మా ఎన్నికలపై తీర్పు ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్: మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలకు సంబంధించి సిటీ సివిల్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారం ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మా అధ్యక్ష ఎన్నికలు ఈనెల 29న జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు.
మాఎన్నికలు ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టులో నటుడు, నిర్మాత ఓ. కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అసోసియేషన్ బైలాస్కు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే.. తదుపరి తీర్పు వచ్చేవరకు కౌంటింగ్ నిర్వహించవొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో తీర్పు వచ్చే వరకూ మా ఎన్నికల ఫలితాలుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.