
సాక్షి, సినిమా: నటి కీర్తిసురేశ్ దేశం గర్వించదగిన మహానటి సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగుతోంది. మహానటి సావిత్రి పాత్రలో అంతగా ఒదిగిపోయి నటించిందనే అభినందనల జల్లులో తడిసి ముద్దయిపోతున్న కీర్తిసురేశ్ గురించి ప్రస్తుతం చాలా విషయాలు ప్రచారం అవుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర తెరకెక్కనుందని, అందులో జయలలితగా కీర్తిసురేశ్ నటించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
అదేవిధంగా సావిత్రి పాత్రలో కీర్తి నటనను ప్రశంసించిన ప్రముఖుల్లో దర్శకుడు రాజమౌళి ఒకరు. ఆయన తాజాగా జూనియర్ ఎన్‌టీఆర్, రామచరణ్ కథానాయకులుగా భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక కథానాయకిగా కీర్తిసురేశ్ నటించనున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అయితే మహానటి సినిమా విజయవంతం కావడంతో కీర్తి మంగళవారం తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చాలా కాలంగా స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నానని, అయితే షూటింగ్స్ బిజీతో కుదరలేదని చెప్పింది. అదేవిధంగా తాను జయలలిత పాత్రలో నటించనున్నట్లు ప్రాచారం జరుగుతోందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జయలలిత పాత్రనే కాదు ఏ ఇతర బయోపిక్‌లోనూ నటించడం లేదని పేర్కొన్నారు. అయితే రాజమౌళి చిత్రంలో నటించే విషయం గురించి ఎలాంటి అభిప్రాయాన్ని కీర్తి వ్యక్తం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment