ఆ విషయంలో ఎప్పుడూ అవమానాలే!
కేట్ విన్స్‌లెట్ పేరు చె బితే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా ‘టైటానిక్’. అప్పట్లో కుర్రకారు హృదయాలను మత్తెక్కించిన ఈ భామను చిన్నతనంలో ఎవరూ ఇష్టపడేవారు కాదట. దానికి కారణం పెద్దయ్యాక ఉన్నంత అందంగా కేట్ చిన్నప్పుడు ఉండకపోవడమే. ఇటీవల ఓ సందర్భంలో ఈ బ్యూటీయే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘నా అందం విషయంలో నాకెప్పుడూ అవమానాలు ఎదురయ్యేవి. నా టీనేజ్‌లో నా గురించి కనీసం ఒక్కరు కూడా పాజిటివ్‌గా మాట్లాడిన అనుభవం నాకు లేదు.
కొంచెం వయసు పెరిగాక అందంగా తయారయ్యాను. అప్పట్నుంచీ నాకే విసుగు పుట్టేంత అభినందనలు వచ్చాయి. అయితే, ఆ అభినందనలు రాకముందు.. నాలో ఓ పట్టుదల ఉండేది. బాహ్య సౌందర్యం ప్రధానం కాదు.. ప్రతిభే ముఖ్యం అనుకున్నాను. అందుకే, ఏ రంగంలోకి అడుగుపెట్టినా ప్రతిభను నమ్ముకుని పైకి రావాలనుకున్నాను. నా ప్రతిభకు అందం కూడా తోడవ్వడంతో అందరి మెప్పు పొందగలిగాను’’ అన్నారు.