అధర్వకు అక్కగా నయన్
తాను నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్నంత స్థాయికి ఎదిగిన నటి నయనతార. అంత అగ్రనాయకిగా రాణిస్తున్నా టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ నటించడానికి సై అంటున్నారు. మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి సక్సెస్ అవుతున్నారు. ఇటీవల విక్రమ్‌తో జత కట్టిన ఇరుముగన్ మంచి విజయాన్ని సాధించింది. కార్తీ హీరోగా నటిస్తున్న కాష్మోరా చిత్రం దీపావళికి విడుదల కానుంది.
కాగా తాజాగా యువ నటుడు అధర్వతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు నయనతార ప్రధాన పాత్రలో నటించిన మాయ చిత్రంతో మ్యాజిక్ చేసిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఇమైకా నోడిగళ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కాగా ఇంతకు ముందు దొంగపోలీస్, ఒరనాళ్ కూత్తు వంటి చిత్రాలను నిర్మించిన క్యామియో ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది.
అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఈసారి మంచి కమర్షియల్ అంశాలతో కూడిన కథగా ఆ ఇమైకా నోడిగళ్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. కాగా ఇందులో నయనతార నటుడు అధర్వకు అక్కగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు మాయ చిత్రంలో నయన్‌ను తల్లిగా చూపించి సక్సెస్ అయిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సారి అక్కగా ఎలాంటి డైనమిక్ పాత్రలో చూపించనున్నారన్నది వేచి చూడాల్సిందే.