సౌతిండియన్ లుక్ వల్లే ‘తిక్క’లో అవకాశం వచ్చింది!
- లారిస్సా బొనేసి
బ్రెజిల్ అమ్మాయి లారిస్సా బొనేసి తెలుగు తెరపై జిగేల్‌మని మెరిసిపోవాలని కలలుగంటోంది. సాయిధరమ్‌తేజ్ సరసన ‘తిక్క’లో నటించిన ఆమె భవిష్యత్తులో మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో కలసి నటించడమే లక్ష్యమంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా బాగుందనీ, ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్న తీరు, చూపుతున్న ప్రేమాభిమానాలు కట్టిపడేశాయని చెబుతోంది. తెరపై తనను తాను చూసుకొన్నప్పుడు అచ్చం తెలుగమ్మాయిల్లాగే కనిపించానని ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స పతాకంపై సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించిన ‘తిక్క’ ఈ నెల 13న విడుదలతోంది. ఈ సందర్భంగా ‘తిక్క’ అవకాశం, ఆ సినిమా సెట్లో తనకి ఎదురైన అనుభవాల గురించి, భవిష్యత్తు గురించి లారిస్సా చెప్పిన విశేషాలు...
నేను బ్రెజిల్ అమ్మాయినైనా ఒక భారతీయ కథ లోనూ, ఒక పాత్రలోనూ నన్ను నేను చూసుకోవడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. దర్శకుడు సునీల్‌రెడ్డి చెప్పిన ‘తిక్క’ కథనీ, అందులోని అంజలి పాత్రనీ అర్థం చేసుకొన్నాక నా నిజ జీవితానికి దగ్గరగా ఉందనిపించింది. అందుకే ఈ కథతో, పాత్రతో ఈజీగా రిలేట్ అయ్యా. సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు నన్ను అంజలిగానే గుర్తు పెట్టుకొంటారు. సారుుధరమ్ తేజ్‌తో కలిసి నటించడం చక్కటి అనుభవం. అతను ఓ పెద్దింటి కుర్రాడైనప్పటికీ సెట్లో నడుచుకొనే విధానం, నలుగురితో కలసిపోయే విధానం బాగా నచ్చింది. దర్శకుడు సునీల్‌రెడ్డి వల్లే ఈ చిత్రంలో బాగా నటించ గలిగా. సినిమా పూర్తయ్యేలోపు రఘుబాబు, ముమైత్‌ఖాన్ , మన్నారా చోప్రా... ఇలా అందరితోనూ ఓ బాండింగ్ ఏర్పడింది.
యాడ్ చూసి చాన్స్ ఇచ్చారు
విదేశాలకి చెందిన అమ్మాయినైనా నా ప్రతిభను నమ్మి అవకాశమిచ్చారు దర్శక-నిర్మాతలు. ఆ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేయాలనుకొన్నా. అందుకే ఒక టీచర్‌ని నియమించుకొని మరీ తెలుగు భాషపై పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నించా. పధ్నాలుగేళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించా. అంతర్జాతీయ స్థారుులో పేరు తెచ్చుకొన్నా. ఒక యాడ్‌లో నన్ను చూసిన ‘తిక్క’ దర్శక- నిర్మాతలు ఈ అవకాశాన్నిచ్చారు. సౌత్ ఇండియన్ లుక్‌తో కనిపించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని నమ్ముతున్నా.
అంతా కొత్తే... మోడలింగ్‌తో పోలిస్తే సినిమా ఓ సరికొత్త అనుభూతి ఇచ్చింది. ఒక కథలోని పాత్రలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలనే విషయాన్ని సినిమా బాగా నేర్పించింది. తెలియని భాష, తెలియని ప్రాంతం, తెలియని మనుషులు... అంతా కొత్తే. కానీ ‘తిక్క’ బృందం నన్ను వాళ్లలో ఒకరిగా భావించి చేరదీశారు. అందుకే వాళ్లతో జర్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. అది తలచుకొంటే ఇప్పుడు కన్నీళ్లొస్తారుు. మా అమ్మానాన్నలకి ఫోన్ చేసి రోజూ ఈ యూనిట్ గురించి చెబుతుండేదాన్ని.
నమస్కారం.. బాగున్నారా...
ఇదివరకు హిందీలో ‘గో గోవా గాన్’ అనే చిత్రంలో చిన్న పాత్ర చేశా. ఒక భాషకి పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగుతో పాటు కన్నడం, తమిళ పరిశ్రమల్లో అవకాశాలపై కూడా దృష్టి పెట్టా. అయితే తెలుగులో నా అభిమాన కథానాయకులు మహేశ్‌బాబు, ప్రభాస్. వాళ్లిద్దరితో కలసి నటించాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇద్దరి సినిమాల్నీ నేను చూశా. ప్రస్తుతం నా ఆలోచనంతా తెలుగు భాషపై పట్టు పెంచుకోవడం గురించే. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా. నమస్కారం, బాగున్నారాలాంటి మాటల్ని పలుకుతున్నా. రఘుబాబుగారు వామ్మో అనే మాటని నేర్పించారు.