నేటి తరానికి ఆయన దిక్సూచి : దాసరి నారాయణరావు
‘‘చనిపోయాక కూడా బతికేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటివాళ్లల్లో రామానాయుడు ఒకరు. నిర్మాతకు నిర్వచనం ఆయన. సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ఆయనకు మంచి పట్టు ఉంది. కథ విషయంలో ఆయన అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. నేటి తరానికి ఆయన దిక్సూచి ’’ అని దర్శక రత్న దాసరి నారాయణరావు అన్నారు. ప్రముఖ నిర్మాత స్వర్గీయ రామానాయుడు సంస్మరణ సభను టి. సుబ్బిరామిరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ - ‘‘సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామానాయుడు. సమాజం పది కాలాలపాటు గుర్తుంచుకునే చక్కని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి’’ అన్నారు.
దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ- ‘‘హిట్ దర్శకులతోనే కాకుండా ఫెయిల్యూర్ దర్శకులతో కూడా ఆయన సినిమాలు తీశారు. సురేష్‌బాబు తన ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో తండ్రి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చితే బాగుంటుంది’’ అని సూచించారు.
‘‘నాతో రెండో సారి సినిమా తీస్తే అది ఫ్లాప్ అన్న ముద్ర నా మీద అప్పట్లో ఉండేది. అయినా తన ‘రాముడు- భీముడు’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్రీ కృష్ణ తులాభారం’లో కూడా రామానాయుడుగారు నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. చివరి శ్వాస వరకూ సినిమాకే ఆయన జీవితాన్ని అంకితం చేశారు’’ అని జమున తెలిపారు.
డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబానికి మద్దతుగా నిలిచిన అందరికీ నా కృత జ్ఞతలు’’ అన్నారు. ప్రతి ఏడాది తమ లలితాకళా పరిషత్ ఆధ్వర్యంలో రామానాయడు పేరుతో విశిష్ట పురస్కారాన్ని అందజేస్తానని టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాల రావు, పాటల రచయిత డా. సి. నారాయణరెడ్డి, బ్రహ్మానందం, మురళీమోహన్, వెంకటేశ్, రానా, నాగచైతన్య, జయసుధ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.