మహా సంభాషణల నిధి | karunanidhi memories of movies | Sakshi
Sakshi News home page

మహా సంభాషణల నిధి

Published Wed, Aug 8 2018 1:21 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

karunanidhi memories of movies - Sakshi

‘‘మనస్సాక్షి నిద్రపోయేటప్పుడే మనసు కోతి ఊరు చుట్టడానికి బయల్దేరుతుంది’’‘‘అనుభవం అనేది ఒక పాఠశాల లాంటిది. అయితే అందులో అహంకారులు చదివితే గెలుపు ఉండదు’’‘‘తెగువ ఉన్నవాడికి దుఃఖం ఉండదు. తెగువ లేనివాడికి నిద్ర ఉండదు’’‘‘ద్రోహం చేసే స్నేహితులకన్నా ఎదిరించి నిలబడే పగవాళ్లు ఎంతో మేలు’’ ‘‘ఒంటరితనం లాంటి నరకం ఉండదు. దాన్ని మించిన స్నేహమూ ఉండదు’’.

‘కలైజ్ఞర్‌’ కరుణానిధి కలం నుంచి వచ్చిన సంభాషణలు ఇవి. ఇలాంటి అర్థవంతమైన డైలాగ్స్‌ ఎన్నింటినో రాసిన కరుణానిధికి చిన్నప్పటి నుంచీ రచనలంటే మక్కువ. యువరచయితలకు స్ఫూర్తిగా నిలిచేందుకు ఏకంగా ఓ సంస్థనే స్థాపించారాయన. 14 ఏళ్ల వయసులో నాటక రంగంలోకి అడుగుపెట్టిన కరుణానిధి పలు నాటకాల్లో నటించారు. ఆయన రచించిన తొలి నాటకం ‘పళనియప్పన్‌’. నాటక రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘తొళిలారన్‌ మిత్రన్‌’ అనే పత్రికలో ఆయన రాసిన ఓ వ్యాసం కాంగ్రెస్‌ పార్టీని విమర్శించేలా ఉండటంతో ఆ పార్టీ ప్రత్యర్థులు కరుణపై దాడి చేశారు. సమాజంలోని అసమానతలను వ్యతిరేకించడం కోసం నాటకాలు, సినిమాలు బలమైన ఆయుధం అన్నది ఆయన భావన. ‘తూక్కు మేడై’ అనే నాటకం అప్పుడు కరుణానిధికి నటుడు ఎం.ఆర్‌. రాధ (నటి రాధిక తండ్రి) ‘కలైజ్ఞర్‌’ అనే బిరుదు ఇచ్చారు. అంటే కళాకారుడు అని అర్థం. అప్పట్లోనే తన స్నేహితులతో కలిసి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు కరుణ. ద్రవిడ ఉద్యమంలో యువతను భాగస్వాములుగా చేస్తూ ‘యూత్‌ ఐకాన్‌’గా ఎదిగిన కరుణానిధి 18 ఏళ్ల వయసులో ‘మురసొలి’ పత్రికను ఆరంభించారు. అలాగే పెరియార్‌ ‘కుడియరసు’ పత్రికలోనూ అసిస్టెంట్‌గా ఎడిటర్‌గా చేశారు. కరుణానిధి రచనలు చదివి, అప్పటి చలన చిత్ర నిర్మాణ సంస్థ జూపిటర్‌ పిక్చర్స్‌ సినిమాకి రాయాల్సిందిగా కోరింది. కరుణ అందించిన స్క్రిప్ట్‌తో ఆ సంస్థ తీసిన చిత్రం ‘రాజకుమారి’. అప్పుడు కరుణానిధి వయసు 20 ఏళ్లు.

ఎంజీఆర్‌తో స్నేహం
వెండితెరపై కరుణానిధి కలం సత్తా చాటిన మొదటి చిత్రం ‘రాజకుమారి’లో నటించిన హీరో ‘ఎంజీఆర్‌’. ఆ సినిమాతోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ప్రత్యర్థులవుతారని అప్పుడు ఎవరూ ఊహించలేదు. అంతకుముందు చిన్న పాత్రలు చేసిన ఎంజీఆర్‌కు కథానాయకునిగా ఇది మొదటి సినిమా. ఆయన కెరీర్‌కి ‘రాజకుమారి’ మంచి పునాది అయింది. ఎంజీఆర్‌కి ‘పురట్చి నడిగర్‌’ అనే బిరుదును ఇచ్చింది కరుణాని«ధే. వాడి వేడి సంభాషణలతో సాగిన ఆ సినిమా రచయితగా కరుణానిధికీ మంచి అడుగు అయింది. ఆ తర్వాత ‘అభిమన్యు’, ‘మరుదనాట్టు ఇళవరసి’, ‘మందిర కుమారి’, ‘మలై కళ్లన్‌’ వంటి ఎంజీఆర్‌ నటించిన పలు హిట్‌ చిత్రాలకు రచయితగా వ్యవహరించారు కరుణానిధి. ‘మలై కళ్లన్‌’ హిందీలో ‘ఆజాద్‌’గా, తెలుగు, మలయాళ, కన్నడ, సింహళ భాషల్లోనూ రీమేక్‌ అయింది. తెలుగులో ‘అగ్గిరాముడు’ పేరుతో రీమేక్‌ చేశారు.

పరాశక్తి.. ఓ సంచలనం
పౌరాణిక చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో ఆ దిశను మార్చి, సాంఘిక చిత్రాలవైపు దారి మళ్లించిన ఘనత కరుణానిధిది. ద్రవిడ ఉద్యమ స్ఫూర్తిని తన డైలాగ్స్‌ ద్వారా సినిమాల్లో జొప్పించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ‘పరాశక్తి’ సినిమా ఈ కోవకే చెందుతుంది. తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పడంతో పాటు ద్రవిడ ఉద్యమం వైపు ప్రజలను ఆకర్షించడానికి ఉపయోగపడిన చిత్రం ఇది. సెన్సార్‌ సమస్యలు ఎదుర్కొన్నాక చివరికి ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైంది. బ్రాహ్మణులను విమర్శించే అంశాలు, హిందూ ఆచారాలను విమర్శించే అంశాలూ ఉన్నందున హిందువుల ఆగ్రహానికి గురైన సినిమా ఇది. సినిమాపై నిషేధం విధించారు కూడా. ఓ మహిళపై పురోహితుడు అత్యాచారం చేసే సీన్‌ కూడా సినిమాలో ఉంటుంది. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన  శివాజీ గణేశన్‌కి మంచి పేరొచ్చింది. ఆయన కెరీర్‌కి మంచి మలుపుగా నిలిచిన సినిమా ఇది. అలాగే శివాజీ కెరీర్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ‘మనోహర’ రచయితగా కూడా కరుణానిధే.

సాహసోపేతమైన రచనలతో...
కరుణానిధికి తెగువ ఎక్కువ. సమాజంలో జరిగే అన్యాయాలను ధైర్యంగా ప్రశ్నించేవారు. కథలు, సంభాషణల రూపంలో మంచి సందేశం ఇచ్చేవారు. ‘పనమ్‌’ (1952), ‘తంగరత్నం’ (1960) చిత్రాల్లో జమీందారీతనాన్ని అంతం చేయడం, వితంతు వివాహం, అంటరానితనం వంటి అంశాలను ప్రస్తావించారు. వితంతు వివాహం అంటే విడ్డూరం అని మాట్లాడుకునే రోజుల్లో కరుణానిధి మళ్లీ పెళ్లి అనే అంశంతో కథ రాయడమంటే సాహసమే. ఈ రెండు చిత్రాలకూ మంచి ఆదరణ లభించింది. 

చివరిగా పొన్నర్‌ శంకర్‌
1947లో విడుదలైన ‘రాజకుమారి’ నుంచి 2011లో వచ్చిన ‘పొన్నర్‌ శంకర్‌’ వరకూ పలు చిత్రాలకు కరుణానిధి çకథారచయితగా, సంభాషణల రచయితగా, పాటల రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా వ్యవహరించారు. కరుణానిధి రచించిన చివరి చిత్రం ‘పొన్నర్‌ శంకర్‌’. 1970లలో కరుణానిధి రాసిన ‘పొన్నర్‌ శంకర్‌’ నవల ఆధారంగా నటుడు త్యాగరాజన్‌ తన కుమారుడు ప్రశాంత్‌ని హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు. 2011లో విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాతి సంవత్సరం తెలుగులో ‘రాజకోట రహస్యం’గా రిలీజైంది.

తమిళ్‌లో టైటిల్‌ పెడితే పన్ను మినహాయింపు
మాతృభాష మీద కరుణానిధికి అపారమైన ప్రేమ. 2006లో డీఎంకె అధికారంలోకి వచ్చాక ఓ నిబంధన ప్రవేశపెట్టింది. ఇంగ్లిష్‌ పదాలు లేకుండా అచ్చ తమిళంలో టైటిల్స్‌ పెడితే ‘పన్ను మినహాయింపు’ అనే నిబంధనను విధించింది. తమిళ భాష అభివృద్ధికి డీఎంకె చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. అప్పటినుంచి అందరూ వీలైనంతవరకూ తమిళ టైటిల్స్‌నే పెట్టడం మొదలుపెట్టారు.

చిత్రసీమ నుంచి తొలి ముఖ్యమంత్రి
కరుణానిధి రాసిన పుస్తకాలు ఎన్నో. తమిళ్, తిరక్కురళ్‌ ఉరై, తెన్‌పాండి సింగమ్‌.. ఇలా పలు పుస్తకాలు ఉన్నాయి. కవితలు కూడా లెక్కపెట్టలేనన్ని. కరుణానిధి రాసిన చివరి సీరియల్‌ ‘శ్రీ రామానుజర్‌’. ఈ సీరియల్‌ రచన మొదలుపెట్టినప్పుడు కరుణానిధి వయసు 92. తమిళ సాహిత్యానికి చేసిన సేవలకుగాను కరుణానిధి పలు అవార్డులు అందుకున్నారు. భారతీయ చలన చిత్రసీమ నుంచి వచ్చిన తొలి ముఖ్యమంత్రి ఆయనే కావడం విశేషం. 

కరుణ కథలో జయలలిత
రాజకీయాల పరంగా కరుణానిధి, జయలలిత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లుగా ఉండేది. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాకి పని చేశారు. అదే ‘మణి మకుడం’. 1966లో వచ్చిన ఈ చిత్రానికి కరుణానిధి కథ అందించారు. ఎస్‌.ఎస్‌. రాజేంద్రన్, సీఆర్‌ విజయకుమారి, జయలలిత, ఎమ్‌.ఎన్‌. నంబియార్‌ కీలక పాత్రలు చేశారు. కాగా, కరుణానిధి రచయితగా వ్యవహరించిన ‘పరాశక్తి, మనోహర, పనమ్‌’ వంటి పలు చిత్రాలను నిర్మించినది ఎస్‌.ఎస్‌. రాజేంద్రనే. హీరోగా కూడా రాజేంద్రన్‌కి మంచి పేరుంది. కలైజ్ఞర్‌తో రాజేంద్రన్‌కి మంచి అనుబంధం ఉంది.

కరుణ సినిమాకి హాలీవుడ్‌ డైరెక్టర్‌
ఎల్లిస్‌ ఆర్‌. డంగన్‌... యూఎస్‌లో పుట్టిన ఈయన కాలేజీ డేస్‌లో మరో యూఎస్‌ స్నేహితుడి ఆహ్వానం మేరకు ఇండియా వచ్చారు. ఆ స్నేహితుడు మాణిక్‌ లాల టాండన్‌. అతను సినిమాల్లోకి రావాలనుకున్నాడు. కానీ కుదరలేదు. ఆ సమయంలోనే ఎల్లిస్‌కి సినిమాల మీద ఇష్టం ఏర్పడింది. టాండన్‌ ద్వారా నిర్మాత ఎ.ఎన్‌. మరుదాచలమ్‌తో ఎల్లిస్‌కి పరిచయమైంది. ఆయన ‘సతీలీలావతి’ సినిమా ద్వారా ఎల్లిస్‌ని దర్శకునిగా పరిచయం చేశారు. తమిళ సినిమాకి కొత్త కొత్త టెక్నిక్స్‌ని పరిచయం చేసిన ఎల్లిస్‌ ‘పొన్‌ముడి’ (1950) అనే సినిమాలో తీసిన రొమాంటిక్‌ సీన్స్‌కి విమర్శలకు గురయ్యారు. అదే ఏడాది కరుణానిధి అందించిన కథతో ‘మందిర కుమారి’ (అంటే ‘మంత్రి కుమారి’ అని అర్థం) అనే సినిమాని తెరకెక్కించారు ఎల్లిస్‌. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఎల్లిస్‌ దర్శకత్వం వహించిన చివరి భారతీయ సినిమా ఇదే. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్లిపోయారు.

1942లో సినిమా కెరీర్‌ని మొదలుపెట్టిన కరుణానిధి 2000 తర్వాత సినిమా పరంగా కొంచెం స్లో అయ్యారు. రాజకీయాల్లో బిజీగా ఉండటంవల్ల సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయారాయన. అయినప్పటికీ పలువురు దర్శక–నిర్మాతలు కథల కోసం ఆయన్ను సంప్రదించేవారు. అలా 2010లో ఆయన రాసిన సినిమా ‘పెన్‌ సింగమ్‌’. చిత్రదర్శకుడు బాలీ శ్రీరంగం కోరిన మీదట ఆ సినిమాకు స్క్రీప్‌ప్లే రాసి ఇచ్చారు. ఆ తర్వాత ఒక పాట కూడా రాసివ్వమన్నారు. పాట సందర్భం చెప్పమని, కేవలం పది నిమిషాల్లో చిత్రసంగీత దర్శకుడు దేవాకి లిరిక్స్‌ ఇచ్చేశారట. ఉదయ్‌కిరణ్‌ నటించిన మూడో తమిళ సినిమా ఇది.

సినిమాల్లో కరుణ వారసులు
‘ఒరే రక్తం’ పేరుతో కరుణానిధి రాసిన కథ ఆధారంగా అదే పేరుతో సినిమా వచ్చింది. ‘కుంగుమమ్‌’ పత్రికలో సీరియల్‌లా ఈ కథ ప్రచురితమైంది. కార్తీక్, భాగ్యలక్ష్మి, మాధురి లీడ్‌ రోల్స్‌ చేసిన ఈ సినిమా ద్వారా కరుణానిధి తనయుడు ఎం.కె. స్టాలిన్‌ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మక్కళ్‌ ఆణైయిట్టాల్‌’ అనే సినిమాతో పాటు ‘కురింజి మలర్‌’, ‘సూర్య’ అనే టీవీ సిరీస్‌లో నటించారు. 1978లో ‘నంబిక్కై నట్చత్తిరం’ సినిమా నిర్మించారు. సినిమాలకన్నా రాజకీయాలపైనే ఆసక్తి ఉండటంతో సినిమాలకు, టీవీ సిరీస్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు స్టాలిన్‌. అయితే స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ మాత్రం సినిమాలతో బిజీగా ఉన్నారు. 2008లో ‘కురువి’ చిత్రం ద్వారా నిర్మాతగా ప్రవేశించిన ఉదయనిధి ఆ తర్వాత పలు చిత్రాలు నిర్మించారు. వాటిలో సూర్యతో తీసిన ‘7ఆమ్‌ అరివు ఒకటి’. (‘సెవెన్త్‌ సెన్స్‌’). 2012లో ‘ఒరు కల్‌ ఒరు కన్నాడి’ చిత్రం ద్వారా హీరోగా మారారు. అప్పటినుంచి హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఉదయనిధి సతీమణి కృతికా 2013లో ‘వణక్కమ్‌ చెన్నై’ ద్వారా దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఇటీవల విజయ్‌ ఆంటోని హీరోగా ‘కాళీ’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇంకా కరుణానిధి మనవళ్లలో దయానిధి అళగిరి ముందు నిర్మాతగా కొనసాగుతున్నారు. మరో మనవడు అరుళ్‌నిధి హీరోగా కొనసాగుతున్నారు.  
– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement