
నకిలీ పోలీసు కారుతో పాప్‌సింగర్ బురిడీ!
లండన్: ఎదురుగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. తప్పించుకొని ముందుకెళ్లడానికి మార్గం లేదు. ఈ క్రమంలో ఓ పాప్ సింగర్ పోలీసులను, సాటి వాహనదారులను బోల్తా కొట్టించింది. నకిలీ పోలీసు కారులో ట్రాఫిక్ మధ్య నుంచి దూసుకుపోయింది. ఆమె వాహనంపై బుగ్గలో ఎరుపు, నీలిరంగు వెలుగులు రావడంతో అది పోలీసు కారును భావించి.. సాటి వాహనదారులు దారి ఇచ్చారు. ఈ దుస్సాహసానికి తెగబడింది ప్రముఖ పాప్ సింగర్ మడోన్నానే! ఆమె మంగళవారం, బుధవారం లండన్ లోని ఓ2 ఏరెనాలో ప్రాంతంలో ప్రయాణించింది. ఆమె తన నలుపు రంగు జగ్వార్ కారులో పోలీసుల మాదిరిగా ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్లతో ముందుకు వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఫిమేల్‌ఫస్ట్.యూకే డాట్‌కామ్ తెలిపింది.
'ఓ2 ఏరెనా వద్ద నేను నిలబడి ఎదురుచూస్తూ ఉన్నాను. వాహనాలతో రోడ్లన్నీ దిగ్భంధనం అయ్యాయి. ఈ సమయంలో అకస్మాత్తుగా ఓ వాహనం ఫ్లాష్ లైట్లతో, భారీ చప్పుడు చేస్తూ దూసుకొచ్చింది. ఇది అండర్ కవర్ కాప్ వాహనం అయి ఉంటుందని భావించి అందరూ దారి వదిలారు. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. తీరా చూస్తే వాహనంలో పాప్ సింగర్ మడోన్నా ఉన్నారు.' అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.