నాకిష్టమే కానీ... జిందగీలో చేయను! | lavanya tripathi special interview | Sakshi
Sakshi News home page

నాకిష్టమే కానీ... జిందగీలో చేయను!

Published Mon, Oct 23 2017 6:55 AM | Last Updated on Mon, Oct 23 2017 6:55 AM

lavanya tripathi special interview

‘‘నాకు ఫుడ్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ అంటే పిచ్చి. నచ్చిన ఫుడ్‌ లాగించేస్తా. బాగా వర్కౌట్స్‌ చేస్తా. ఫుడ్, ఫిట్‌నెస్‌ కాంబినేషన్‌లో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తా. అదేంటంటే? ఇప్పుడు చెప్పలేను. కానీ, తప్పకుండా భవిష్యత్తులో బిజినెస్‌ చేస్తా’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. రామ్‌ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’లో ఆమె ఒక హీరోయిన్‌. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా లావణ్యతో చిట్‌ చాట్‌...

మ్యాగీ... నిజంగానే టూ మినిట్స్‌లో రెడీ అవుతుందా?
లావణ్య:హ్హహ్హహ్హా... ఇందులో నా పేరు మ్యాగీ. ‘టూ మినిట్స్‌లో రెడీ అవుతా’ అనేది నా పంచ్‌ డైలాగ్‌. ఇన్నోసెంట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ గాళ్‌! నా రియల్‌ లైఫ్‌కి దగ్గరైన పాత్ర. ఈతరం యువతీయువకులుఎలా ఉంటున్నారు? ప్రేమపై వాళ్ల దృక్పథం ఏంటి? లక్ష్యం కోసం ఎలా కష్టపడుతున్నారు? అనేవాటిని దర్శకుడు చక్కగా చూపించారు. రాక్‌స్టార్‌ అభిరామ్‌ పాత్రలో రామ్‌ అద్భుతంగా నటించాడు.

రియల్‌ లైఫ్‌లో మీకు నచ్చిన రాక్‌స్టార్‌ లేదా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు?
లావణ్య: మైఖేల్‌ జాక్సన్‌ పాటలంటే ఇష్టం. ఏఆర్‌ రెహమాన్‌ కూడా. ఏదొక రోజు రెహమాన్‌తో వర్క్‌ చేసే ఛాన్స్‌ వస్తుందని ఎదురు చూస్తున్నా.

ట్రైలర్‌లో మీరు తక్కువసేపు కనిపించారు. సినిమాలో ఎంతసేపు ఉంటారు?
లావణ్య: ఎంతసేపు ఉంటే ఏంటి? మంచి పాత్ర చేశామా? లేదా? అనేది ఇంపార్టెంట్‌. ఫర్‌ ఎగ్జాంపుల్‌... ‘రాజుగారి గది–2’లో సమంత కనిపించేది తక్కువసేపే. కానీ, తన పాత్రకు ఎంత పేరొచ్చిందో చూడండి. మంచి పాత్రలు వచ్చినప్పుడు లెంగ్త్‌ గురించి ఆలోచించను.

మీకూ హారర్‌ సినిమాల్లో అలాంటి పాత్రలొస్తే చేస్తారా? లేదా లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌?
లావణ్య: హారర్‌... నాకిష్టమైన జోనర్‌. నేనెక్కువగా హారర్‌ సిన్మాలే చూస్తా. కానీ, జిందగీ (జీవితం)లో హారర్‌ ఫిల్మ్స్‌ చేయను. ఇంకొకటి... నాకు లవ్‌స్టోరీలు నచ్చవు. అసలు చూడను కూడా.
కానీ, నేను నటించేవన్నీ ప్రేమకథా చిత్రాలే. నేను దెయ్యంగా చేస్తే జనాలు చూడలేరేమో?

రియల్‌ లైఫ్‌లోనూ ఇంతే సరదాగా ఉంటారా?
లావణ్య: ‘శతమానం భవతి, రాధ’ షూటింగులు ఏకకాలంలో జరిగాయి. ‘శతమానం భవతి’ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసి ‘రాధ’ సెట్‌లోకి వచ్చిన శర్వానంద్‌.. ‘అక్కడ అనుపమ, ఇక్కడ నువ్వు. అల్లరే అల్లరి. క్రేజీ గాళ్స్‌’ అనేవాడు. నేను మాట్లాడడం మొదలుపెడితే అస్సలు ఆపను. మీరిప్పుడు నా అల్లరిలో జస్ట్‌ 10 పర్సెంట్‌ మాత్రమే చూస్తున్నారు. నేనంత అల్లరి చేస్తా. తట్టుకోవడం కొంచెం కష్టమే.

కొందరి మహిళల్లో ఈ సంతోషం లేదు. సోషల్‌ మీడియాలో ‘మీటూ’ క్యాంపెయిన్‌ గమనిస్తున్నారా?
లావణ్య: పూర్తిగా గమనించలేదు. కానీ, కొందరు మహిళలు సోషల్‌ మీడియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతున్నారు. అందువల్ల సమస్యలు తీరతాయనుకోవడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement