ఈ కథలోని కిక్ అలాంటిది!
‘‘నాకు కథలు ఒక పట్టాన నచ్చవు. కానీ... ఈ కథను మాత్రం సింగిల్ సిట్టింగ్‌లో ‘ఓకే’ చేశాను. ఈ కథలోని కిక్ అలాంటిది. అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్ర ఇందులో చేస్తున్నాను’’ అని మంచు లక్ష్మి అన్నారు. ఆమె ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పిలవని పేరంటం’. వెంకన్నబాబు యేపుగంటి దర్శకుడు. నాలి సుబ్బారావు(సుబ్బు) నిర్మాత. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి మోహన్‌బాబు సతీమణి నిర్మల కెమేరా స్విచాన్ చేయగా, కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చి, గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత మాట్లాడుతూ -‘‘‘జగన్ నిర్దోషి’ చిత్ర దర్శకుడు వెంకన్నబాబు చెప్పిన ఈ కథ నా మనసును తాకింది. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు మంచు లక్ష్మి అయితేనే కరెక్ట్ అనుకున్నాం. ఆమె కూడా అడగ్గానే చేయడానికి అంగీకరించారు. నటుడు ధన్‌రాజ్ కూడా ఒక ఆర్టిస్ట్‌గానే కాక, వ్యక్తిగతంగా కూడా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. డిసెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ -‘‘ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, బూచమ్మ-బూచోడు చిత్రాల తరహాలో సాగే కామెడీ హారర్ చిత్రమిది. నాది చాలా మంచి పాత్ర.
ఇందులో విలన్‌గా ఓ ప్రముఖ హీరో నటిస్తున్నారు’’ అని తెలిపారు. ఉత్కంఠకు గురిచేసేలా ఇందులో సన్నివేశాలుంటాయనీ, స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం కథ మొత్తం మంచు లక్ష్మి చుట్టూనే తిరుగుతుందనీ దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో ఓ మంచి పాత్ర పోషిస్తున్నానని ‘నేనింతే’ఫేం సియా గౌతమ్ తెలిపారు. కేష, కృష్ణుడు, పృథ్వీరాజ్, రఘు కారుమంచి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వెంకటేశ్ కిలారి, కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం: విజయ్ కురాకుల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఖాదర్ గోరి, దేవర శ్రీకాంత్‌రెడ్డి.