హాలీవుడ్ స్టార్ ఉమా థర్మన్, హాలీవుడ్ ర్ డైరెక్టర్ క్వెంటీన్ టరంటీనో
‘ఆరోజు ఆ షూటింగ్ స్పాట్‌లో, ఆ యాక్సిడెంట్‌తో నన్ను చంపాలనుకున్నారు..’ అంటూ హాలీవుడ్ స్టార్ ఉమా థర్మన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వారం రోజులుగా సంచలనం సృష్టిస్తోంది. ఆమె తనను చంపాలనుకున్నట్టు చెబుతూ ప్రకటించిన పేర్లలో హాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్ క్వెంటీన్ టరంటీనో ఉండడం ఇక్కడ చర్చకు కారణమైంది. దాదాపు పదిహేనేళ్ల కిందట జరిగిన యాక్సిడెంట్ అది. ఇప్పుడు చర్చ జరుగుతున్నది దాని మీదే.
ఎలా జరిగిందీ యాక్సిడెంట్?
క్వెంటిన్ టరంటీనో దర్శకత్వంలో ‘కిల్‌బిల్’ (2003) సినిమా తెరకెక్కుతోంది. అందులో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఉమా థర్మన్ అడవిలో ఉన్న ఒక రోడ్ మీద వేగంగా కారు నడుపుతూ వెళ్లాలి. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో థర్మన్ కారు నడుపుతూ చెట్ల మధ్యలోంచి దూసుకెళ్తోంది. సడెన్‌గా ఓ దగ్గర మలుపొచ్చింది. ఆమె ఆ మలుపును చూసి కార్‌ను కంట్రోల్ చేస్కోలేక రోడ్డుకి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఆ యాక్సిడెంట్‌లో ఆమె మోకాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉదర భాగానికి స్టీరింగ్ గట్టిగా ఢీ కొట్టింది. ప్రాణాలే పోయాయనుకుంది ఆ క్షణం. పదిహేనేళ్లు దాటినా థర్మన్‌ను ఆ గాయాలింకా బాధపెడుతూనే ఉన్నాయి.
థర్మన్ ఏమంటోందంటే..
హార్వీ వెయిన్‌స్టీన్ అనే నిర్మాతపై లైంగిక ఆరోపణలు రావడం, తద్వారా ‘మీటూ’ అన్న ఒక ఉద్యమమే పుట్టడం గతేడాది చూశాం. ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై థర్మన్ కూడా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ‘కిల్‌బిల్’ టైమ్‌లో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా చెప్పిందామె. ‘‘అది నన్ను చంపడానికి వేసిన ప్లాన్. స్టంట్‌మెన్‌తో ఆ సీన్ చేయించమని చెప్పినా టరంటీనో దానికి ఒప్పుకోలేదు. ఆ కారు కండీషన్ బాగాలేదు. కావాలనే ఇన్నేళ్లైనా ఆ యాక్సిడెంట్ విజువల్స్ సాక్ష్యాలకు అందకుండా నిర్మాత వెయిన్‌స్టీన్ నాకు చూపించలేదు’’ అని వాదించింది థర్మన్. ఆ యాక్సిడెంట్‌లో తనకు అయిన గాయాలు ఈరోజుకీ బాధిస్తున్నాయని చెప్పిందామె.
టరంటీనో ఏమంటున్నాడు...
‘‘నా కెరీర్‌లోనే కాదు. నా జీవితంలోనే నేను చేసిన దిద్దుకోలేని తప్పది..’’ అన్నాడు టరంటీనో, తనపై థర్మన్ చేసిన ఆరోపణలకు సమాధానంగా. కాకపోతే అది కావాలని చేసింది కాదని కూడా ఆయన అన్నాడు. ‘‘ఆ రోడ్ అంతా స్ట్రెయిట్‌గా ఉందని నేననుకున్నా. అసలా మలుపు ఉందన్న విషయం గ్రహించలేదు. అది నా తప్పే. జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు..’’ అని చెబుతూ, థర్మన్‌కు క్షమాపణలు చెప్పాడు టరంటీనో. ఆ యాక్సిడెంట్ విజువల్స్‌ను థర్మన్‌కు తానే స్వయంగా పంపించాడు కూడా!
చివరకు ఈ కథ ఎక్కడికొచ్చింది?
ఈ కథ పదిహేనేళ్ల తర్వాత మొన్నే మళ్లీ మొదలైంది. ఇంకా చివరకు రాలేదు కానీ, ఎవరెవరు ఏమేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసుకున్నారు. టరంటీనో ఇచ్చిన సమాధానం తర్వాత అతణ్ణి థర్మన్ పొగిడింది. ‘‘ఈ విజువల్స్‌ను బయటకు తేవడానికి టరంటీనో పెద్ద సాహసమే చేసి ఉండాలి. ఆయన చూపిన తెగువకు గర్వంగా కూడా ఉంది’’ అంటూ నిర్మాతలు హార్వీ వెయిన్‌స్టీన్, లారెన్స్ బెండర్, ఇ. బెన్నెట్‌లు ఇంతకాలం ఈ వీడియో తనకు అందకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చింది థర్మన్. నిర్మాతలైతే దీన్ని ఖండిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా బాగా ట్రెండింగ్. టరంటీనోను థర్మన్ క్షమించినా నెటిజన్లు మాత్రం క్షమించడం లేదు. ఇందులో అసలు ట్విస్ట్ అంటే ఇదే! ఇంకా ఈ కథ ఏయే మలుపులు తిరుగుతుందో చూడాలి!!
Comments
Please login to add a commentAdd a comment