అక్కడ అద్భుతాలు చాలా జరిగాయి!
‘‘నాకు మార్గదర్శకులు లేరు. ఇప్పటికి తొమ్మిది సినిమాల్లో నటించాను. వాటి నుంచే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ‘యువత’ విజయం తర్వాత టకటకా సినిమాలకు సైన్ చేశాను. అన్నీ మాస్ సినిమాలే. ఫలితాలు మాత్రం అంచనాలకు భిన్నంగా వచ్చాయి. అందుకే మరోసారి అలాంటి తప్పు చేయకూడదనే..‘స్వామి రారా’ తర్వాత ఆలోచించి అడుగులేస్తున్నాను. ఒక్క ‘కార్తికేయ’ చిత్రాన్ని మాత్రమే ‘ఓకే’ చేశాను’’ అని చెప్పారు నిఖిల్. ఆయన హీరోగా రూపొందిన ‘కార్తికేయ’ ఈ నెల 24న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిఖిల్ విలేకరులతో ముచ్చటిస్తూ-‘‘ఇలాంటి సినిమాల నిర్మాణ దశలో అద్భుతాలు జరుగుతుంటాయని విన్నాను. అలాగే ఈ సినిమాక్కూడా జరిగాయి. నా ‘స్వామి రారా’ వినాయకుని చుట్టూ తిరిగే కథ. ‘కార్తికేయ’ కుమారస్వామి చుట్టూ తిరిగే కథ. ఇలా అన్నదమ్ముల నేపథ్యంలో సినిమాలు చేయడం యాదృచ్ఛికం. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉండే సుబ్రమణ్యపురం అనే గ్రామంలోని దేవాలయం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ‘షూటింగ్ సమయంలో.. ఏదో ఒకరోజు పాము రియల్‌గా లొకేషన్లో కనిపిస్తే సినిమా హిట్’ అని ఓ రోజు మా అసిస్టెంట్ డెరైక్టర్ అన్నాడు.
పాము కనిపిస్తుందేమోనని గమనించేవాణ్ణి. బొబ్బిలి కోటలో షూటింగ్. అనుకోకుండా పెద్ద పాము పై నుంచి పడి, లొకేషన్లో భయపడకుండా నిలబడింది. దాంతో సినిమా హిట్ అని అందరం అనుకున్నాం. కార్తీక్ పేరున్న ఆరుగురు ఈ సినిమాకు పనిచేయడం మరో యాదృచ్ఛికమైన విషయం. ఇందులో నా పాత్ర పేరు కూడా కార్తీకే. అలాగే.. అరకులో షూటింగ్ అప్పుడు సరదాగా ఇప్పుడు వర్షం కురిస్తే బావుండు అనుకున్నాం. నిజంగానే కురిసింది. ఇలాంటి అద్భుతాలు చాలానే జరిగాయి’’ అని తెలిపారు.