ముందు మాట్లాడేశాను... తరువాత భయపడ్డాను : నిఖిల్
‘‘‘కార్తికేయ’ విజయంపై మొదట్నుంచీ నాకు నమ్మకం. అందుకే... ప్రతి చోటా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడేశా. తర్వాత భయమేసింది. కారణం.. ఇది ‘స్వామి రారా’ తర్వాత వస్తున్న సినిమా. భారీ అంచనాలుంటాయి. కానీ చివరకు నాలోని భయాన్ని పటాపంచలు చేసింది ‘కార్తికేయ’. విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని నిఖిల్ అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మించిన చిత్రం ‘కార్తీకేయ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ- ‘‘హ్యాపీ డేస్, స్వామి రారా తర్వాత నా కెరీర్‌లో వచ్చిన మరో విజయం ఇది.
అందరూ మనసుపెట్టి పనిచేయడం వల్లే ఈ సక్సెస్. ముఖ్యంగా దర్శకుని ఏడాదిన్నర కష్టం తెరపై కనిపించింది’’ అన్నారు. ‘‘మేధావులను సైతం మెప్పించిందీ సినిమా. ఎన్నో కష్టాలకోర్చి సినిమాను విడుదల చేసిన నిర్మాత ఆత్మస్థైర్యాన్ని అభినందించాలి’’ అని నటుడు రావు రమేశ్ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇంత మంచి సినిమా నేనే తీశానా అని ఆశ్చర్యంలో ఉన్నాను. ఈ కథ వినగానే కచ్చితంగా హిట్ అని అనిపించింది. అయితే... చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయడం కూడా ఎంత కష్టమో ఈ సినిమా ద్వారా తెలిసొచ్చింది’’ అన్నారు. సినిమా ఫలితంపై తనికెళ్ల భరణి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.