స్త్రీ స్వేచ్ఛకు బుర్ఖా
అద్దం ముక్కలై.. భ్రాంతి చెదిరి.. వాస్తవం కళ్లముందు కనపడుతుంది ఉషాకి. వాంఛ చేసిన తప్పుకి తాను దోషిలా నిలబడుతుంది. షిరీన్ కూడా... ఉద్యోగంలో తను సాధించిన విజయం భర్తకు తెలిసి ఇంటికే పరిమితమవుతుంది! రెహానా.. తండ్రికి పట్టుబడి కాలేజ్‌కెళ్లే అవకాశాన్నీ కోల్పోతుంది. లీలా అంతే కలలన్నీ కల్లలై బేలగా నిలబడుతుంది! ఈ నలుగురినీ ఆధిపత్య బుర్ఖా కమ్మేస్తుంది! కలల లిప్‌స్టిక్ చిరనవ్వు ఆ నకాబ్ వెనక ముడుచుకుపోతుంది! అప్పుడు నవ్వుతారు.. విరగబడి.. అందులో తమ నిస్సహాయత వినిపించేలా! కొత్త ఊపిరిని సిగరేట్ సిప్‌తో గుండెనిండా పీల్చుకుంటూ!
లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా... టైటిలే చెప్తోంది స్త్రీకి స్వేచ్ఛ లేదని! అవును.. మొన్నీమధ్యే విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ఇది. నిజానికి రూపుదిద్దుకున్నాక థియేటర్లోకి రావడానికి చాలానే పురుటినొప్పులు భరించింది. సెన్సార్ కోతల నుంచి తట్టుకొని మొత్తానికి విడుదలైంది. నాకు తెలిసీ రిలేషన్స్‌ను మొదటిసారి మహిళాకోణంలోంచి చూపించిన సినిమా ఇదేనేమో! బుర్ఖా అంటే ఇస్లాంలో స్త్రీలకుండే ముసుగు అని కాదు ఇక్కడ.. ఆడవాళ్ల కలలు, కోరికలు, ఫీలింగ్స్‌కు సమాజం వేసే పరదా అని అర్థం! అయితే పరదా మాటున ఏమన్నా చేయొచ్చనే హిపోక్రసీని ప్రోత్సహిస్తూనే.. బుర్ఖాని కూడా స్కాన్ చేసే సోకాల్డ్ వాల్యూ సిస్టమ్‌ను ఏ అచ్ఛాదన లేకుండా చూపిస్తుందీ చలనచిత్రం!
ఆ నలుగురు..దిగువ మధ్యతరగతి కాలనీలో నివసించే నలుగురు మహిళల కథ ఇది. ఈ నలుగురూ భిన్న వయస్కులు. భిన్న మతస్తులు కూడా. ఈ పాత్రలను ఎంపిక చేసుకోవడంలో సినిమా రైటర్, డైరెక్టర్ అలంకృతా శ్రీవాస్తవ్ చాలా తెలివిగా ప్రవర్తించింది. ఏ మత చాందసులూ నోరు పారేసుకోకుండా ఇద్దరు స్త్రీలను హిందూ మతస్తులుగా.. మరో ఇద్దరిని ఇస్లాం మతస్తులుగా చూపించింది. అన్నట్లు ఓ క్రిస్టియన్ రోల్ కూడా ఉంది. రోజీ! ఈ సినిమాలో కనిపించని ప్రధానమైన పాత్ర! ఉషా పర్మార్ (రత్నా పాఠక్ షా)ను ఊహల్లో ఊగించే పాత్ర! యుక్తవయసులోనే భర్తను పోగొట్టుకొని.. మేనల్లుళ్ల కుటుంబాలతో కలిసి ఉంటుంటుంది. అలాగని ఆర్థికంగా స్వేచ్ఛలేనిది కాదు. వాళ్లుండే కాంప్లెక్స్‌లోనే సొంతంగా స్వీట్ షాప్, ఓ లాడ్జ్ నడుపుతున్న సమర్థురాలు ఈ నడివయసు స్త్రీ.
వేధిస్తున్న శరీర కోరికలను ఇంకో పెళ్లిద్వారో.. రిలేషన్ షిప్ ద్వారో పొందే సాహసం చేయలేక.. భక్తి, భజనలు, ఆధ్యాత్మిక పుస్తకాలతో వాటికి అట్టేసి.. ఆ పుటల్లో రొమాంటిక్ నవల్స్ పెట్టుకొని స్వయంతృప్తి చెందుతుంటుంది. ఆ నవల్లోకి నాయికే రోజీ! తనను తాను రోజీలా అన్వయించుకుంటుంది. ఆ బుర్ఖాలో స్వేచ్ఛగా విహరిస్తుంటుంది. ఆ కాంప్లెక్స్‌లో ఉండే ఇంకో అమ్మాయి .. రెహానా అబీది (ప్లబితా బోర్తకూర్). ఓ ముస్లిం టేలర్ కూతురు. సింగర్ కావాలనే డ్రీమ్,ప్యాషన్, గోల్ ఉన్న గర్ల్! చదువుకోవడానికి మాత్రమే చాన్స్నిచ్చే తండ్రి ఆంక్షలను..మత కట్టుబాట్లను వ్యతిరేకించే యంగ్‌స్టర్! చదువుతోపాటు తన కలనూ పర్ష్యూ చేసుకోవాలనుకునే ఆమె ఉత్సాహానికి బుర్ఖా కప్పేస్తుంటాడు తండ్రి! ఆ రెండిటి మధ్య పోరాటం ఆమెది.
ఇంకో గృహిణి.. షిరీన్ అస్లం (కొంకణ్ సేన్‌శర్మ). భర్త దుబాయ్‌లో ఉండి దేశానికి వచ్చేస్తాడు ఇక్కడే ఏదో ఒక పని చేసుకోవడానికి. చాలా చురుకైన ఇల్లాలు ఆమె. ముగ్గురు పిల్లల తల్లి. తనకూ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని ఆశపడే మహిళ. అందుకే భర్త దుబాయ్‌లో ఉన్నప్పుడు డోర్ టు డోర్ సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుంటుంది ఎంతో సమర్థవంతంగా! అందులో ఆమెకు ప్రమోషన్ కూడా దొరుకుతుంది. నిజానికి భర్తతో సంతోషంగా పంచుకోవాల్సిన విషయం అది. కాని నోరు మెదిపే ధైర్యం చేయదు. ఆమె ఓ డొమెస్టిక వయోలెన్స్ బాధితురాలు. మ్యారిటల్రేప్ విక్టిమ్. ఒంట్లో బాగాలేక సెక్స్ వద్దని చెప్పే స్వేచ్ఛ కూడా లేని ఇంటామె. పిల్లలు వద్దు.. కండోమ్ వాడండి.. అని చెప్పడానికి కూడా సాహసించని ఇల్లాలు.
అలాంటి ఆమె ఆర్థిక స్వేచ్ఛ గురించి కలలు కంటుంది.. నెరవేర్చుకోవాలనే ప్రయత్నమూ చేస్తుంది. సాధిస్తుంది కూడా. తను ఫలానా పని చేసి శభాష్ అనిపించుకుంటున్నాను.. ఈ పని నేను కొనసాగిస్తాను అని భర్తతో పంచుకోలేదు. ఆమె ఆశయాలకు తన పురుషాధిపత్యంతో బుర్ఖా తొడుగుతాడు ఆ మొగుడు. అది తొలగించుకోవాలనే సంఘర్షణ ఆమెది. ఇక నాలుగో స్త్రీ.. చాలా ప్రధానమైన పాత్ర.. స్త్రీకి అన్నిరకాల స్వేచ్ఛ కావాలని గ్రహింపునిచ్చే పాత్ర.. లీలా (ఆహనా కుమ్రా)! బ్యూటీషియన్. సింగిల్ మదర్ సింగిల్ చైల్డ్. ఓ వైపు బ్యూటీపార్లర్ నడుపుతూనే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంకో వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించే బిజినెస్ పెట్టాలనుకుంటుంది. అతను స్థానిక ఫొటోగ్రాఫర్. లీల.. ఫీలింగ్స్‌కి జెండర్ ఉండదనే భావనకు ప్రతీక. సెక్సువల్ అర్జ్ మగవాడికెంతో.. స్త్రీకీ అంతే చెప్పే పాత్ర! మగవాడికి కోరిక కలిగినప్పుడే తీసుకోవాలి.. కాని కోరి అడగకూడదు అనే బాయ్‌ఫ్రెండ్ పురుషహంకారానికి బలైన బలమైన అమ్మాయి. ఈ అహంకారాన్ని తట్టుకోలేక.. తల్లి సొంతింటి కలను తీర్చే వరుడితో సర్దుకోలేక సమాజపు నియమాల బుర్ఖాలోకి వెళ్లే పాత్ర.
గెలిచి ఓడిన ఆడాళ్లు..
ఈ నలుగురూ ఒకే కాంప్లెక్స్‌లో ఉంటారు. ఎవరి కలలు వారివి. ఒకరికొకరు పరిచయం ఉంటారు..స్నేహం ఉంటుంది. కాని ఎవరి ప్రయాణం వారిదే! వాళ్ల ఆశయాల ప్రకారం ఎవరి గమ్యం వారిదే. కాని చిత్రంగా ఆ జర్నీలో అందరికీ ఒకే రకమైన బ్రేక్ పడుతుంది. పురుషాధిపత్య బ్రేక్! వితంతువైన ఉష.. అలా రొమాంటిక్ నవలలు చదవడాన్ని జాసూసీ చేసి బయటపెడ్తారు మేనళ్లల్లు! ఊరందరికీ ‘బువా’ (అత్త)గానే పరిచితమైన ఆమెకు ఓ పేరుంటుందని.. ఓ ఐడెంటీ ఉంటుందని మొట్టమొదటిసారిగా ఓ కుర్రాడు ఆమెకు గుర్తుచేస్తాడు. తను ఉషా అనే నిజాన్ని తెలియజేస్తాడు. ఆ క్షణాన్నే తన జీవితానికి ఉషోదయం అయిందనుకుంటుంది. అప్పటి నుంచి తాను రోజీ అయినట్టు.. ఆ కుర్రాడు తన ప్రియుడు అయినట్టు కలలు కనడమే కాదు.. ఆ కుర్రాడికీ ఆ భావన కల్పిస్తుంది. రోజీ ఆమె కాదని తేలినరోజు ఆ కుర్రాడే వితంతువైనా ఓ నడివయసు స్త్రీకి కలలు కనే హక్కు లేదని, కోరికలు ఉండకూడదనే నియమాన్ని చెప్తాడు. ఉషా మేనల్లుళ్లతో. ఆ బిల్డింగ్‌లో కాపురముంటున్న అందరి ముందూ ఆమె పరువు తీయిస్తాడు. అద్దం ముక్కలై.. భ్రాంతి చెదిరి.. వాస్తవం కళ్లముందు కనపడుతుంది ఉషాకి. వాంఛ చేసిన తప్పుకి తాను దోషిలా నిలబడుతుంది. షిరీన్ కూడా... ఉద్యోగంలో తను సాధించిన విజయం భర్తకు తెలిసి ఇంటికే పరిమితమవుతుంది! రెహానా.. తండ్రికి పట్టుబడి కాలేజ్‌కెళ్లే అవకాశాన్నీ కోల్పోతుంది. లీలా అంతే కలలన్నీ కల్లలై బేలగా నిలబడుతుంది! ఈ నలుగురినీ ఆధిపత్య బుర్ఖా కమ్మేస్తుంది! కలల లిప్‌స్టిక్ చిరునవ్వు ఆ నకాబ్ వెనక ముడుచుకుపోతుంది!
అప్పుడు నవ్వుతారు.. విరగబడి.. అందులో తమ నిస్సహాయత వినిపించేలా! కొత్త ఊపిరిని సిగరేట్ సిప్‌తో గుండెనిండా పీల్చుకుంటూ! లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా.. ఈ నలుగురి కథే కాదు! సమాజంలోని అందరి స్త్రీల యదార్థ జీవితం! గెలిచి ఓడుతున్న ఆడవాళ్ల వ్యథ! ఈ కథకు నేపథ్య నగరంగా ఏ ముంబై, ఢిల్లీ, కోల్కత్తాలనో కాకుండా భోపాల్‌ను తీసుకుంది డైరెక్టర్. ఈ సినిమాకు భోపాల్‌ను ఎంచుకోవడం వెనక.. గ్యాస్ లీక్ దుర్ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచీకరణ హంగులను అద్దుకుంటూ, ఆ నాగరికతను అడాప్ట్చేసుకోవడం.. అక్కడి స్త్రీలలో వచ్చిన ఆర్థిక, సామాజిక చైతన్యం వంటి అంశాలను ఫోకస్ చేసే ఉద్దేశంగా అయిండొచ్చు! ఏమైనా అది డైరెక్టర్స్ రైట్ చాయిస్ అనిపిస్తుంది సినిమా చూస్తే! ఇప్పటి వరకు చాలా మంది మహిళా డైరెక్టర్లు రిలేషన్స్ మీద చాలానే సినిమాలు తీశారు. కాని ఇలా ఉమన్ యాంగిల్లో ఏదీ కనిపించలేదు. హేట్సాఫ్ అలంకృతా శ్రీవాస్తవా! సినిమా కాస్ట్ అండ్ క్య్రూ అందరికీ సలాం! ఎవరి కృషీ తగ్గించేది కాదు! అందరూ దీ బెస్ట్!
– శరాది