కత్రినా.. బొమ్మయిపోయింది!
లండన్ : లండన్లోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్కు చోటుదక్కింది. ఇటీవల టుస్సాడ్ వెబ్సైట్, పంజాబ్ రేడియో సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ పోటీలో ప్రియాంకా చోప్రా, దీపికా పడుకోన్ను వెనక్కి నెట్టి కత్రినా ఈ గౌరవాన్ని దక్కించుకుంది. హోరా హోరీగా జరిగిన ఈ పోటీలో 2.25 లక్షల మందికి పైగా నెటిజన్లు కత్రినాకు ఓటు వేశారు.
మైనపు బొమ్మల ప్రదర్శనశాలలో స్థానాన్ని దక్కించుకున్న ఏడో బాలీవుడ్ నటిగాఖ్యాతి దక్కించుకుంది. ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ , మాధురీ దీక్షిత్ బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను మ్యూజియంలో ప్రతిష్టించే ఈ పరంపర గత 150 ఏళ్లుగా సాగుతోంది. దాదాపు 500 బొమ్మలు ఇక్కడ కొలువుదీరాయి. బంగారు, వెండివర్ణాల కలబోసిన టూ పీస్ డ్రెస్లో డాన్స్ చేస్తున్న పోజులో ఉన్న తన మైనపు బొమ్మను చూసిన కత్రినా.. వావ్... అద్భుతం, అచ్చం నాలాగే ఉందే అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోందట.