
హాస్య నటుడు మాడా కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, ‘పేడి’ క్యారెక్టర్లను పోషించడం ద్వారా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న అలనాటి నటుడు మాడా వెంకటేశ్వరరావు(65) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 17న ఆయన ఆసుపత్రిలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రావుంలో 1950 అక్టోబర్ 10న జన్మించిన మాడా.. 300 పైగా సినివూల్లో నటించారు.
బాపు నుంచి దాసరి వరకు...
తెలుగు సినీ పరిశ్రమ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌లోకి మారుతున్న రోజుల్లో మాడా సినీపరిశ్రమలోకి అడుగు పెట్టాడు. పద్మనాభం, రాజబాబు తర్వాతి తరం హాస్యనటులుగా అడుగుపెడుతున్న కేవీ చలం, సారథి, పొట్టి ప్రసాద్ తదితరులతో పాటు కెరీర్‌ను మొదలుపెట్టారు. తొలుత బాపు దర్శకత్వం వహించిన ‘అందాల రాముడు’ (1973)వంటి సినిమాల్లో కనిపించినా ‘ముత్యాల ముగ్గు’ (1975)లో రెండు నిమిషాల పాటు కనిపించే బేరగాడి పాత్రలో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఆ సినిమాలో కాంట్రాక్టర్ పాత్ర పోషించిన రావు గోపాలరావు దగ్గరకు వచ్చి ‘చేయి తీసేస్తే ఎంత, కాలు తీసేస్తే ఎంత, చేయీ కాలు కలిపి తీసేస్తే ఎంత’... అని మాటిమాటికీ చిటికెలు వేస్తూ త్రిబుల్ ఫైవ్ ప్యాకెట్ పట్టుకుని మాట్లాడే మాడా ప్రేక్షకుల మనసును చూరగొన్నారు.
ఆ తర్వాత దాసరి దర్శకత్వం వహించిన ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ (1977)లో పోషించిన ‘పువ్వుల కొమ్మయ్య’ అనే పేడి పాత్ర మాడాను ఆ తరహా పాత్రలలో చాలా పాపులర్ చేసింది. అందులో మాడా మీద చిత్రీకరించిన ‘చూడు పిన్నమ్మా... పాడు బుల్లోడు’... పాట మాడాకే కాదు దాన్ని పాడిన బాల సుబ్రహ్మణ్యానికి కూడా విశేషమైన పేరు సంపాదించి పెట్టింది. ఇది నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు అదే పాత్ర ఆయనలోని ప్రతిభను పరిమితం చేసిందని చెప్పాలి.
ప్రేక్షకులు మెచ్చారు కదా అని అలాంటి పాత్ర వస్తే చాలు మాడాను పిలవడం ప్రారంభించారు. అయినప్పటికీ ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోల స్నేహితుల, శిష్యుల పాత్రల్లో మాడా కనిపిస్తూ తన స్టేటస్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పక్కన రాజబాబు వేయాల్సిన పాత్రలను ఒక దశలో మాడా లేదంటే నగేశ్ వేయాల్సి వచ్చింది.
కల్ట్ ఫిగర్..: మాడా ఇతర హాస్య నటులతో పోల్చితే తక్కువ సినిమాల్లో నటించినా తెలుగునాట ఆయనొక ‘కల్ట్ ఫిగర్’గా చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. ముఖ్యంగా ఇ.వి.వి సినిమాల్లో మాడా పేరు తరచూ వినిపిస్తూ ‘నేనేమైనా ఆడా మగా కాని మాడానా’ అనే డైలాగులు పడేవి. సాధారణ జన బాహుళ్యంలో కూడా ‘థర్డ్ జండర్’ను ఉద్దేశించడానికి ‘మాడా’ అనే మాటను వాడే ఆనవాయితీ ఉందంటే తాను పోషించిన పాత్రను అంతగా పాపులరైజ్ చేయగలిగిన మాడా ప్రతిభను మెచ్చుకోవాలి. మాడా హైదరాబాద్‌లో అక్కినేని, గుమ్మడి వంటి సీనియర్ల బృందానికి సన్నిహితంగా మెలిగారు. అక్కినేని మరణించినప్పుడు టీవీలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కనిపించిన మాడా ఆ తర్వాత ఇలా వీడ్కోలు వార్తతో పలకరించడం సినీ అభిమానులను విషాదంలో ముంచింది.