ట్రైలర్ పవర్ రేంజర్స్ పిల్లలకు ఇష్టమైన టీవీ సీరీస్. ఇప్పుడు అదే సినిమాగా రాబోతోంది. డీన్ ఇజ్రేలైట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సూపర్‌హీరో ఫిల్మ్ టీజర్ యూట్యూబ్‌లోకి అప్లోడ్ అవడం ఆలస్యం హిట్స్ మీద హిట్స్ వచ్చి పడడం మొదలైంది. టీజర్‌ను సహజంగానే సినిమా కోసం ఎదురు చూసేలా ఆసక్తికంగా చిత్రీకరించారు. జాక్. కింబర్లీ (అమ్మాయి), బిల్లీ, ట్రినీ (అమ్మాయి), జాన్సన్ అనే ఐదుగురు హైస్కూల్ విద్యార్థుల్ని వారి గురువు జోర్డాన్.. పవర్ రేంజర్స్గా మార్చి, ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించే దుష్టశక్తులపైకి పోరాటానికి పంపించడమే స్టోరీ. సినిమా వచ్చే ఏడాది మార్చి 24న రిలీజ్ అవుతోంది. నిడివి : 2 ని. 20 సె. హిట్స్ : 58,71,123 ప్రిమిటివ్ టెక్నాలజీ: స్పియర్ త్రోయర్ ప్రిమిటివ్ టెక్నాలజీ అనేది యూట్యూబ్‌లో ఒక చానెల్. అందులో అన్నీ ఆదిమానవ విశేషాలు అప్లోడ్ అవుతుంటాయి. అప్పటి వాళ్లు ఎలా ఇళ్లు కట్టుకున్నారు? ఎలా పొయ్యి వెలిగించుకున్నారు? ఎలా జంతువుల్ని వేటాడారు అనే అసక్తికరమై విషయాలెన్నో ఉంటాయి. పేరుకు అవన్నీ విషయాలే కానీ, ఈ ఆధునిక ప్రపంచానికి అవి వింతలు, విడ్డూరాలు. మూడు రోజుల క్రితమే అప్లోడ్ అయిన ఈ వీడియోలో ఆదిమానవుడు ఎలా బల్లెంను తయారు చేసుకున్నాడో, ఎలా బల్లె విసరడం నేర్చుకోన్నాడో చిత్రీకరించారు. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ కాలంలో ఏదో ఒక సెట్టింగ్ వేసి అసలు ఏ సదుపాయాలూ లేని ఆదికాలం నాటి జీవన విధానాన్ని షూట్ చెయ్యడం తేలిగ్గా అనిపించవచ్చు కానీ, టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లి వెళ్లి, ఆనాటి దృశ్యాలను మనసులో పిక్చరైజేషన్ చేసుకుని కెమెరాలోకి లాగేసుకోవడం అనుకున్నంత తేలికేం కాదు. నిడివి : 4 ని. 27 సె. హిట్స్ : 28,18,175 కాష్మోరా: అఫీషియల్ ట్రైలర్ కాష్మోరా నవల వచ్చింది. కాష్మోరా సినిమా వచ్చింది. కాష్మోరా ఎలా వచ్చినా భయపెట్టి, బీభత్సం సృష్టించడం మాత్రం ఖాయం. లేటెస్టుగా ఇప్పుడు కాష్మోరా తమిళనాడు నుంచి వస్తోంది. తమిళ ఫిల్మ్‌గా వస్తోంది. కార్తీ, నయనతార, శ్రీదివ్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు అసలు హీరో సంతోష్ నారాయణ్. సౌండ్ ట్రాక్ అయనదే. కాష్మోరాకే దడ పుట్టించేశాడు. యువ దర్శకుడు గోకుల్ చేతుల మీదుగా తయారైన కాష్మోరా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 28న నిద్రలేస్తోంది. ఏడు జన్మలు ఒకటే ఒక బాణంలా తయారై చెడు సంహరించడం థీమ్. మంత్రాలు, తంత్రాలు, యుద్ధ విద్యలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయని ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిడివి : 2 ని. 9 సె. హిట్స్ : 23,83,267 -
కాష్మోరా సెట్ చూసి భయపడ్డా - హీరో కార్తీ
‘‘ఈ సినిమాలో హిస్టారికల్ వారియర్ లుక్ ఫైనలైజ్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ‘బాహుబలి’ విడుదలైంది. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా డైనోసార్లా.. మా సినిమానేమో చిన్న పప్పీలా అనిపించింది. మా దగ్గర అంత బడ్జెట్ లేదు. ‘మగధీర’ తరహాలో హిస్టారికల్ ఎపిసోడ్ అరగంట ఉన్నా, ‘బాహుబలి’లా సెట్ వేయాలి. లేదంటే సినిమా చేయలేం. ఓ సెట్ వేశారు. అది చూసి, షాకయ్యా. బాగా ఖర్చుపెట్టారు. నిర్మాత ప్రభు నా పిన్ని కొడుకు. ఏం సినిమా చేస్తున్నారని పిన్ని తిడుతుందేమోనని భయపడ్డా. ఇలాంటి సినిమా తీయడానికి నిర్మాతలకు ధైర్యం కావాలి’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, నయనతార, శ్రీదివ్య నటీనటులుగా గోకుల్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘కాష్మోరా’. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు నిర్మాతలు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఆడియో సీడీలను హీరో మాధవన్ ఆవిష్కరించారు. మాధవన్ మాట్లాడుతూ - ‘‘ఎంతో ప్యాషన్‌తో.. లైఫ్, సోల్ పెట్టి ఇటువంటి సినిమాలు తీస్తారు. మూడేళ్ల నుంచి సినిమా చేయడమంటే మామూలు విషయం కాదు. ట్రైలర్, పోస్టర్ చూస్తే సినిమా ఎంత డిఫరెంట్‌గా ఉండబోతుందో తెలుస్తోంది’’ అన్నారు. ‘‘సినిమాలో హారర్, కామెడీ, అడ్వంచరస్ యాక్షన్ ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. లవ్, రొమాన్స్ లేవు’’ అని కార్తీ తెలిపారు. ‘‘తెలుగులో ‘కాష్మోరా’ అనే పదం సుపరిచితమే. ‘ఊపిరి’ తర్వాత కార్తీకి ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది’’ అన్నారు పీవీపీ. గోకుల్, వంశీ పైడిపల్లి, శ్రీదివ్య పాల్గొన్నారు. -
బాహుబలిలా శ్రమించాం
దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో బెంచ్ మార్క్ పెట్టారని కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు రౌద్రం, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజా చిత్రం కాష్మోరా. యువ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఇందులో నయనతార, శ్రీదివ్య నాయకిలుగా నటించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించారు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోకుల్, కథానాయకుడు కార్తీ, నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్.ప్రభు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిని, బాహుబలి చిత్రాన్ని పదే పదే ప్రస్తావించడం విశేషం.దర్శకుడు మాట్లాడుతూ హిస్టారికల్ అంశాలతో కూడిన పిరియడ్ కథా చిత్రం కాష్మోరా అని తెలిపారు. ఇందులో హిస్టారికల్ సన్నివేశాలు అవసరం అయ్యాయన్నారు. ఈ సన్నివేశాలను రూపొందించడనాకి సిద్ధం అయినప్పుడు బాహుబలి చిత్రం గుర్తు కొచ్చిందన్నారు. ఆ చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాల విషయంలో దర్శకుడు రాజమౌళి బెంచ్‌మార్క్ పెట్టారన్నారు. తాము అంతగా కాకపోయినా కనీసం 30 శాతం అయినా చేయాలని భావించామని తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటించారని చెప్పారు. అదే విధంగా నయనతార, శ్రీదివ్య చాలా బాగా నటించారని తెలిపారు. బాహుబలిలా శ్రమించాల్సి వచ్చింది చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ కాష్మోరా తన కేరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు గోకుల్ ఈ చిత్రంలోని ఒక పాత్ర గురించి చెప్పినప్పుడే అందులో నటించగలనా అని భయమేసిందన్నారు. కాష్మో రా లాంటి చిత్రం చేయడానికి నిర్మాతలకు సినిమా ప్యాషన్ ఉండాలన్నారు. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ కఠిన శ్రమ కాష్మోరా అని పేర్కొన్నారు. చిత్రంలో హిస్టారికల్ సన్నివేశాలు చోటు చేసుకోవడంతో బాహుబలి చిత్రంలా శ్రమించాల్సివచ్చిందన్నారు. చిత్రాన్ని తమిళం,తెలుగు భాషలలో దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చాలా కాలంగా కోరుకుంటున్న మోడరన్ పాత్రను పోషించే అవకాశం కాష్మోరాలో కలిగిందని శ్రీదివ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు సంతోష్నారాయణన్ పాల్గొన్నారు. అయితే షరామామూలుగానే నయనతార పాల్గొనలేదన్నది గమనార్హం. -
అధర్వకు అక్కగా నయన్
తాను నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్నంత స్థాయికి ఎదిగిన నటి నయనతార. అంత అగ్రనాయకిగా రాణిస్తున్నా టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ నటించడానికి సై అంటున్నారు. మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి సక్సెస్ అవుతున్నారు. ఇటీవల విక్రమ్‌తో జత కట్టిన ఇరుముగన్ మంచి విజయాన్ని సాధించింది. కార్తీ హీరోగా నటిస్తున్న కాష్మోరా చిత్రం దీపావళికి విడుదల కానుంది. కాగా తాజాగా యువ నటుడు అధర్వతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు నయనతార ప్రధాన పాత్రలో నటించిన మాయ చిత్రంతో మ్యాజిక్ చేసిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఇమైకా నోడిగళ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కాగా ఇంతకు ముందు దొంగపోలీస్, ఒరనాళ్ కూత్తు వంటి చిత్రాలను నిర్మించిన క్యామియో ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఈసారి మంచి కమర్షియల్ అంశాలతో కూడిన కథగా ఆ ఇమైకా నోడిగళ్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. కాగా ఇందులో నయనతార నటుడు అధర్వకు అక్కగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు మాయ చిత్రంలో నయన్‌ను తల్లిగా చూపించి సక్సెస్ అయిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సారి అక్కగా ఎలాంటి డైనమిక్ పాత్రలో చూపించనున్నారన్నది వేచి చూడాల్సిందే. -
కార్తీ కసరత్తు
ఈ హైటెక్ రోజుల్లో సినీ ప్రేక్షకుల్ని మెప్పించడం సులభతరం కాదు. కొత్తదనం కోసం చాలా కథల విషయంలో దర్శక నిర్మాతలు చాలా కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఇక పాత్రల పోషణలో వైవిధ్యం కోసం నటీనటులు బాగానే కసరత్తులు చేయాల్సి ఉంది. ఇప్పుడు చాలా మంది హీరోలు ఇందు కోసం శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. ఐ చిత్రం కోసం విక్రమ్ పడ్డ కష్టం ఇంతా అంతా కాదు. నటుడు సూర్య 24 చిత్రంలో త్రిపాత్రాభినయం కోసం చాలా కృషి చేశారు. మరి కొందరు సిక్స్‌ప్యాక్ అంటూ కండలు పెంచడం వంటి సంఘటనలు చాలానే చూశాం. తాజాగా యువ నటుడు కార్తీ అలాంటి శ్రమతో తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కాష్మోరా చిత్రం కోసం తన జుత్తును త్యాగం చేసి గుండు కొట్టించుకుని నటించిన కార్తీ, ఆ చిత్రాన్ని పూర్తి చేసి దర్శకుడు మణిరత్నం చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అదితిరావు నటించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించిని ఈ చిత్రం వచ్చే నెల సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కార్తీ పెలైట్‌గా నటించనున్నారు. ఈ పాత్ర కోసం తను బరువు తగ్గి స్లిమ్‌గా తయారవుతున్నారు. ఇందుకోసం నిత్యం జిమ్ బాట పట్టి కసరత్తులు చేస్తున్నారట. కాగా మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ బాణీలు కట్టడం ప్రారంభించారు. చిత్రంలోని పాటల్ని వైరముత్తు రాస్తున్నారు. రవివర్మ ఛాయాగ్రహణం అందించనున్నారు.