
భరత్ అనే నేనులో ఓ దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : భరత్ అనే నేను ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఓరియంటల్ చిత్రం తెరకెక్కించాననే సంకేతాలను దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే అందించేశాడు. విజన్ ఆఫ్ భరత్ పేరిట ‘ప్రామిస్’ టీజర్‌ను ప్రస్తుత రాజకీయాలకు అన్వయిస్తూ కొందరు వైరల్ చేసేస్తున్నారు. హామీల పేరిట మాటలు తప్ప.. చేతలు చేయలేని నేతలకు ఇది సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల హక్కుల గురించి తరచూ స్పందిస్తున్న కొరటాల భరత్ అనే నేను ద్వారా చాలా వరకు ప్రధానాంశాలను ప్రేక్షకుల ముందుంచే యత్నం చేయబోతున్నాడంట. విద్యా వ్యవస్థలోని లోపాలు-పోరాటం, గ్రామాల అభివృద్ధి లాంటి విషయాలతోపాటు.. రాజకీయాల యాంగిల్‌లో పార్టీ ఫిరాయింపులు, కేంద్రం ఇచ్చే నిధులు వంటి అంశాల ప్రస్తావన కూడా ఉండబోతోందని తెలుస్తోంది.
ఇక భరత్ రామ్(మహేష్ బాబు పాత్ర) అనే యువకుడు ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు ఇచ్చే ప్రామిస్(హామీలను)ను నెరవేర్చేందుకు చేసే యత్నం.. దానికి కమర్షియల్ మసాలాను అద్ది ప్రేక్షకులకు వడ్డించబోతున్నట్లు స్ఫష్టమౌతోంది. సమకాలీన రాజకీయాలతో రాబోతున్న కొరటాల దానిని ప్రజల్లోకి గనుక ఎక్కిస్తే మరో బ్లాక్ బస్టర్‌ను అందుకోవటం ఖాయమనే మాట వినిపిస్తోంది. మొత్తానికి కొరటాల రైట్ టైమ్ లో.. రైట్ మూవీతోనే రాబోతున్నాడన్నది సినీ విశ్లేషకుల మాట.