పోస్టర్లో మిడిల్ ఫింగర్.. ఎవరికంటే ?
ముంబై :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)తో తమకు ఎలాంటి ఘర్షణలేదని, ఈ సమాజంతోనే అసలు సమస్య అని ఏక్తా కపూర్ అన్నారు. 'లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా' చిత్ర పోస్టర్లో కనిపించే మిడిల్ ఫింగర్ సీబీఎఫ్సీకి కాదని, మహిళలని పైకి ఎదగకుండా అణగదొక్కుతున్న పితృస్వామ్య సమాజానికని తెలిపారు. తమ వాణి వినకుండా గొంతునొక్కే ప్రయత్నం చేస్తూ, మహిళల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడే భావజాలం ఉన్న వారికే పోస్టర్లోని మిడిల్ ఫింగర్ అని కుండబద్దలు కొట్టినట్టు ఏక్తా చెప్పారు. ఈ చిత్రానికి సమర్పకురాలు, డిస్ట్రిబ్యూటర్గా ఏక్తా కపూర్ వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాష్ ఝా నిర్మించిన లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్ర ట్రైలర్ని మంగళవారం ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏక్తా కపూర్తో పాటూ దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ, నటులు కొంకనా సేన్ శర్మ, రత్న పాతక్ షా, అహ్నా కుమ్రా, ప్లబితా బోర్తాకుర్లు పాల్గొన్నారు.
లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించిన విషయం తెలిసిందే. చివరకు 6 నెలల తర్వాత సీబీఎఫ్సీ ఈ చిత్ర ట్రైలర్ను ఏ సర్టిఫికెట్తో విడుదలకు అనుమతించింది. స్త్రీల స్వేచ్ఛ ప్రధానాంశంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని, వారి వస్త్రధారణను కించపరిచే సీన్లతో పాటు అభ్యంతరకర డైలాగులు కూడా ఉన్నాయన్న కారణంతో సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సెన్సార్ బోర్డ్ తీరుపై నిర్మాత ప్రకాష్ ఝా, దర్శకురాలు శ్రీవాస్తవలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా ను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదం పై చిత్రయూనిట్ సెన్సార్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. యూనిట్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్ లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాకు ఎ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.