నవ్వుతూ బతకాలిరా...నవ్వుతూ చావాలిరా.... | live with happines and die with happines | Sakshi
Sakshi News home page

నవ్వుతూ బతకాలిరా...నవ్వుతూ చావాలిరా....

Published Sun, Dec 28 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

నవ్వుతూ బతకాలిరా...నవ్వుతూ చావాలిరా....

నవ్వుతూ బతకాలిరా...నవ్వుతూ చావాలిరా....

 అందుకే... అంత బాగుంది!
 లైప్ ఈజ్ బ్యూటిఫుల్ (1997)
 
 తారాగణం: రాబర్ట్ బెనిగ్ని, నికోలెట్టా బ్రాశ్చి, జియోర్జియో కాంటారిని, గిస్టినో డ్యూరానొ, హార్ట్స్ బుకోల్జ్,
 సంగీతం: నికోలా పియోవని,  కెమెరా: టోనినో డెల్లి కొల్లి, నిర్మాతలు: జియాన్‌లుజి బ్రాచ్చి, ఎల్డా ఫెర్రి, దర్శకుడు: రాబర్ట్ బెనిగ్ని, విడుదల: 20 డిసెంబర్1997 (ఇటలీ) ; 23 అక్టోబర్ 1998 (అమెరికా), సినిమా నిడివి: 116 నిమిషాలు,
 నిర్మాణ వ్యయం: 2 కోట్ల డాలర్లు, వసూళ్లు: 22 కోట్ల 91 లక్షల డాలర్లు
 
 ఆత్రేయగారి ‘‘నవ్వుతూ బ్రతకాలిరా, నవ్వుతూ చావాలిరా, చచ్చినాక బ్రతకలేవురా, ఎంత ఏడ్చినా తిరిగి రావురా’’ అనే పాటను యథాతథంగా సినిమాగా రూపొందిస్తే, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అవుతుంది అనిపిస్తుంది. ఆత్రేయగారు ఈ పాటని, 1980లలో రాస్తే, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే ఇటాలియన్ సినిమా 1997లో రూపొందింది. నా ఉద్దేశం ఆత్రేయగారి పాటను... ఆయన కాపీ కొట్టాడని కాదు, ‘గ్రేట్ పీపుల్ థింక్ ఎలైక్’ అని చెప్పడం మాత్రమే!
 
 రాబర్ట్ బెనిగ్ని ఈ చిత్ర రచయిత, దర్శకుడు, కథానాయకుడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో... కాన్సన్‌ట్రేషన్ క్యాంప్స్‌లో బెనిగ్ని తండ్రి అనుభవాలే ఈ చిత్ర కథ. నాజీలు, యూదులను పట్టుకుని ఒక చోట ఖైదీలుగా ఉంచేవారు. అక్కడ జరిగినన్ని అకృత్యాలు మరెక్కడా జరగవు. రాబర్ట్ బెనిగ్ని 71వ అకాడమీ అవార్డులలో బెస్ట్ యాక్టర్‌గా ‘ఆస్కార్’ గెలుచుకున్నాడు. మరెన్నో అవార్డులు ఈ సినిమాకు లభించాయి. ఒక సందేశంతో కూడిన, హాస్యభరిత, కరుణ రసాత్మక చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఇటాలియన్ భాషలో ఈ సినిమా పేరు ‘లా విటా ఎ బెల్లా’. తర్వాత ఈ సినిమా అన్ని భాషలలో అనువాదమైంది.
 
 ఈ చిత్రంలో కథానాయకుడి పేరు - గ్యుడో. ఈ గ్యుడో చాలా చురుకుగా, ఎటువంటి సందర్భంలోనైనా హాస్యాన్ని పుట్టించగలిగే స్వభావాన్ని కలిగి ఉంటాడు. సినిమా ప్రారంభంలోనే అతను ‘డోరా’ అనే యువతి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమెను కలుసుకోవడానికి రకరకాల ట్రిక్కులు ప్రయోగిస్తుంటాడు. ఇవన్నీ కూడా హాస్యభరితంగా ఉంటాయి. చివరకు ‘డోరా’ కూడా అతని ప్రేమలో పడిపోతుంది. కానీ, అప్పటికే ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయమై ఉంటుంది. సినిమాలో దాదాపు సగం నిడివి హీరో, హీరోయిన్ల మధ్య లవ్, రొమాన్స్, కామెడీతోనే గడిచిపోతుంది. మొదట ‘డోరా’, హీరో చేతుల్లోకి ఆకాశంలో నుంచి పడినట్టుగా ఊహించుకుని, దానికి అనువుగా ఆ సీన్‌ని క్రియేట్ చేశాడు బెనిగ్ని. తర్వాత ఇలాంటి సీన్‌నే మరొక సందర్భంలో, మరో రకంగా చూపిస్తాడు.
 
 గ్యుడో, అతని స్నేహితుడు తమ గ్రామం నుంచి, సిటీలో ఉన్న తన అంకుల్ దగ్గరకు వస్తారు. అంకుల్ ఒక హోటల్‌లో చీఫ్-వెయిటర్‌గా పని చేస్తుంటాడు. అతని ఇంట్లోనే వీళ్లిద్దరికీ నివాసం. తర్వాత రెండు, మూడు సన్నివేశాలకు హోటల్‌లో ఉన్న తన అంకుల్‌ను కలిసి, ‘‘కచ్చితంగా ఇచ్చిన పని చేయగలను, సర్వర్ అంటే ఇలా వంగి దండాలు పెడుతూ పనిచెయ్యటమేగా?’’ అంటాడు. అందుకు అంకుల్, గ్యుడోతో, ‘‘సర్వింగ్ అనేది ఒక ఆర్ట్. సృష్టి మొత్తానికీ ఫస్ట్ సర్వర్ - ఆ దేవుడే!’’ అని చెబుతాడు. సినిమాలో, ఇటువంటి సున్నితమైన సంభాషణలు చాలానే ఉంటాయి. తర్వాత, తనూ, తన ఫ్రెండ్ పడుకున్నప్పుడు, ఫ్రెండ్ ఒక ప్రశ్న వేస్తాడు. దానికి గ్యుడో సమాధానం చెప్పేలోపు, అతను నిద్రపోతుంటాడు.
 
  వెంటనే గ్యుడో అతణ్ణి లేపి ‘‘నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు. నేను సమాధానం చెప్పడం పూర్తయ్యేలోపు, నువ్వు నిద్రపోతావ్. ఇదెలా సాధ్యం?’’ అని అడుగుతాడు. దానికి సమాధానంగా గ్యుడో ఫ్రెండ్ ‘‘స్కోపెన్‌హ్యావెర్! అంటే నువ్వు బలంగా విశ్వసించి, ఒక పని జరగాలని అనుకుంటే, ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను నిద్రపోవాలి అనుకున్నాను... నిద్ర వచ్చేసింది’’ అని చెబుతాడు. గ్యుడో కూడా వేళ్లు కదుపుతూ, తను కూడా నిద్రపోవాలి అని అనుకుంటాడు. అలా వేళ్లు కదపాల్సిన అవసరం లేదంటాడు అతని ఫ్రెండ్. ‘‘అయినా, దానికి ఇంకా కొంత టైం పడుతుంది’’ అని మళ్లీ పడుకుంటాడు ఫ్రెండ్. గ్యుడో ఇప్పుడు వేళ్లు కదిలిస్తూ, తన ఫ్రెండ్ నిద్ర లేవాలి అనుకుంటాడు. తన మీద వేళ్లు కదిలిస్తున్న గ్యుడోను చూసి విసుక్కుంటాడు ఫ్రెండ్. వెంటనే గ్యుడో, ‘‘నాకూ వచ్చేసింది. నువ్వు మేలుకోవాలని బలంగా అనుకున్నాను. నువ్వు లేచావు’’ అని అంటాడు.
 
 ‘గ్యుడో’ ఒక తెలివైన అమాయకుడు. అమాయకత్వంతో కూడిన మేధావి. తర్వాత ఇదే విషయాన్ని సినిమా చివరి వరకూ ప్రయోగిస్తూ ఉంటాడు. అన్నిసార్లూ కూడా, గ్యుడో అనుకున్నట్టే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం నవ్వుతాం. కొన్ని సందర్భాల్లో బాధపడతాం. కొన్నిసార్లు ఉద్వేగానికి గురవుతాం. రాబర్ట్ బెనిగ్ని ఈ విషయంలో, ఒక రకమైన హిప్నాటిజం అనే అంశం మీద పూర్తిగా పట్టు సాధించాడు. పైగా, అన్ని సీన్స్‌లో ఎంతో కొంత నాటకీయత ఉన్నప్పటికీ, అతని నటన కారణంగా, ముగ్ధులమై చూస్తామే తప్ప, ఎక్కడా అసహజత్వం ఫీల్ కాము.
 
 మరుసటి రోజు ఉదయం గ్యుడో తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన డోరాను చూపించి, ‘ఈమె నా కోసం, ఆకాశం నుంచి, నా చేతుల్లోకి పడిన నా రాకుమారి’ అని పరిచయం చేస్తాడు. తను వెయిటర్‌గా పనిచేస్తున్న హోటల్‌కి వచ్చిన వాళ్ల క్లిష్టమైన సమస్యల్ని కూడా చిటికెలో పరిష్కరిస్తుంటాడు.  ఆ నేపథ్యంలో అక్కడికి వచ్చిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్, తన గర్ల్ ఫ్రెండ్ డోరా టీచర్‌గా పని చేస్తున్న స్కూల్‌కు ఇన్‌స్పెక్షన్‌కి వెళ్తున్నాడని తెలుసుకుని, తను మెడలో వేసుకునే క్లాత్‌ను కొట్టేసి, ఆ ఆఫీసర్‌కి బదులుగా, తనే ఇన్‌స్పెక్టర్‌లాగా వెళతాడు - మళ్ళీ డోరాను కలుసుకోవడానికి! మొత్తానికి డోరాను కలిసి, ఆమెతో మాట్లాడతాడు.
 
 తర్వాత డోరాకి నిశ్చితార్థం జరిగిన యువకుణ్ణి తప్పించి, ఆమెను కార్లో తీసుకువెళ్తాడు. భోరున వర్షం! కారు, మెట్ల మీద నుండి దిగుతున్న విషయం కూడా గ్రహించలేదు ఇద్దరూ. తర్వాత, డోరాను నేల మీద నడవనివ్వకుండా ఒక రెడ్ కార్పెట్‌ను విసిరి, వర్షంలో ఆమె తడవకుండా, ఒక గొడుగు పట్టుకుని ఆమెను నడిపించే దృశ్యం రాబర్ట్ బెనిగ్ని భావుకతకు ఒక ఉదాహరణ. అద్భుతం! ఆమె నిశ్చితార్థం జరుగుతున్న వేడుకలో గ్యుడో ఒక గుర్రంపై, ఆమెను ఎక్కించుకుని పారిపోతాడు. తర్వాత వాళ్లిద్దరికీ పెళ్లయినట్టు, ఒక 3 సంవత్సరాల పిల్లవాడు కలిగినట్టు, ఒక 30 సెకన్ల వ్యవధిలోనే చెప్పేశాడు.
 
 
 హ్యాపీగా సాగుతున్న, వాళ్ల జీవితాల్లో అనుకోని తుపాను. గ్యుడోనూ, అతని కొడుకునూ జర్మన్ సైన్యం, ఖైదీలను ఎక్కించే ట్రైన్‌లో తీసుకెళుతుంటుంది. అప్పుడు వచ్చిన డోరాతో అమర్యాదగా ప్రవర్తిస్తాడు చీఫ్. తను కూడా అదే ట్రైన్ ఎక్కుతుంది. ఇక్కడ నుంచి మొదలవుతుంది! ఖైదీలతో ఎంతో దారుణమైన పనులు చేయిస్తారు. బానిసల కంటే హీనంగా చూస్తారు. కానీ, గ్యుడో తన కొడుక్కి ఇవేం తెలియనివ్వకుండా, కొడుకును ఆటల్లో ముంచెత్తి, తను మాత్రం బాధలు అనుభవిస్తుంటాడు. కొడుకుకు ట్యాంక్ కావాలని కోరిక. ‘‘అయితే, నువ్వు వెయ్యి పాయింట్లు గెలుచుకుంటే, నీకు బహుమతిగా ఒక ట్యాంక్ ఇస్తాను’’ అంటాడు గ్యుడో. డోరా ఆడఖైదీల జైల్లో...! గ్యుడో తన కొడుకుతో వేరే జైల్లో...! రెండూ పక్కపక్కనే! ఒకసారి, ఎవరూ లేని సమయంలో, మైక్ రూమ్‌లోకి వెళ్లి, పరోక్షంగా, తన భార్యకు మాత్రమే అర్థమయ్యేలా మాట్లాడతాడు.
 
 మనం లోపల విషాదాన్ని ఫీల్ అవుతూనే హీరో, హీరోయిన్లు కలుసుకున్నారులే పాపం అని అనుకునేలా చేస్తాడు దర్శకుడు. ఖైదీలున్న జైలుకు వచ్చిన పై ఆఫీసర్, ‘మీలో ఎవరికైనా జర్మన్ భాష వస్తే, నేను చెప్పేది మిగతా వాళ్లకి, ట్రాన్ల్సేట్ చేసి చెప్ప’మన్నప్పుడు గ్యుడో వెళ్లి, తన కొడుక్కి మాత్రమే అన్వయించేలా, ఒక ఆట గురించి చెప్పి, దానిలో షరతులు కొన్ని చెబుతాడు. ఆట మధ్యలో వైదొలగిన వాడికి, ఎటువంటి ప్రైజూ రాదు. చివరి వరకూ ఉండి, ఎవరైతే 1000 పాయింట్లు స్కోర్ చేస్తారో, వారికే ట్యాంక్ ఇస్తారు. ‘ప్రతీరోజూ ఎనౌన్స్ చేస్తాం - ఎవరు ముందంజలో ఉన్నారన్నది! ఎవరైతే భయపడతారో, వాళ్లు ఓడిపోవడం ఖాయం. మీలో ఎవరన్నా ఏడ్చినా, ఎవరికైనా అమ్మని చూడాలని ఆలోచన కలిగినా, మీకు ఆకలై ఏదన్నా తినాలని కోరిక కలిగినా - మీరు తప్పనిసరిగా ఓడిపోతారు’ అని చెబుతాడు. ఇది కుర్రవాడి మనసులో చెరగని ముద్ర వేస్తుంది. తనకు తల్లిని చూడాలని కోరిక కలిగినా, ఆకలైనా, ఏడుపు వచ్చినా కూడా నిగ్రహించుకుంటాడు.
 
 చివరి సీన్‌లో తనను మిలటరీ జవాను తీసుకెళ్లేటప్పుడు, తనను కాల్చేస్తారు అని తెలిసి కూడా ఆ విషయం కొడుకుకు తెలియనివ్వకుండా, ‘చివరి 60 పాయింట్లు వస్తే, నీవి 1000 పాయింట్లు అవుతాయి.  నువ్వే ట్యాంక్ గెలుచుకోబోతున్నావు’ అని చెప్పి, ఆ కుర్రవాణ్ణి ఒక పోస్ట్‌బాక్స్ లాంటి దాంట్లో దాక్కునేలా చేసి, తను జవాను వెంట వెళ్తాడు. అంతులేని దుఃఖాన్ని మనసులోనే దాచుకుని, కొడుకు చూస్తున్నప్పుడు మాత్రం అది కూడా ఒక ఆటలాగే అన్నట్టు నటిస్తాడు. కొడుకుకు మాత్రమే కనపడేలా, కన్నుగొట్టి సైగ చేస్తాడు. చివరికి జవాన్లు పక్కకు తీసుకెళ్లి, గ్యుడోను కాల్చేస్తారు. యుద్ధం అయిపోయాక, బతికి ఉన్న ఖైదీలందరినీ వదిలేస్తారు. అప్పుడొచ్చిన ట్యాంక్ తన కోసమే వచ్చినట్టుగా, కుర్రవాడు ఫీల్ అవుతాడు. తల్లీ కొడుకులు కలవడంతో కథ ముగుస్తుంది.సినిమా మొత్తాన్నీ ఒక యుద్ధ వాతావరణ నేపథ్యంలో తీసినప్పటికీ, ఎక్కడా హింస, రక్తపాతాలు లేకుండా, ఆద్యంతం నవ్వులతో ముంచెత్తి, అద్భుతంగా నటించారు, అంత కన్నా అద్భుతంగా దర్శకత్వం వహించాడు రాబర్ట్ బెనిగ్ని. కత్తికి రెండు వైపులా పదునే అన్నట్టు చేశాడు.
 
 ఒక ప్రేయసి, ప్రేమికుడు ఎంత ఆనందంగా ఉండవచ్చో చెప్పడంతో పాటు, ఒక తండ్రి తన కొడుకును ఎలా పెంచవచ్చో కూడా తెలిపాడు దర్శకుడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా వాళ్ల పసి మనసులను ఎలా మళ్లించవచ్చో, ఎలా మోటివేట్ చేయవచ్చో, ప్రతీ తల్లికీ తండ్రికీ, తనదైన శైలిలో సందేశం ఇచ్చాడు రాబర్ట్ బెనిగ్ని. నిజంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతీ తల్లీ, తండ్రీ, హాస్యాన్ని ఇష్టపడే ప్రతీ ప్రేక్షకుడూ చూసి తీరవలసిన చిత్రం - ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఇందులో హీరో తను నవ్వుతూ మనల్ని నవ్విస్తాడు. తన ఏడుపును లోపల దాచుకుంటూ, మనల్ని ఏడుస్తూ నవ్వేలా చేస్తాడు. ఒక మనిషి నవ్వుతూ ఎలా బతకవచ్చో, ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీద, ప్రేక్షకుణ్ణి ఏడుస్తూ నవ్వేలా చేస్తాడు. నవ్వుతూ ఏడ్చేలా చేస్తాడు... చివరకు నవ్వో ఏడుపో తెలియని స్థితిలో మనల్ని ఉంచుతాడు..!
 అదీ దర్శకుడి చాతుర్యం!!                
 
 జీవితమే సినిమా!
 ఇటాలియన్ నటుడు, రచయిత, దర్శకుడు రాబర్ట్ బెనిగ్ని ముందుగా రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా కృషి చేసి, ఆ పైన మెగాఫోన్ పట్టుకున్నారు. నాటకాలకూ, సినిమాలకూ మధ్య టీవీ సిరీస్‌లు, షోల ద్వారా పేరు తెచ్చుకున్నారు. నటి నికోలెటా బ్రాస్చీని ఏరికోరి పెళ్ళాడిన ఆయన తన చిత్రాలు చాలావాటిలో ఆమెకు కీలక పాత్రలిచ్చారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’(1997) లోనూ ఆయన పక్కన ఆమే హీరోయిన్. నిజానికి, ఆయన తండ్రి వడ్రంగి పని, ఇటుకల తయారీ పని కూడా చేసిన ఓ రైతు. 1943 - 45 మధ్య కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్‌లో ఖైదీగా గడిపారు. తండ్రి జీవితానుభవాలు, అప్పటి కథలే ఈ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కు పునాది. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగానే కాక, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఒరిజినల్ డ్రమాటిక్ స్కోర్, ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగాల్లోనూ ఆస్కార్ అవార్డులు సాధించారు బెనిగ్ని.
 
  శివ నాగేశ్వరరావు, ప్రముఖ దర్శకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement