మెకన్నాస్ గోల్డ్... నిజంగా గోల్డ్ | mackenna's gold Really Gold says krishna vamsi | Sakshi
Sakshi News home page

మెకన్నాస్ గోల్డ్... నిజంగా గోల్డ్

Published Sun, Jan 11 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

మెకన్నాస్ గోల్డ్... నిజంగా గోల్డ్

మెకన్నాస్ గోల్డ్... నిజంగా గోల్డ్

అందుకే... అంత బాగుంది!
 మెకన్నాస్ గోల్డ్ (1969)

 
 టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాక తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నా. అట్నుంచి చెన్నై వెళ్లా. ఏదైనా సినిమా చూడాలి. దేవి 70 ఎంఎం ముందు జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంగ్లిష్ సినిమా. పోస్టర్ ఆసక్తికరంగా అనిపించింది. పెద్ద క్యూ. చివరాఖరుకు టికెట్ దొరికింది. స్క్రీన్ నుంచి మూడో వరుస. అంత దగ్గరనుంచీ చూడటంతో మెడ పట్టేసినట్టుగా ఉన్నా, ఆ నొప్పి తెలియలేదు. సినిమాలో అంతలా లీనమైపోయాను. ‘‘ఆహా... ఇది కదా సినిమా అంటే’’ అనే ఫీలింగ్. ఆ సినిమా పేరు ‘మెకన్నాస్ గోల్డ్’... వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్లాసిక్స్ ఇన్ వరల్డ్ సినిమా. ఇప్పటికి 70 సార్లు చూసుంటానేమో! చూసిన ప్రతిసారీ ఫస్ట్ టైమ్ చూస్తున్న ఫీలింగ్. నాకు తెలిసినంత వరకూ సినీ చరిత్రలో ఇదొక అద్భుతం.
 
మళ్లీ ఎవరూ టచ్ కూడా చేయలేరు. మా గురువు రామ్‌గోపాల్‌వర్మ వల్ల ఈ సినిమా ఇంకా బాగా అర్థమైంది. ఆయనతో కలిసి ఈ సినిమా చూస్తున్నపుడు ఇందులోని గొప్పతనం గురించి ఎనలైజ్ చేసి చెప్పారు. ఇందులో ప్రతి కేరెక్టరూ నాకు గుర్తుంది. ప్రతి డైలాగూ గుర్తుంది. చివరకు రీ-రికార్డింగ్ కూడా గుర్తుంది. మీరు నాతోపాటు సినిమా చూస్తే... ప్రతి సీనూ డీటైల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. దాని గ్రేట్‌నెస్ విశ్లేషించగలను. ఒకసారి సినిమా చూసి నా ఆర్టికల్ చదవండి. లేదా ఈ ఆర్టికల్ చదువుతూ, సినిమా చూడండి. నాతో పాటు మీరు కూడా ‘మెకన్నాస్ గోల్డ్’ నిజంగా గోల్డ్ అని ఒప్పుకుని తీరతారు. రెడీ... స్టార్ట్..!
 
 తారాగణం: గ్రెగరీ పెక్, ఒమర్ షరీఫ్, టెల్లీ సెవాలస్, కేమిల్లా స్పర్వ్, కీనన్ విన్; దర్శకత్వం: జె. లీ థాంప్సన్
 నిర్మాతలు: కార్ల్ ఫోర్‌మన్, డిమిట్రి టియోరిన్; ఛాయాగ్రహణం: జోసెఫ్ మెక్‌డోనాల్డ్; సినిమా నిడివి: 128 నిమిషాలు
 విడుదల: 10-5-1969; నిర్మాణ వ్యయం: 70 లక్షల డాలర్లు

 
ఈ ప్రపంచాన్ని నడిపించే ఇంధనం డబ్బు. ఈ డబ్బుకు హయ్యెస్ట్ రూపం బంగారం. మనిషి తాలూకు ప్లస్సులూ, మైనస్సులూ అన్నీ డబ్బు దగ్గరే బయటపడిపోతాయి. ఈ సినిమాలో అవన్నీ కనబడతాయి. మెకన్నో అనేవాడు గోల్డ్ కోసం చేసిన సాహస యాత్రే ఈ సినిమా కాన్సెప్ట్.
 
టైటిల్స్ దగ్గర నుంచే మేజిక్ మొదలైపోతుంది. రాబందు పాయింటాఫ్ వ్యూలో ఏరియల్ షాట్. ఇక్కడ రాబందు అనేది క్రూరమైన పక్షి. హయ్యెస్ట్ యాంబిషన్ కలది. ఆకలేస్తే వేటాడేస్తుంది. మనిషిలోని డబ్బు ఆశకు ఇది రిప్రజెంటేషన్ అన్నమాట. మనిషిని పీక్కుతినే రాబందుతో షాట్ ఓపెన్ చేసి, ప్రేక్షకుడి మైండ్‌ను సైకలాజికల్‌గా ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు దర్శకుడు. రాబందు కనుగుడ్లను జూమ్ షాట్‌లో చూపెడతాడు. 1969లో ఆ షాట్ ఎలా తీశారా అని ఇప్పటికీ సంభ్రమంగా అనిపిస్తుంది.

ది ఫిక్షన్. కల్పిత కథ. కానీ నిజమని నమ్మించడానికి, వాయిస్ ఓవర్‌లో హిస్టరీ చెప్పించాడు దర్శకుడు. అపాచీలంటే అమెరికాలోనే తరతరాలుగా ఉన్నవారు. అమెరికా ఖండాన్ని కొలంబస్ కనిపెట్టకముందే, అపాచీలు అక్కడుండేవారు. వాళ్లు గిరిజనులు. అమెరికన్ గ్రాండ్‌కానియన్ గురించి సినిమా తీస్తున్నాడు కాబట్టి, అమెరికా చరిత్రతో సినిమాను మొదలుపెట్టాడు. ఆ డెరైక్టర్ ఆలోచనా స్థాయి ఎలా ఉందో చూడండి.
 
ఫస్ట్ సీన్‌లో హీరో మెకన్నోపై ఒక వృద్ధుడు దాడి చేస్తాడు. అక్కడ కాల్పులు, ప్రతికాల్పులు గమనించండి. ఆరుబయట కొండల మధ్య నిజంగా తుపాకీ పేలితే ఎలాంటి శబ్దాలొస్తాయో, దానికి తగ్గట్టుగా చిత్రీకరించాడు. హీరోయిన్‌ని విలన్ గ్యాంగ్ దౌర్జన్యంగా ఎత్తుకు వస్తారు కదా. ఆ డైలాగ్స్ వింటే, 1870ల నాటి ఆర్థిక పరిస్థితులు అన్నీ మన కళ్ల ముందు కదలాడతాయి.
 
విలన్ గ్యాంగ్, హీరోని బంధించి ఓ రోప్ బ్రిడ్జ్ మీదుగా తీసుకెళ్లే సీన్ ఉంటుంది. ఈ రోప్ బ్రిడ్జ్ కాన్సెప్ట్‌ని రకరకాల భాషల్లో రకరకాల సినిమాల్లో లెక్కలేనన్ని సార్లు చూసుంటారు. అసలు ప్రపంచంలో రోప్ బ్రిడ్జ్ కాన్సెప్ట్‌ని తెరపై చూపిన తొలి సినిమా ఇదే. సాహసగాథా చిత్రాల్లో ఒక ఉత్కంఠ తీసుకురావడానికి రోప్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ బాగా ఉపకరిస్తుందని ఈ దర్శకుడు ఆనాడే కనిపెట్టాడు.
 
ఈ సినిమాలో స్టోర్ కీపర్, ప్రీస్ట్, అంధుడు... ఇలా రకరకాల పాత్రలు కనిపిస్తాయి. డబ్బు ఆశ అనేది రకరకాల మనుషుల్లో ఎలా ఉంటుందో ఈ పాత్రల ద్వారా చూపించాడు దర్శకుడు. అడ్వంచరస్ ఫిల్మ్ అయినా హ్యూమన్ రిలేషన్స్‌తోనే సినిమాను ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చాడు. ప్రతి సన్నివేశంలోనూ ఆశ నిరాశలకూ, మానవత్వానికీ మధ్య దోబూచులాట ఉంటుంది. ప్రతి దృశ్యాన్నీ ఒక ప్రయోజనం కోసం దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ముచ్చటేస్తుంది. ఈ సినిమాలో అన్ని రసాలూ ఉంటాయి. హీరోయిజం, థ్రిల్, యాక్షన్, సెంటిమెంట్, ద్వేషం, అద్భుతం, మూఢ నమ్మకాలు, ప్రాక్టికాలిటీ... ఇలా అన్నీ కనిపిస్తాయి. స్త్రీ పాత్రల మధ్య సహజమైన అసూయ, వ్యామోహాలను బాగా ఒడిసిపట్టాడు. మన చుట్టూ ఉండే సమాజంలోని మనుషులే ప్రతిబింబిస్తారు. అందుకే, సినిమా అంతా ఎడారులు, కొండల్లో నడుస్తున్నా మన చుట్టుపక్కల జరుగుతున్నట్లే అనిపిస్తుంది.
 
 ఈ సినిమాలో హీరో ధీరోదాత్తుడిలా కాకుండా ఓ మామూలు మనిషిలా అనిపిస్తాడు. అతనికుండే బలహీనతలను కూడా మనకు చెప్పించాడు. ఎక్కడా ఓవర్ బిల్డప్‌లుండవు.
 
బంగారు నిధి కోసం విలన్ గ్యాంగ్ , హీరో అన్వేషిస్తూ వెళ్తున్న దారిలో ఓ కొలను కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నీళ్లు కనబడిన ఆనందాన్ని అక్కడ న్యూడ్ షాట్స్‌తో రిప్రజెంట్ చేశారు. విలన్‌తో పాటు విలన్ గ్యాంగ్‌లో ఉండే ఇండియన్ గాళ్ కొలనులో నగ్నంగా స్నానం చేయడంలో మనకు వేరే ఫీలింగ్ కనబడదు. అక్కడ అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ అద్భుతం.

ఈ సినిమాలోని మరో గొప్పతనం ఏంటంటే - ఒక్క లొకేషనూ రిపీట్ కాదు. ఇప్పట్లోలాగా స్టడీకామ్‌లు లేవు. అన్నీ పెద్ద సైజ్ కెమెరాలే. అయినా కూడా ఎక్కడా జెర్క్‌లు లేకుండా గుర్రాల ఛేజ్ తీశారంటే ఎంత శ్రమించి ఉంటారో కదా! హీరోను గుర్రాలతో ఈడ్చుకుంటూ వెళ్లే షాట్స్ చూడండి. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆడియన్స్ డిస్‌కనెక్ట్ కాకుండా ఎమోషనల్ ఎఫెక్ట్ కోసం వాయిస్ ఓవర్ ప్రక్రియను ఉపయోగించడం నాకు తెలిసి ఇదే ప్రథమం. జాగ్రత్తగా గమనిస్తే, సినిమాలో ఎక్కువ చోట్ల బ్యాక్ ప్రొజెక్షన్ షాట్స్ కనిపిస్తాయి. లొకేషన్ షాట్స్‌నీ, వాటినీ బాగా మ్యాచ్ చేశారు.
 
సూర్యుడు మన లైఫ్‌ని ఎప్పుడూ యాక్టివేట్ చేస్తూ ఉంటాడు. ప్రతీకాత్మకంగా చిత్రమంతా సూర్యుణ్ణీ, రాబందునూ చూపిస్తూనే ఉంటాడు దర్శకుడు.
 
సాహసాలను కూడా విభిన్న కోణాల్లో చూపారు. నేల మీద, వేలాడే బ్రిడ్జి మీద, నీటిలో బల్లకట్టు మీద సాహసాలు చేయించారు. ఈ బల్లకట్టు సాహసకృత్యాలు చూస్తుంటే... మీకు బోలెడన్ని తెలుగు సినిమా క్లైమాక్స్‌లు గుర్తుకొచ్చేస్తాయి.
క్లైమాక్స్‌కి ముందు సన్నివేశాలు చిత్రీకరించిన తీరుతో కథకు మరింత ఊపు తెచ్చాడు దర్శకుడు. తెల్లవారితే సూర్యుడొస్తాడు. ఆ రాత్రి హీరో, విలన్ గ్యాంగ్ అంతా ఓ చోట బస చేస్తారు. అక్కడి దృశ్యాలను చాలా శక్తిమంతంగా, భావోద్వేగ భరితంగా తీశాడు. దుర్మార్గుడైన విలన్ తాలూకు లక్ష్యాన్ని చూపించాడు. ప్యారిస్‌లో ఓ గొప్ప మిలియనీర్ కావాలనేది విలన్ ఆశ. మంచివాళ్లకు ఆశలున్నట్టే, చెడ్డవాళ్లకూ ఆశలుంటాయి కదా. దాన్ని డెరైక్టర్ భలేగా సెల్యులాయిడ్‌పైకి ఎక్కించాడు. ఈ దృశ్యం చూస్తే విలన్ మీద చిన్న జాలి కలుగుతుంది.
 
 క్లైమాక్స్‌లో సూర్యోదయ ఘట్టంలో కొండ తాలూకు పొడవాటి నీడలు నేలపై పరుచుకొనే దృశ్యాలను చాలా అద్భుతంగా తీశాడు. అప్పట్లో ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు కదా. క్లైమాక్స్‌లో కనిపించే బంగారు నిధి మొత్తం సెట్. రియల్ లొకేషన్‌లోని దృశ్యానికీ, సెట్‌కీ మధ్య తేడా తెలియనివ్వకుండా తెలివిగా దృశ్యాలు తీశారు. మనిషి గుండె చప్పుడును ఇక్కడ నేపథ్య సంగీతంగా వాడడం ఎక్స్‌లెంట్ ఐడియా. చివర్లో కొండ మీద హీరో, విలన్ ఫైట్ చాలా పట్టుగా ఉంటుంది. ‘శివ’లో నాగార్జున, రఘువరన్‌ల క్లైమాక్స్ ఫైట్‌కి ఇదే ప్రేరణ.
 
సినిమా అంతా బంగారు నిధి కోసం అన్వేషణే అని మనకు ముందే తెలుసు. కానీ దాని కోసం సాగే సుదీర్ఘ ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా తెరపై చూపడంలో దర్శకుడి మేధ కనబడుతుంది. సైన్స్‌ని కూడా బాగా వాడుకున్నాడు. గుర్రాలు నీళ్లలో ఈదడం, క్రమబద్ధమైన గుర్రపు డెక్కల శబ్దాలకు కొండచరియలు విరగడం లాంటి సినిమాటిక్ అంశాలను శాస్త్రీయ దృక్కోణం కలగలిపి చూపించాడు. ఈ సినిమా కథ ఒక్కడితో స్టార్ట్ అవుతుంది. ఇద్దరితో ఎండ్ అవుతుంది. మధ్యలో వందలమంది వచ్చి వెళ్లిపోతారు. ఇదో గొప్ప టెక్నిక్.
 
విలన్ జాన్ కొలరాడోగా చేసిన ఒమర్ షరీఫ్ లెజండరీ యాక్టర్. ‘లారెన్‌‌స ఆఫ్ అరేబియా’, ‘డాక్టర్ జివాగో’ లాంటి గొప్ప చిత్రాల్లో నటించాడు. హీరో పాత్రధారి గ్రెగరీ పెక్ గొప్ప గొప్ప క్లాసిక్స్ చేశాడు. చిరస్మర ణీయ హారర్ ఫిల్మ్ ‘ఓమెన్’, వరల్డ్ క్లాసిక్ చిత్రం ‘రోమన్ హాలీడే’ చిత్రాల్లో ఆయనే హీరో.  
 
 ‘మెకన్నాస్ గోల్డ్’ విచిత్రంగా ఫస్ట్ రిలీజ్‌లో సరిగ్గా ఆడలేదు. తర్వాత తర్వాత ‘వెండితెర ఆణిముత్యం’గా నిలిచిపోయింది.
 
 ‘మెకన్నాస్ గోల్డ్’ వచ్చి ఇప్పటికి 46 ఏళ్లవుతోంది. కానీ కాన్సెప్ట్ ఇప్పటికీ ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఎంత డెవలప్ అయినా, డబ్బు మీద ఆశలో మార్పు లేదు కదా. ఈ విషయంలో దర్శకుడి ముందుచూపును మెచ్చుకోవాలి. భవిష్యత్తును ముందుగానే దర్శించేవాడే దర్శకుడు కదా.
 
ఇప్పటివరకూ వేల సినిమాలు చూసి ఉంటాం. కానీ సినిమా అంతా హీరో, విలన్ - ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడం ఎక్కడా చూసి ఉండం. రామాయణమైనా, మహాభారతమైనా, ఇతర ఏ కావ్యాలను తీసుకున్నా హీరో ఒక చోట ఉంటే, విలన్ మరో చోట ఉంటాడు. ఇలా హీరోని, విలన్‌ని కలిపి కథ నడపడం గ్రేట్.
 
‘మెకన్నాస్ గోల్డ్’ షూటింగ్ అంతా జరిపిన ‘గ్రాండ్ కానియన్’ ప్రాంతం అమెరికాలో ఆర్కియలాజికల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఉంది. లాస్‌వేగాస్‌కి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం ఇప్పటికీ అలానే ఉంది. ‘మిషన్ ఇంపాజిబుల్-2’, ‘బ్రోకెన్ యారో’, మన మహేశ్‌బాబు నటించిన ‘టక్కరి దొంగ’ లాంటి సినిమాలను అక్కడే చిత్రీకరించారు.
మైండ్‌ని, హార్ట్‌ని, సోల్‌ని టచ్ చేసే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందులో ముందు వరుసలో నిలిచే సినిమా ఇది.
 
 ఒక్క మాటలో చెప్పాలంటే... ఈ సినిమా ఒక అద్భుతం. సినిమాకు ఏమేం శాఖలు అవసరమో, ఎంతవరకూ అవసరమో వాటన్నిటినీ సమగ్రంగా ఉపయోగించుకొని తీసిన సినిమా ఇది.
 
  కథ ఎలా చేయాలి? స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి? సీన్ మూడ్ ఎలా ఉండాలి?.. ఇలాంటి విషయాల్లో ఈ సినిమా నాకు ఒక డిక్షనరీ లాంటిది. స్టోరీ, స్క్రీన్‌ప్లే, షార్ప్ డైలాగ్స్, ఫ్రేమ్స్, షాట్స్, మ్యూజిక్, ఇంటరాక్షన్స్, ఎలిమెంట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మూడ్, ఎడిటింగ్, లొకేషన్స్, కాస్టింగ్... ఇలా ప్రతి సీన్ నా మనసులో ముద్ర వేసుకున్నాయి.
  ‘సెవెన్ సమురాయ్’ ఐడియాతో మన హిందీ చిత్రం ‘షోలే’ తీసినా, దాని మేకింగ్‌కి ఇన్‌స్పిరేషన్ మాత్రం ఇదే.
  నేను ఎప్పటికైనా ‘మెకన్నాస్ గోల్డ్’ ప్రేరణతో అద్భుతమైన అడ్వంచరస్ సినిమా తీస్తా. అలాగని దీన్ని కాపీ కొట్టను. కేవలం మెకానిజాన్ని వాడుకుంటా... అంతే! ఈ సినిమా చూడండి... మీకూ ఏదో ఒక ప్రేరణ కలగకపోతే నన్ను అడగండి!
 
 సాహస గాథలకు స్ఫూర్తి శిఖరం
 సామాజిక కథాంశాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకునిగా జె. లీ థామ్సన్ ఫేమస్. కేవలం ఒక తరహా చిత్రాలే కాకుండా వినోద ప్రధానంగా, సంగీత ప్రధానంగా సాగే చిత్రాలు తీసిన ఘనత ఆయనది. ‘మర్డర్ వితవుట్ క్రైమ్’ (1950) ఆయన తొలి చిత్రం. అక్కణ్ణుంచి 1989వరకు ఏడాదికి పది చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. చివరి చిత్రం ‘కింజైట్: ఫర్‌బిడెన్ సబ్జెక్ట్స్’. దాంతో రిటైర్ అయ్యారాయన. థామ్సన్ 2002లో కన్నుమూసినా, ‘ది గన్స్ ఆఫ్ నావరోన్’, ‘టైగర్ బే’, ‘ఐస్ కోల్డ్ ఇన్ అలెక్స్’, ‘మెకన్నాస్ గోల్డ్’ తదితర చిత్రాలతో చిరంజీవిగా నిలిచిపోయారు.
 
 (సంభాషణ: పులగం చిన్నారాయణ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement