వార్ ఫొటోగ్రాఫర్‌గా!
‘టైటానిక్’ ఫేం కేట్ విన్స్‌లెట్ ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకునే పని మీద ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆ యుద్ధం కీలకాంశంగా రూపొందనున్న ఓ చిత్రంలో నటించనున్నారామె. ప్రఖ్యాత మోడల్, ఫొటో జర్నలిస్ట్ ఎలిజబెత్ లీ మిల్లర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ‘వోగ్’ మ్యాగజైన్ తరఫున వార్ ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు లీ మిల్లర్.యుద్ధానికి ముందు.. యుద్ధం తర్వాత నెలకొన్న మార్పుల తాలూకు ప్రభావం స్త్రీల పై ఎంత ఉంది? అనే విషయాన్ని కవర్ చేశారామె.
అప్పట్లో తన కెమెరాలో ఆమె బంధించిన చిత్రాలు ఓ సెన్సేషన్. లీ మిల్లర్ చనిపోయి 38 ఏళ్లయ్యింది. ఇప్పుడామె జీవితం ఆధారంగా తీయనున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు కేట్ విన్స్‌లెట్ అయితేనే బాగుంటుందని ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఆస్ట్రేలియన్ నిర్మాణ సంస్థ హాప్‌స్కాచ్ ఫ్యూచర్స్ భావించింది.
లీ మిల్లర్ తనయుడు ఆంటోని పెన్‌రోజ్ కూడా తన తల్లి పాత్రకు కేట్ తప్ప వేరే ఎవరూ నప్పరని సదరు నిర్మాణ సంస్థతో అన్నారట. తల్లి జీవితంతో ఆయన రాసిన ‘ది లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రదర్శకుణ్ణి ఎంపిక చేసే పని మీద ఉన్నారు. లీ మిల్లర్ చనిపోయేనాటికి కేట్ విన్స్‌లెట్ రెండేళ్ల చిన్నారి. సో.. ఆమె గురించి కేట్‌కి పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదు. అందుకే, ఆంటోని పెన్‌రోజ్ రాసిన పుస్తకాన్ని చదువుతున్నారట. అలాగే, లీ మిల్లర్ ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ఆమె ఫొటోగ్రాఫ్స్, డైరీలు పరిశీలిస్తున్నారట.