అనువాదం హక్కులు 30 కోట్లు?
రజనీకాంత్. ఈ పేరే ఒక ప్రభంజనం. ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ ఏ ముహూర్తంలో శివాజీ రావుకు రజనీకాంత్ అని నామకరణం చేశారో గానీ అప్పటి నుంచే ఈ సంచలన నటుడిని అదృష్ట దేవత వరించింది. నేటికీ రజనీకాంత్ అదృష్ట దేవతకు అత్యంత ప్రీతిపాత్రుడిగానే ఉండిపోయారు. వయసును చూస్తే ఆరు పదులకు పైనే నటుడుగా మూడు పదులకు పైనే అనుభవం. అయితే ఈ సూపర్ స్టార్ తన అభిమానులకు నేటికీ పాతికేళ్ల నటుడే. అందుకే అయ్యారాయన ఇండియన్ సూపర్ స్టార్. రజనీకాంత్ చిత్రం ప్రారంభం అయిందంటే ఇటు వ్యాపార వర్గాల్లోనూ అటు అభిమానుల్లోనూ అది కలిగించే సంచలనం అంతా ఇంతా కాదు. నేటికీ జయాపజాయలకతీతంగా ఈస్టార్ చిత్రాల వ్యాపారం జరుగుతుందనడానికి లింగా చిత్రానికి పెరుగుతున్న క్రేజీ నిదర్శనం.
ఒక పక్క ఇటీవల తెరపైకి వచ్చిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా తాజా చిత్రం లింగా పై అది ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం రజనీ స్టారిజంకు నిదర్శనం. లింగా చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అయినా ఆ చిత్రం వ్యాపార వ్యవహారం జోరందుకుంది. ఈ చిత్రానికి ఒక్క తెలుగు అనువాదపు హక్కులే 30 కోట్లు పలకడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రజనీ నటించిన ఎందిరన్ చిత్రం టాలీవుడ్‌లో 27 కోట్లకు అమ్ముడుపోగా తాజా చిత్రం 30 కోట్లకు ఆఫర్ రావడం ఇప్పటికే ఎవరెస్ట్ శిఖరంపై కూర్చున్న రజనీ పవర్‌ను మరింత పెంచుతోందనడానికి నిదర్శనం. ఈ చిత్రం ముందు ముందు ఇలాంటి సంచలన రికార్డులను ఎన్నింటిని బద్దలుకొట్టనుందో. ముత్తు, పడయప్ప చిత్రాల తరువాత రజనీకాంత్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కలయికలో వస్తున్న ఈ చిత్రంలో అందాల భామ అనుష్క, ముంబాయి బ్యూటీ సోనాక్షి సిన్హాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.