ఇళయరాజా
అదేంటీ ఇళయరాజా తన ట్యూన్స్‌తో హీరో హీరోయిన్లతో స్టెప్పులేయిస్తారు కానీ స్టెప్పులేయడం ఏంటీ? అనుకుంటున్నారా. ఇది ఒకప్పటి సంగతి. ఆ విషయం తెలుసుకోవాలంటే చాలా వెనక్కి వెళ్లాలి. అవి ఇళయరాజా స్కూల్‌లో చదువుకుంటున్న రోజులు. ప్రస్తుతం ‘మేర్కు తొడర్చి మలై’ చిత్రానికి దర్శకత్వం వహించిన లెనిన్ భారతి తండ్రి, ఇళయరాజా క్లాస్‌మేట్స్. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఆ విషయం గురించి లెనిన్ భారతి మాట్లాడుతూ – ‘‘అప్పట్లో నెలకోసారి విద్యార్థుల సమావేశం నిర్వహించేవారు.
అందులో మా నాన్న, ఇళయరాజాగారు పాల్గొనేవారు. అప్పుడు మా నాన్న పాడితే ఇళయరాజాగారు డ్యాన్స్ చేసేవారు. ఒక్కోసారి ఆయన పాడితే మా నాన్న డ్యాన్స్ చేసేవారు. పెద్దయ్యాక ఎవరి దారిని వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరూ కలవలేదు కూడా. మా నాన్నకి డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం ఉండేది. తన లక్ష్యం సాధించాక ఇళయరాజాను కలవాలనుకున్నారు. అయితే ఆయన చనిపోయారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ‘అళగర్ సామి కుదిరై’ అనే సినిమాకి ఇళయరాజాగారు సంగీతదర్శకుడు.
ఆ సమయంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్న టాపిక్ వచ్చింది. నేను తన క్లాస్‌మేట్ కొడుకునని ఇళయరాజాగారికి అప్పుడే తెలిసింది. ముందే ఎందుకు చెప్పలేదు? అన్నారాయన. ‘నేను డైరెక్టర్ అయ్యాక మిమ్మల్ని కలవాలనుకున్నాను’ అన్నాను. నవ్వారాయన. దర్శకుడిగా నా తొలి సినిమా ‘మేర్కు తొడర్చి మలై’కి ఇళయరాజాగారు సంగీతదర్శకుడు కావడం నా అదృష్టం’’ అన్నారు. గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, అవార్డులు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment