swamy rara
-
మాది అమలాపురమండి.. ఆయ్!
శ్రీనగర్‌కాలనీ: ఎర్రబస్సెక్కి కృష్ణానగర్ వచ్చిన పతోడు హీరో అయిపోదామనే అనుకుంటాడు. అదే ఆశతో వస్తారు.. శ్వాసగా జీవిస్తారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడతారు. కొందరు ఇంట్లో చెప్పి వస్తే.. ఇంకొందరు ఇంటి నుంచి పారిపోయి వస్తారు. ‘సత్య అక్కల’ది కూడా అలాంటి బాపతే. ఎవరీ సత్య అనుకుంటున్నారా..! ‘స్వామిరారా’ గుర్తింది కదా.. అందులో ‘ఐదు లక్షలు తీసుకునేటప్పడు ఐదు నిమిషాలు ఆగలేవా..!’ అంటూ తన అమాయకత్వంతో ఐదుకోట్ల రూపాయిలు చేజార్చుకునేలా చేస్తాడే అతడే ఇతడు. సినిమాల్లో అవకాశాల కోసం ఇంట్లో నుంచి పారిపోయి తూ.గో.జి లోని అమలాపురం నుంచి వచ్చాడు. గోదారి ఎటకారానికి తన హావభావాలు జోడించి ఇప్పుడు వెండితెరపై నవ్వులు పూయిస్తున్న సత్య తన కెరీర్ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు సత్య మాటల్లోనే.. మాది తూగో జిల్లా అమలాపురమండి. నాన్న వెంకట్రావు టీచర్. చిన్నప్పట్నుండి సినిమాలంటే మా పిచ్చిగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్ బొమ్మ పడిదంటే తొలాట చూడాల్సిందే. అలా బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి 2005లో రైలెక్కి హైదరాబాద్‌లో దిగిపోయానండి. కానీ మా అమ్మా, నాన్న అస్సలు ఒప్పుకోలేదు. చేసేది లేక తిరిగి అమలాపురం వెళ్లిపోయా. కానీ నరనరాల్లో ఉన్న సినిమా అక్కడ ఉండనీయలేదు. దీంతో ఇంట్లో చెప్పి మరుసటి ఏడు మళ్లీ సిటీకి వచ్చేశా. నా స్నేహితుల పరిచయాలతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ‘రౌడీ ఫెలో’ చిత్రంలో నారా రోహిత్‌తో పిల్ల జమిందార్లో బొమ్మ పడిందండి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ద్రోణ, పిల్లజమిందార్ చిత్రాలకు పనిచేశా. పిల్లజమిందార్ చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చిందండి. అందులో నా పాత్ర పండడంతో సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ‘స్వామిరారా’ చిత్రంలో లీడ్ రోల్ ఇచ్చారు. ఆ సినిమా హిట్టవడంతో ఇక వరుసగా అవకాశాలొచ్చాయి. రౌడీ ఫెల్లో, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, స్పీడున్నోడు, మజ్ను, జై లవకుశ, ప్రేమమ్, ఎక్కడిపోతావు చిన్నవాడా.. చిత్రాల్లో చేసిన పాత్రలకు మంచి స్పందన వచ్చింది.లిక దర్శకుడు సుధీర్ వర్మ ప్రోత్సాహమైన మర్చిపోలెనండి బాబు. ‘ఫ్లైయింగ్ కలర్స్’ తోడుగా.. తెలుగు కమెడియన్స్‌లో శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్యం రాజేష్ లాంటి సీనియర్లు, యువ కమెడియన్లు 14 మందితో ‘ఫ్లైయింగ్ కలర్స్’ అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నామండి. ప్రతీ నెలా రెండో శనివారం గ్రూప్‌లోని ఓ కమెడియన్ పార్టీ ఇస్తారు. అన్ని వంటకాలతో పాటు వెరైటీ ప్రోగ్రామ్స్‌తో సంతోషాన్ని పంచుకుంటామండి. ఆరోజు మా కామెడీతో కడుపు చెక్కలవ్వాల్సిందేనండి. అంతేకాదండి.. గోదారోణ్ని కదా అండి ఆయ్.. తినడం కూడా ఇష్టమేనండి. నచ్చిన తిండి ఎక్కడున్నా తిని తీరాల్సిందేనండి.. ఆయ్. ఇది దేవుడిచ్చిన వరమండి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన నేను అనుకోకుండా ప్రేక్షకులను నవ్వించే అవకాశం వచ్చిందండి. ఇది దేవుడిచ్చిన వరమనుకుంటానండి. ఇంక బ్రహ్మానందం, సునీల్ అన్నయ్య అంటే చాలా ఇష్టమండి. తెలుగులో హీరో రామ్‌చరణ్ నటిస్తున్న రంగస్థలం, నాగచైతన్య హీరోగా సవ్యశాచి చిత్రాల్లో నటిస్తున్నానండి. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి ఎప్పటికీ రుణపడి ఉంటానండి.. ఆయ్. -
మాస్ ఇమేజ్ ప్రయత్నాల్లో నిఖిల్
వరుస ఎక్స్ పరిమెంటల్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్. మరో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్. అదే సమయంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కేశవ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నిఖిల్ సరసన పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్ గానటిస్తుండగా బాలీవుడ్ బ్యూటి ఇషా కొప్పికర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. రీవేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు నిఖిల్. -
స్వామిరారా కాంబినేషన్లో మరో సినిమా
సక్సెస్ కోసం పోరాడుతున్న సమయంలో నిఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పిన సక్సెస్ ఫుల్ సినిమా స్వామి రారా. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమా ఘనవిజయం సాధించటంతో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా అయిపోయాడు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ తరువాత నాగచైతన్య హీరోగా దోచెయ్ సినిమాను తెరకెక్కించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకున్న సుధీర్ వర్మ మరోసారి నిఖిల్ హీరోగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నిఖిల్, ఈ సినిమా పూర్తవ్వగానే మరోసారి సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది. -
ప్రయోగాలకే ఓటేస్తున్నాడు
కమర్షియల్ జానర్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వటంతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న నిఖిల్, ఆ జానర్లో మంచి విజయాలు సాధిస్తున్నాడు. స్వామి రారా సినిమాతో తొలిసారిగా కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా సినిమాలు చేయటం ప్రారంభించిన నిఖిల్, ఆ తరువాత వరుసగా కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాల విషయంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. అంతేకాదు ఇక ముందు కూడా అదే తరహా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం కోన వెంకట్ నిర్మిస్తున్న శంకరాభరణం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో. ఆ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్‌తో ఫాంలో ఉన్న నిఖిల్, అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్లో సక్సెస్ అయిన ఫస్ గయా రే ఒబామా సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులతో రీమేక్ చేశారు. ప్రస్తుతం టైగర్ సినిమా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న నిఖిల్ మరోసారి ప్రయోగానికే ఓటు వేస్తున్నాడు. కార్తీక్ రెడ్డి అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తూ క్రీడా నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పాడు. 2016 ఫిబ్రవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
రవితేజ ఒప్పేసుకున్నాడు
షార్ట్ ఫిలిం మేకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మ తరువాత డైరెక్టర్‌గా కూడా మారి మంచి విజయాన్నే సాధించాడు. నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'స్వామి రారా..' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ, తొలి సినిమాతోనే స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఎంత సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయినా, ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయాడు. తొలి సినిమా ఘనవిజయం సాధించటంతో యంగ్ హీరో నాగచైతన్య పిలిచి మరీ సుధీర్‌తో సినిమా చేశాడు. మరోసారి క్రైమ్ థ్రిల్లర్‌నే నమ్ముకున్న సుధీర్ వర్మ నాగచైతన్య హీరోగా 'దోచెయ్' సినిమాను రూపొందించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. దీంతో అప్పటి వరకు బిజీ డైరెక్టర్ అయిపోతాడనుకున్న సుధీర్ ఒక్కసారిగా డీలా పడిపోయాడు. అప్పటినుంచి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం 'బెంగాల్ టైగర్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ, సుధీర్ వర్మతో సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ కూడా విన్న మాస్ మహరాజ్ చిన్న చిన్న మార్పులు సూచించాడట. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న రవితేజ సుధీర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ డ్రామాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. -
ప్రేమకథ మీద మనసుపడ్డాడు
మినిమమ్ బడ్జెట్ సినిమాల యంగ్ హీరోలలో మంచి డిమాండ్ ఉన్న స్టార్ నిఖిల్.. మూడు వరుస హిట్స్ తో సత్తా చాటిన ఈ యువ హీరో ప్రస్తుతం మరో ఎక్స్ పరిమెంటల్ సినిమాలో నటిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాను కాదని ప్రయోగాత్మకంగా అడుగులు వేస్తున్న నిఖిల్, త్వరలో ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్‌కు రెడీ అవుతున్నాడు. రవితేజను ఇమిటేట్ చేస్తున్నాడన్న అపవాదు నుండి బయటపడి, స్వామి రా రా..తో సక్సెస్ సాధించిన నిఖిల్, ఆ తరువాత కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో సమ్‌థింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలు కమర్షియల్‌గా కూడా సక్సెస్ సాధించటంతో నిఖిల్ మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరిగింది. అందుకే చాలా మంది దర్శకనిర్మాతలు నిఖిల్ హీరోగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. నిఖిల్ కూడా ఇక ప్రయోగాలను పక్కన పెట్టి రెగ్యులర్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. నిఖిల్ ప్రస్తుతం శంకరాభరణం పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. సందీప్ కిషన్ హీరోగా టైగర్ సినిమాను తెరకెక్కించిన వీఐ ఆనంద్ డైరెక్షన్ లో ఓ మాస్ లవ్ స్టోరికి ఓకె చెప్పాడు. చాలా రోజులుగా డిఫరెంట్ మూవీస్‌తో బోర్ ఫీల్ అయిన నిఖిల్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. మరి కమర్షియల్ ఫార్ములా నిఖిల్ కు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
వాళ్లలా ఉండాలని సన్నబడ్డాను!
స్వామి రారా, కార్తికేయ.. ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ, హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు నిఖిల్. ఆయన నటించిన తాజా చిత్రం ‘సూర్య వెర్సస్ సూర్య’ ఈ నెల 5న విడుదల కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం నటుడిగా తనకింకా పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని నిఖిల్ వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన విశేషాల్లో కొన్ని... సూర్య తేజస్సును తట్టుకోలేని సూర్య అనే యువకుడిగా ఈ చిత్రంలో నటించాను. పార్సీరియా అనే వ్యాధితో బాధపడుతుంటాను. పగటిపూటను భరించలేని నేను, పగలంటే విపరీతంగా ఇష్టపడే అమ్మాయిని ప్రేమిస్తాను. మా ప్రేమ ఎలా సక్సెస్ అయ్యిందనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రంలో ప్రత్యేకంగా విలన్లుండరు. సూర్యుడే శత్రువు. ఎక్కువ శాతం షూటింగ్ రాత్రి పూట చేశాం. ‘కార్తికేయ’ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని కెమెరామ్యాన్‌గా చేశారు. ‘సూర్య వెర్సస్ సూర్య’ కథను ఆయన చెప్పినప్పుడు ఉద్వేగానికి గురయ్యా. హాలీవుడ్ టాప్ స్టార్స్ టామ్ క్రూజ్, డస్టిన్ హాప్మ్యాన్ల శరీరాకృతి, హావభావాలు ఒకే వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటాడో సూర్య పాత్ర అలా ఉండాలని అప్పుడే చెప్పాడు. దాంతో కొంచెం సన్నబడ్డాను. శారీరక భాష మార్చుకున్నాను. ఏ పాత్రలో అయినా పూర్తిగా ఒదిగిపోయి, న్యాయం చేస్తా. జయాపజయాలు నా చేతుల్లో ఉండవు. నా గత చిత్రాలకు కష్టపడినట్లుగానే ఈ చిత్రానికీ కష్టపడ్డాను. రెండు విజయాల తర్వాత చేసిన ఈ సినిమా విజయం సాధించి, నాకు ‘హ్యాట్రిక్’ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళుతున్నా. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లి మూడు నెలలు యాక్టింగ్ కోర్స్ చేస్తా. నటనలో మరిన్ని టెక్నిక్స్ కోసం ఈ కోర్సు ఉపకరిస్తుందని నా నమ్మకం. -
కార్తీకేయ చిత్రం సక్సెస్‌మీట్
-
ముందు మాట్లాడేశాను... తరువాత భయపడ్డాను : నిఖిల్
‘‘‘కార్తికేయ’ విజయంపై మొదట్నుంచీ నాకు నమ్మకం. అందుకే... ప్రతి చోటా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడేశా. తర్వాత భయమేసింది. కారణం.. ఇది ‘స్వామి రారా’ తర్వాత వస్తున్న సినిమా. భారీ అంచనాలుంటాయి. కానీ చివరకు నాలోని భయాన్ని పటాపంచలు చేసింది ‘కార్తికేయ’. విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని నిఖిల్ అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మించిన చిత్రం ‘కార్తీకేయ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ- ‘‘హ్యాపీ డేస్, స్వామి రారా తర్వాత నా కెరీర్లో వచ్చిన మరో విజయం ఇది. అందరూ మనసుపెట్టి పనిచేయడం వల్లే ఈ సక్సెస్. ముఖ్యంగా దర్శకుని ఏడాదిన్నర కష్టం తెరపై కనిపించింది’’ అన్నారు. ‘‘మేధావులను సైతం మెప్పించిందీ సినిమా. ఎన్నో కష్టాలకోర్చి సినిమాను విడుదల చేసిన నిర్మాత ఆత్మస్థైర్యాన్ని అభినందించాలి’’ అని నటుడు రావు రమేశ్ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇంత మంచి సినిమా నేనే తీశానా అని ఆశ్చర్యంలో ఉన్నాను. ఈ కథ వినగానే కచ్చితంగా హిట్ అని అనిపించింది. అయితే... చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయడం కూడా ఎంత కష్టమో ఈ సినిమా ద్వారా తెలిసొచ్చింది’’ అన్నారు. సినిమా ఫలితంపై తనికెళ్ల భరణి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అక్కడ అద్భుతాలు చాలా జరిగాయి!
‘‘నాకు మార్గదర్శకులు లేరు. ఇప్పటికి తొమ్మిది సినిమాల్లో నటించాను. వాటి నుంచే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ‘యువత’ విజయం తర్వాత టకటకా సినిమాలకు సైన్ చేశాను. అన్నీ మాస్ సినిమాలే. ఫలితాలు మాత్రం అంచనాలకు భిన్నంగా వచ్చాయి. అందుకే మరోసారి అలాంటి తప్పు చేయకూడదనే..‘స్వామి రారా’ తర్వాత ఆలోచించి అడుగులేస్తున్నాను. ఒక్క ‘కార్తికేయ’ చిత్రాన్ని మాత్రమే ‘ఓకే’ చేశాను’’ అని చెప్పారు నిఖిల్. ఆయన హీరోగా రూపొందిన ‘కార్తికేయ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిఖిల్ విలేకరులతో ముచ్చటిస్తూ-‘‘ఇలాంటి సినిమాల నిర్మాణ దశలో అద్భుతాలు జరుగుతుంటాయని విన్నాను. అలాగే ఈ సినిమాక్కూడా జరిగాయి. నా ‘స్వామి రారా’ వినాయకుని చుట్టూ తిరిగే కథ. ‘కార్తికేయ’ కుమారస్వామి చుట్టూ తిరిగే కథ. ఇలా అన్నదమ్ముల నేపథ్యంలో సినిమాలు చేయడం యాదృచ్ఛికం. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉండే సుబ్రమణ్యపురం అనే గ్రామంలోని దేవాలయం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ‘షూటింగ్ సమయంలో.. ఏదో ఒకరోజు పాము రియల్‌గా లొకేషన్లో కనిపిస్తే సినిమా హిట్’ అని ఓ రోజు మా అసిస్టెంట్ డెరైక్టర్ అన్నాడు. పాము కనిపిస్తుందేమోనని గమనించేవాణ్ణి. బొబ్బిలి కోటలో షూటింగ్. అనుకోకుండా పెద్ద పాము పై నుంచి పడి, లొకేషన్లో భయపడకుండా నిలబడింది. దాంతో సినిమా హిట్ అని అందరం అనుకున్నాం. కార్తీక్ పేరున్న ఆరుగురు ఈ సినిమాకు పనిచేయడం మరో యాదృచ్ఛికమైన విషయం. ఇందులో నా పాత్ర పేరు కూడా కార్తీకే. అలాగే.. అరకులో షూటింగ్ అప్పుడు సరదాగా ఇప్పుడు వర్షం కురిస్తే బావుండు అనుకున్నాం. నిజంగానే కురిసింది. ఇలాంటి అద్భుతాలు చాలానే జరిగాయి’’ అని తెలిపారు. -
అప్పుడు తప్పకుండా ఆ శుభవార్త చెబుతా!
స్వాతిలో తెలీని మెస్మరైజింగ్ పవర్ ఉంది. కాసేపు మాట్లాడితే చాలు అయస్కాంతంలా ఆకర్షించేస్తుంది తను. ఆ క్వాలిటీనే... ఆమెను దక్షిణాదిన బిజీ తారని చేసింది. ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాలతో స్వాతి బిజీ బిజీ. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదే ‘బంగారు కోడిపెట్ట’. నవదీప్ ఇందులో హీరో. రాజ్ పిప్పళ్ల దర్శకుడు. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. అందుకే... శుక్రవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించింది స్వాతి. అప్పుడే ఏడాది కావొస్తుందా!: తెలుగులో నా సినిమా వచ్చి ఏడాది కావస్తుందంటే... నమ్మబుద్ధి కావడం లేదు. తమిళం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది. ‘బంగారు కోడిపెట్ట’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. పేరు భానుమతి పినిశెట్టి. చదివింది 8వ తరగతి. అమ్మానాన్న లేరు. అక్కాబావా దగ్గర ఉండటం ఇష్టం లేదు. అందుకే వారి నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నాలు. ఎవరితోనైనా సరే.. కంటిచూపుతోనే పనులు చేయించేసుకుంటా. ఇలా సాగుతుంది నా పాత్ర. ‘స్వామి రారా’లోని నా పాత్రతో పోలిస్తే ఎట్నుంచి చూసినా కొత్తగా ఉంటుందీ పాత్ర. తనకు మంచి బ్రేక్ రావాలి: కథే ఈ చిత్రానికి ప్రాణం. కొంత విలేజ్‌లో కొంత సిటీలో ఈ కథ సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజ్ పిప్పళ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ రాబరీ నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే ‘స్వామి రారా’కు పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకుడు కథను చెప్పిన తీరు సూపర్బ్. ప్రతి సన్నివేశం సంతృప్తికరంగా రావడానికి తను పడిన కృషి నిజంగా అభినందించదగిందే. ఇక నవదీప్ గురించి చెప్పాల్సి వస్తే... తనతో సినిమా చేస్తున్నాను అనగానే... చాలామంది రకరకాలుగా మాట్లాడారు. కానీ.. తనతో చేశాక అవన్నీ కరెక్ట్ కాదనిపించింది. నవదీప్ మంచి నటుడు. మంచి బ్రేక్ వస్తే తనేంటో నిరూపించుకోగలడు. ఈ సినిమాతో అది జరుగుతుంది. నిజంగా వారికి హేట్సాఫ్: గ్లామర్ పాత్రలకు నేను దూరం కాదు. అయితే.. దర్శక, నిర్మాతలు నన్ను ఆ కోణంలో చూడటం లేదు. ఆ విధంగా చూసుకుంటే నేను నిజంగా లక్కీనే. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయగలుగుతున్నాను. హీరోహీరోయిన్లు తొలిసారి కలిసినప్పుడు... మన సినిమాల్లో కొన్ని సింబాలిక్ షాట్స్ వేస్తారు. కానీ నిజజీవితంలో అలాంటివి జరగవు. నా సినిమాల్లో కూడా అలాంటివి ఉండవ్. సాధ్యమైనంతవరకూ నిజానికి దగ్గరగానే నా సినిమాలుంటాయి. గ్లామర్ పాత్రలతో పోలిస్తే... ఇలాంటి పాత్రలు చేయడమే నాకు తేలిక. గ్లామర్ ఇమేజ్ కోసం వారు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. డ్రెస్ దగ్గర్నుంచి నెయిల్ పాలిష్ వరకూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒళ్లు అలిసిపోయేలా డాన్సులు చేయాలి. అన్ని కష్టాలు భరిస్తే కానీ వారికి ఆ ఇమేజ్ రాదు. నిజంగా వారిని అభినందించాల్సిందే. అది సరైనది కాదు: నేను తెలుగమ్మాయిని అవడం వల్లే ఇక్కడ నన్ను ప్రోత్సహించడంలేదు అనడం సరికాదు. సినిమా అనేది బిజినెస్‌తో ముడిపడిన విషయం. ఇక్కడ క్రేజ్ ముఖ్యం. ఒక ముంబయ్ హీరోయిన్ తమ సినిమాలో కథానాయిక అంటే... అదో క్రేజ్ కదా. అందుకే... అది తప్పు అని నేను అనను. నేను నచ్చినవారి వద్ద నాకు నచ్చిన కథల్ని ఎంచుకుని ముందుకెళుతున్నాను. ఇదే నాకు కంఫర్ట్‌గా ఉంది. గ్లామర్ అంటే ఆమే: గ్లామర్ అంటే ఏంటి? అని ఎవరైనా అడిగితే... నేను సింపుల్‌గా చెప్పే సమాధానం శ్రీదేవి. ఆమె అందంగా కనిపిస్తుంది. అద్భుతంగా నటిస్తుంది. అందుకే అందానికి పర్యాయపదం ఆమె. నాకంటూ డ్రీమ్ రోల్స్ ఏమీ లేవు. మంచి పాత్రలు చేసుకుంటూ పోవడమే నా ముందున్న లక్ష్యం. ఇక రూమర్లు అంటారా! వాటిని అస్సలు పట్టించుకోను. పాజిటివ్ థింకింగ్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే భవిష్యత్తులో మనకు అంతా మంచే జరుగుతుంది. పెళ్లి గురించి కూడా చాలామంది అడుగుతుంటారు. ఒకరినొకరు భరించుకోవడమే దాంపత్యం అని నా ఉద్దేశం. అలా నన్ను భరించేవాడు, నేను భరించగలిగేవాడు దొరికినప్పుడు తప్పకుండా శుభవార్త చెబుతా. -
‘కార్తికేయ’ ప్రశ్నలు
‘స్వామి రారా’తో హిట్ పెయిర్ అనిపించుకున్న నిఖిల్, స్వాతి జంటగా రూపొందుతున్న తాజా చిత్రం ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న ఉండదని, ఒకవేళ సమాధానం దొరక్కపోతే మన ప్రయత్న లోపమే అని నమ్మే మనస్తత్వం హీరోది. ఈ నేపథ్యంలో అతనికి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? తద్వారా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటాడు? అనేది కీలక అంశం’’ అని చెప్పారు. మార్చి మొదటి వారంలో పాటలను, అదే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ