సాక్షి ప్రతినిధి, చెన్నై : చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై తమిళనాడులోనూ కుట్రలు జరుగుతున్నాయి. మొక్కుబడిగా సినిమాను రిలీజ్ చేసి రెండురోజుల్లో ఎత్తివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఏపీలోని ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల వారికి చెన్నైకి వచ్చి సినిమా చూసే అవకాశం ఉందన్న కారణంతో ఒక పథకం ప్రకారం ఈ చిత్రాన్ని తొక్కేస్తున్నారు. సినిమా రిలీజుకు ముందు సత్యం థియేటర్ కాంప్లెక్స్‌లో విడుదలయ్యే చిత్రాల జాబితాను దినపత్రికలకు విడుదల చేస్తుంటారు. విడుదలకు ముందు రోజు చిత్రం పేరును జాబితాలో పెట్టి వెంటనే ‘హోల్డ్’ అని ఉంచారు.
దేశంలోని అనేక నగరాల్లో ఈ చిత్రం నాలుగు షోలతో 30 నుంచి 90 థియేటర్ల వరకు ప్రదర్శితం అవుతుండగా చెన్నైలో ఐదు నుంచి పది థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తున్నారు. వీటిల్లో రెండు, మూడు మినహా మిగిలిన థియేటర్లలో ఒకే షో, అది కూడా అసౌకర్యమైన వేళల్లో ప్రదర్శిస్తున్నారు. ఈరోజుంటే రేపు లేకుండా చేస్తూ థియేటర్లను, వేళలను తరచూ మారుస్తున్నారు. హౌస్‌ఫుల్‌గా సాగుతున్నా షోల సంఖ్య లేదా థియేటర్ల సంఖ్య పెంచడం లేదు. చెన్నై మినహా సరిహద్దు జిల్లాల్లో మరెక్కడా ప్రదర్శితం కాలేదు. చెన్నైలోని ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమయ్యే సినిమాల జాబితాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూడాలనుకునే ప్రేక్షకులను గందరగోళానికి గురిచేయడం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని చిత్రరంగంతో పరిచయం ఉన్న కొందరు తెలుగు ప్రముఖుల కుట్రలు చేస్తున్నారు. ఈనెల 11న ఏపీలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హౌస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ సినిమాను గురు లేదా శుక్రవారాల్లో పూర్తిగా ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment