Kousalya Krishnamurthy Movie Review, in Telugu | ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ | Aishwarya Rajesh, Sivakarthikeya - Sakshi
Sakshi News home page

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

Published Fri, Aug 23 2019 8:01 AM | Last Updated on Fri, Sep 13 2019 11:19 AM

Kousalya Krishnamurthy Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : కౌసల్య కృష్ణమూర్తి
జానర్‌ : ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా
నటీనటులు : ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్ర ప్రసాద్‌, ఝాన్సీ, శివ కార్తీకేయన్‌, కార్తీక్‌ రాజు తదితరులు
సంగీతం : దిబు నైనన్‌ థామస్‌
నిర్మాత : కేఎ వల్లభ
దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు

తమిళంలో బిజీ హీరోయిన్‌గా ఉన్న ఐశ్వర్యా రాజేష్‌, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సరైన చిత్రంతో ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూశాను.. అందుకే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. తమిళంలో ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా రూపొందించిన ‘కణా’ ను మళ్లీ తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా రీమేక్‌ చేశారు. మరి ఈ చిత్రం ఐశ్వర్యకు తెలుగులో మంచి విజయాన్ని అందించిందా? టాలీవుడ్‌లోనూ ఐశ్వర్యా సత్తాచాటిందా? అనేది చూద్దాం.

కథ :
ఇరగవరం అనే గ్రామంలో ఉండే కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్‌)కి వ్యవసాయం, క్రికెట్‌ అంటే ఇష్టం. ఒకవైపు తండ్రి చనిపోయి ఉంటే మరోవైపు క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ ఉంటాడు. ఇండియా మ్యాచ్‌ ఓడిపోయిందని తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన కౌసల్య(ఐశ్వర్యా రాజేష్‌).. తాను పెద్ద క్రికెటర్‌ అయి, ఇండియా తరుపున ఆడి, టీమ్‌ను గెలిపించి, తండ్రిని సంతోషపెడుదామనే ఆలోచనతో పెరుగుతుంది. ఓ ఆడపిల్ల ఆటలంటూ బయటకి రావడం.. సమాజం చిన్నచూపు చూడటం.. ఇరుగుపొరుగు హేలన చేయడం.. ఇవన్నీ దాటుకుని కౌసల్య తన కలను ఎలా సాధించిందన్నదే కౌసల్య కృష్ణమూర్తి కథ.

నటీనటులు:
చిన్నప్పటి నుంచి తండ్రి ఇష్టాన్ని చూస్తూ పెరిగి.. తన తండ్రి కన్న కల కోసం పాటుపడే కౌసల్య పాత్రలో ఐశ్యర్యా రాజేష్‌ అద్భుతంగా నటించింది. కళ్లతోనే భావాలను పలికించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా కనిపించేందుకు ఐశ్వర్య పడిని శ్రమ తెరమీద కనిపించింది. భూమినే ప్రాణంగా నమ్ముకునే రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ చక్కగా నటించాడు. రైతు పడే కష్టాలను చూపించే సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. కృష్ణమూర్తి భార్యగా, కౌసల్య తల్లి సావిత్రి పాత్రలో ఝాన్ని తన అనుభవాన్ని చూపించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో ముగ్గురూ పోటీపడి మరీ నటించారన్నట్లుగా ఉంది. కౌసల్యను ప్రేమిస్తూ.. ఆమె లక్ష్య సాధనలో సాయపడే సాయికృష్ణ పాత్రలో కార్తీక్‌ రాజు బాగానే నటించాడు. ప్రత్యేక పాత్రలో నటించిన శివ కార్తికేయన్‌ ఆకట్టుకున్నాడు. మిగిలిన వారంతా తమ పాత్రపరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ :
కౌసల్య కృష్ణమూర్తి.. తమిళ హిట్‌ కణా మూవీకి రీమేక్‌. అయితే ఈ మధ్య ఏ భాషలోనైనా సరే ఓ సినిమా బాగుందనే టాక్‌ వస్తే మన ప్రేక్షకులు చూసేస్తున్నారు. ఇదే ఈ సినిమాకు నెగెటివ్‌గా మారొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. కథలో ఉన్న ఫీల్‌ను మిస్‌ చేయకుండా, మన నేటివిటీకి తగ్గట్టు చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు  భీమినేని శ్రీనివాసరావు.

క్రీడా నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలు రాగా.. క్రికెట్‌ను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలను కూడా గతంలో మనం చూశాం. ఈ చిత్రానికి వచ్చే సరికి కథ కొత్తది కాకపోయినా.. రైతుల కష్టాలను కథలో భాగం చేస్తూ కథనాన్ని రాసుకున్నారు. ఈ మూవీలో క్రికెట్‌ను ఓ ట్రాక్‌గా చూపిస్తూనే.. రైతు, వ్యవసాయం గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ వైపు క్రికెటర్‌గా ఎదిగేందుకు కౌసల్య పడే కష్టాలను చూపిస్తూ.. మరోవైపు ఈ దేశంలో రైతుగా బతకడం ఎంత కష్టమో, వారు అనుభవించే దుర్భర పరిస్థితులను చూపించాడు. అయితే కథనం ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం కాస్త నిరాశపరుస్తుంది.

రైతు గురించి చెప్పే డైలాగ్‌లు, క్లైమాక్స్‌లో హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం మేజర్‌ ప్లస్‌. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్యం సంగీతంతో మరో లెవల్‌లో చూపించాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ విభాగాలు సినిమాకు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్‌ :
ఐశ్వర్యా రాజేష్‌
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
తెలిసిన కథ
ఊహకందేలా సాగే కథనం

బండ కళ్యాణ్‌, సాక్షి వెబ్‌డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement