రెండు హృదయాల మధ్య తీయని ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచే మంచి వస్తువు బహుమతి. రక్త సంబంధం కావచ్చు, ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ముఖ్యంగా ప్రేమికులకంటూ ఒక రోజు ఉంది కాబట్టి ఫిబ్రవరి 14 కోసం ఈ జంటలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సినిమా జంటల విషయానికొస్తే ఒకరికొకరు ఖరీదైన బహుమతులతో తమ అనుబంధాన్ని పెంచుకుంటుంటారు. అలా బహుమతుల పంపకాలతో ప్రణయ సాగరంలో మునిగితేలుతున్న కొన్ని జంటల గురించి చూద్దాం.
బాయ్స్, కాదల్, వానం, 555 వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటుడు భరత్. ఈయన ఈ మధ్య జెస్సీని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లి గురించి ఆయన మాటల్లోనే.. జస్లీ దంత వైద్యురాలు. దంత వైద్యశాలలోనే నేనామెను తొలిసారిగా కలుసుకున్నాను. కొన్ని నెలల తర్వాత ఒక స్నేహితుని వేడుకలో మళ్లీ కలుసుకున్నాం. ఆ కలయిక మమ్మల్ని స్నేహితుల్ని చేసింది. తొలి చూపులోనే మామధ్య ప్రేమ పుట్టలేదు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మా స్నేహం పెరిగి ప్రేమగా మారింది. గత ఏడాది ప్రేమికుల రోజున జెస్సీకి విందు ఇచ్చాను. ఈ ఏడాది ఆమె కోసం వజ్రాల నెక్లెస్ బహుమతిగా అందజేశాను.
చిరకాలంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో నవజంట సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, గాయని సైందవి. వీరి ప్రేమానుబంధం గురించి జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొంటూ ‘నేను పదవ తరగతి చదువుతున్న సమయంలో అదే పాఠశాలలో సైందవి ఎనిమిదవ తరగతి చదువుతుండేది. లవ్ ఎట్ ఫస్ట్ టైమ్ అన్నట్లు తొలి చూపులోనే మా మధ్య ప్రేమ మొలకెత్తింది. అలా 12 ఏళ్లు మా మధ్య ప్రేమ కొనసాగింది. గత ఏడాది ప్రేమికుల రోజున సైందవికి సర్‌ప్రైజ్ ఇచ్చాను. ఈ ఏడాది ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఆమె కోసం ఎదురు చూస్తోంది’ అని తెలిపారు.
సంచలన ప్రేమ జంట శింబు హన్సిక మధ్య గత ఏడాది ప్రేమ మొలకెత్తింది. ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించి సంచలనం కలిగించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ బ్రేక్ అయినట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఇటీవల శింబు పుట్టిన రోజున నటి హన్సిక హఠాత్తుగా ఆయన ముందు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీరి ప్రేమ గురించి మళ్లీ రకరకాల ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నయనతార సరసన ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న శింబును హన్సిక, నయనతార గురించి అడగ్గా హన్సిక నా లవర్, నయనతార నా ఫ్రెండ్ అంటూ బదులిచ్చారు.