
కృష్ణారెడ్డి శైలిలో యమా వినోదం
యమ ధర్మరాజు అంటే మనకు భయం. కానీ, బాక్సాఫీస్‌కి మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే యమధర్మరాజు వెండితెర మీద కనపడితే కాసుల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా తెలుగు తెరపై యమలోకపు నేపథ్యం అనేది ఓ విజయవంతమైన ఫార్ములా. టాప్ టెన్ యమ చిత్రాల్లో ఒకటిగా నిలిచే చిత్రం ‘యమలీల’. ఇప్పటికీ ఆ సినిమాకు క్రేజ్ ఉంది. ఇప్పుడు దానికి రెండో వెర్షన్ సిద్ధమవుతోంది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు నటిస్తున్నారు. కె.వి. సతీష్, దియా నికోలస్ నాయకా నాయికలు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో డీయస్ మాక్స్-క్రిష్వీ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘యమలీల’ స్థాయికి తగ్గకుండా ఈ ‘యమలీల 2’ ఉంటుందని, ఈ చిత్రకథాంశం విభిన్నంగా ఉంటుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోందని, కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని సతీష్ అన్నారు. తెలుగు తెరకు కె.వి. సతీష్ రూపంలో మరో మంచి హీరో దొరికారని అచ్చిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి శైలిలోనే ఇందులో యమా రేంజ్‌లో వినోదం ఉంటుందని ఆయన తెలిపారు. జూలైలో పాటలను, ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమేరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్