డబుల్ హ్యాపీగా ఉన్నా: శేఖర్‌చంద్ర
‘‘నా కెరీర్‌లోనే పెద్ద బ్రేక్ ‘కార్తికేయ’. ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ రూపంలో మరొకటి నా తలుపు తట్టింది. వరుస విజయాలు ఎంతో ఆనందానిస్తున్నాయి. డబుల్‌హ్యాపీగా ఉన్నా’’ అని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘చిన్నప్పట్నుంచీ సంగీతమంటే ప్రాణం. అందుకే కీబోర్డ్ నేర్చుకున్నాను. చెన్నైలో కర్ణాటక సంగీతం అభ్యసించాను. సంగీత దర్శకత్వం వహించాలని మాత్రం అనుకోలేదు.
కీరవాణి, కోటి నన్ను సంగీత దర్శకునిగా ప్రోత్సహించారు. రవిబాబు ‘అనసూయ’ చిత్రంతో సంగీత దర్శకుణ్ణి చేశారు’’ అని శేఖర్‌చంద్ర గుర్తు చేసుకున్నారు. ఇంకా మాట్లాడుతూ-‘‘రవిబాబుతో అనసూయ, నచ్చావులే, మనసారా, నువ్విలా, అవును.. చిత్రాలు చేశాను. అవన్నీ నాకు మంచి శిక్షణగా ఉపయోగపడ్డాయి. ‘కార్తికేయ’కు గొప్పగా సంగీతం చేశానని అంటున్నారంటే కారణం అదే. ప్రస్తుతం ‘అవును-2’, నక్కిన త్రినాథరావు రూపొందిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాలు చేస్తున్నాను’’ అని చెప్పారు.
ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, ఇళయరాజా, రెహ్మాన్, దేవిశ్రీ ప్రసాద్‌లు తనకు ప్రేరణ అనీ, పాప్ సంగీతాన్ని కూడా గమనిస్తుంటాననీ శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. సామాజిక స్పృహతో కూడిన మ్యూజిక్ ఆల్బమ్‌ని రూపొందించనున్నాననీ, ఆ వివరాలు త్వరలో చెబుతానని శేఖర్‌చంద్ర చెప్పారు.