షీనాబోరా తల్లి పాత్రలో బాలీవుడ్ నటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్య ఉదంతాన్ని తెరకెక్కిస్తున్నారు. బెంగాలీ భాషలో తీస్తున్న 'డార్క్ చాకొలెట్' సినిమాలో షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా పాత్రలో బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మహిమ ఈ విషయం చెప్పింది. ఇంద్రాణిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్ర పోషించినట్టు తెలిపింది.
'షీనాబోరా హత్యను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఇందులో షీనాబోరా తల్లి పాత్రలో నటించాను. నాకిదే తొలి బెంగాలీ చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు ఎంతో ఉత్సుకతగా ఉంది' అని మహిమ చెప్పింది. అగ్నిదేవ్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా చౌదరితో పాటు రియా సేన్, ముంతాజ్ సార్కర్, రాజేశ్ శర్మ నటించారు.
ఇంద్రాణి తన మాజీ భర్త (రెండో భర్త) సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్తో కలసి కూతురు (మొదటి భర్త ద్వారా) షీనాబోరాను హత్య చేయించడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియా కొడుకు, షీనాబోరా ప్రేమించుకోవడం, ఇతర ఆర్థిక వ్యవహారాలు ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.