అప్పుడు నో... ఇప్పుడు ఓకే
ఆడ వారి మాటలకు అర్థాలే అనడానికి నిదర్శనం నటి లక్ష్మీరాయ్. హీరోయిన్ల కోపానికి కారణాలే వేరులే అనిపిస్తుంది. చిత్రంలో ఉన్నానా? లేదా? అంటూ దర్శక నిర్మాతలపై ఆగ్రహంతో చిత్రం నుంచి వైదొలగిన ఈ అమ్మడు తాజాగా మళ్లీ అదే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అసలు విషయంలో కెళితే అధర్వ, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం ఇరుంబు కుదిరై. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటి లక్ష్మీరాయ్‌ను ఎంపిక చేశారు.
అయితే చిత్ర షూటింగ్ 60 శాతం పూర్తి అయినా ఈ బ్యూటీని షూటింగ్‌కు పిలవలేదు. దీంతో చిరైత్తడంతో ఈమె ఇరుంబుకుదిరై చిత్రంలో తానున్నానా, లేదా అంటూ ఆవేశంతో దర్శక నిర్మాతపై చిర్రుబుర్రులాడి చిత్రం నుంచి వైదొలగినట్లు వార్తలకెక్కేశారు. ఇరుంబు కుదిరై చిత్రంలో తానున్నానో లేదో తెలియదు. దీంతో ఇతర చిత్రాలకు కాల్‌షీట్స్ కేటాయించాలో లేదో తెలియదు. అందుకే చిత్రం నుంచి తప్పుకున్నానని ప్రకటించేశారు. ఇది ఇంతకు ముందు కథ. ఇప్పుడు మళ్లీ ఆ చిత్రంలో నటించడానికి లక్ష్మీరాయ్ సిద్ధం అవడం విశేషం.
ఇటీవల ఆమెతో మాట్లాడిన దర్శక నిర్మాతలు లక్ష్మీరాయ్ తమ చిత్రంలో నటిస్తున్నారని ప్రకటించారు. ఇరుంబుకుదిరై చిత్రంలో లక్ష్మీరాయ్ ఇక నటించే అవకాశం లేదని భావించిన వారికి ఇది షాక్‌కు గురి చేసే అంశమే. అంతేకాదు. ఇరుంబుకుదిరై చిత్రంలో తాను నటించనున్నట్లు, ఇంతకు ముందెప్పుడూ పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నట్లు లక్ష్మీరాయ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి చిత్ర దర్శకుడు యువరాజ్‌ను అడగ్గా నిజమే లక్ష్మీరాయ్ తమ చిత్రంలో పరుగుల రాణిగా నటించనున్నారని వెల్లడించారు. అప్పుడు వైదొలగడానికి, మళ్లీ ఇప్పుడు నటించమనడానికి కారణం ఏమిటన్న ప్రశ్న కు మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు.