ఆ ఫొటో పెట్టినందుకు హీరోయిన్ సారీ!
ముంబై: పాకిస్థానీ నటి మహీరాఖాన్ ట్విట్టర్‌లో పెట్టిన ఓ ఫొటో వివాదాస్పదమైంది. ఇటీవల హాలోవిన్ పార్టీ సందర్భంగా శివసేన అధినేత బాల్‌ఠాక్రేను పోలినవిధంగా దుస్తులు వేసుకొని, నుదుట తిలకం ధరించిన పాకిస్థాన్ దర్శకుడు అసీజ్ రజాతోపాటు ఆమె దిగిన ఈ ఫొటో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఈ ఫొటోలో శివసైనికుడి మాదిరిగా దుస్తులు వేసుకున్న దర్శకుడు రజా 'మహీరాకో బార్ నికాలో' (మహీరాను వెళ్లగొట్టండి) అన్న ప్లకార్డు పట్టుకొని ఉండగా.. ఆయన పక్కన క్యాట్ వుమన్ డ్రెస్‌లో ఉన్న మహీరా కనిపించింది.
ఈ ఫొటో వెలుగుచూడటంతో మహీరాఖాన్ క్షమాపణలు చెప్పింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, ఈ ఫొటో వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆమె తెలిపారు. పాక్ నటి అయిన మహీరాఖాన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాయిస్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. పాకిస్థాన్ నటులు బాలీవుడ్‌లో నటించవద్దని శివసేన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మహీరాఖాన్ ఫొటోపై పలు విమర్శలు వచ్చాయి.