
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, భట్ కుటుంబం మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ గతంలో కంగనా రనౌత్‌పై చెప్పు విసిరారని ఆమె సోదరి రంగోలి చందేల్ ట్వీట్ చేశారు. అదే విధంగా వీలు చిక్కినప్పుడల్లా అలియా భట్ నటనను విమర్శిస్తూ కంగనా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంగనాకు అవకాశాలు ఇచ్చి తన భర్త (మహేష్ భట్) ప్రోత్సహిస్తే ఇప్పుడు ఆమె.. ఆయన భార్య, కుమార్తెపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని అలియా తల్లి సోని రజ్దాన్ మండిపడ్డారు. అయితే కంగనా తనను విమర్శించినప్పటికీ ఆమే తన అభిమాన నటి అని, ఇక తనపై కంగనాకు ఉన్న అభిప్రాయం గురించి పట్టించుకోనని అలియా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి మహేష్ భట్ కంగనా తన కూతురు వంటిదంటూ.. కంగనా, రంగోలి ఆరోపణలను తేలికగా తీసిపారేశారు.
ఈ విషయం గురించి మహేష్ భట్ మాట్లాడుతూ.. ‘కంగనా చిన్నపిల్ల. నా కూతురు వంటిది. మాతోనే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. తన బంధువు నాపై ఏవో ఆరోపణలు చేసినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల ప్రవర్తన పట్ల వేలు ఎత్తి చూపే సంస్కృతి మనది కాదు. కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటం సాధ్యం కాని పని. అలాంటివి నేను చేయను కూడా. నాకున్న సంస్కారం కారణంగానే ఎవరేమన్నా ఊరుకున్నాను. చనిపోయేదాకా ఇలాగే ఉంటాను’ అంటూ పరోక్షంగా కంగనా తీరును ఎత్తిచూపారు.
కాగా 2006 గ్యాంగ్‌స్టర్ సినిమాతో కంగనా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేష్ భట్ తన సోదరుడితో కలిసి నిర్మించారు. అయితే ఈ సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన కారణంగా మరో సినిమాలో నటించాల్సిందిగా కోరగా.. అందులోని సూసైడ్ బాంబర్ పాత్ర నచ్చకపోవడంతో కంగనా మహేష్ ఆఫర్‌ను తిరస్కరించిందని రంగోలి పేర్కొంది. దీంతో కంగనాపై కక్ష గట్టిన మహేష్ భట్.. వాహ్ లంహే చిత్రాన్ని చూసేందుకు కంగనా రాగా ఆమెపై చెప్పు విసిరాడని ఆరోపించింది. ప్రివ్యూ థియేటర్‌లోకి కంగనాను అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించడంతో ఆ రాత్రంతా కంగనా ఏడుస్తూనే ఉందని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment