ఇప్పుడు ప్రేమకథల స్వరూపం మారిపోయింది - దాసరి
‘‘ఒకప్పుడు ప్రేమకథలంటే ప్రేమ గొప్పదనాన్ని తెలియచెప్పేవిగా ఉండేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రేమకథల స్వరూపం మారిపోయింది. ఇప్పుడు ప్రేమకథల పేరుతో కామ కథలను తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లగడపాటి శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ వంటి ప్రేమ గొప్పదనం తెలియజెప్పే సినిమా తీశారు. విడుదలకు ముందే ఈ చిత్రం చూసి, సూపర్‌హిట్ అవుతుందని చెప్పాను’’ అని దాసరి నారాయణరావు చెప్పారు.
సుధీర్‌బాబు, నందిత జంటగా చంద్రు దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం ఇటీవల జైపూర్‌లో జరిగిన చలన చిత్రోత్సవాల్లో ‘బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్’ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దాసరి నారాయణరావు ఈ చిత్రబృందాన్ని అభినందించారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని లగడపాటి శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో నటులు సుధీర్‌బాబు, గిరిబాబు, దర్శకులు చంద్రు, ఎన్. శంకర్, నీలకంఠ తదితరులు మాట్లాడారు.