మరో సినిమాకు సెన్సార్ బోర్డ్ షాక్
ఇటీవల సెన్సార్ బోర్డ్ తీరు తీవ్రంగా వివాదస్పదమవుతోంది. తమ పరిథి దాటి పలు చిత్రాలకు కట్స్ చెప్పటం, కొన్ని సినిమాలకు అసలు సర్టిఫికేట్ జారీ చేయకుండా నిరాకరించడం లాంటి అంశాలతో సెన్సార్ బోర్డ్ వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్ లో శరణం గచ్ఛామి సినిమా సెన్సార్ సమస్య ఇంకా పరిష్కారం కాకముందే ఓ బాలీవుడ్ సినిమా విషయంలో కూడా ఇదే వివాదం మొదలైంది. ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డ్ నిరాకరించింది.
స్త్రీల స్వేచ్ఛ ప్రధానాంశంగా మహిళా దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని, వారి వస్త్రధారణను కించపరిచే సీన్లతో పాటు అభ్యంతరకర డైలాగులు కూడా ఉన్నాయన్న కారణంతో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెన్సార్ బోర్డ్ తీరుపై నిర్మాత ప్రకాష్ ఝా, దర్శకురాలు శ్రీవాస్తవలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా ను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.