డైనమైట్ రివ్యూ
చిత్రం : డైనమైట్
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి
దర్శకత్వం : దేవాకట్ట
నిర్మాత : మంచు విష్ణు
సంగీతం : అచ్చు
నిడివి : 142 నిమిషాలు
విడుదల : 04-09-15
యాక్షన్ స్టార్ ఇమేజ్ కోసం మంచు విష్ణు చేసిన ప్రయత్నమే డైనమైట్. తమిళ్లో ఘనవిజయం సాధించిన 'అరిమనంబి' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను చిన్నపాటి స్క్రీన్ప్లే మార్పులతో తెలుగు ప్రేక్షకులకు అందించాడు డైరెక్టర్ దేవాకట్ట. ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి విష్ణు ప్రయత్నం ఎంత వరకు వర్క్అవుట్ అయ్యిందో రివ్యూలో చూద్దాం.
కథ:
అనుకోకుండా కలిసిన శివాజీ ( విష్ణు ) అనామిక ( ప్రణీత )లు తొలి పరిచయంలోనే దగ్గరవుతారు. ఈ ఇద్దరు డేట్ కు వెళ్లిన సమయంలో అనామిక కిడ్నాప్ అవుతుంది. ఈ కిడ్నాప్ కు సంబంధించి శివాజీ పోలీసులకు సమాచారం అందించినా ఎటువంటి ఆధారాలు దొరక్కపోవటంతో, అతనే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనామిక ఓ మెమరీకార్డ్ మూలంగా చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుందని తెలుసుకుంటాడు. అసలు ఆ మెమరీకార్డ్ లో ఏముంది.? అనామికను కిడ్నాప్ చేసింది ఎవరు ? ఈ సమస్య నుంచి అనామికను శివాజీ ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ ?
నటన:
ఈ సినిమా కోసం సరికొత్త లుక్ ట్రై చేసిన మంచు విష్ణు ఆకట్టుకున్నాడు. పర్ఫామెన్స్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ స్క్రీన్ మీద చూడని చాలా రిస్కీ స్టంట్స్ను విష్ణు డూప్ లేకుండా చేశాడు. తెర మీద ఈ సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. చాలా రోజులుగా విష్ణు కోరుకుంటున్న యాక్షన్ ఇమేజ్ ఈ సినిమాతో సాధించాడు. కేవలం యాక్షన్ సీన్స్ లో మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.
ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది ప్రణీత. యాక్టింగ్ పరంగా ఎలా ఉన్నా గ్లామర్ తో మాత్రం అలరించింది. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన పాత్రలోనే కనిపించిన సీనియర్ స్టార్ జెడీ చక్రవర్తి మరోసారి బెస్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా మెమరీ కార్డ్ లో ఉన్న సన్నివేశాలు చూసే సమయంలో జెడీ పర్ఫామెన్స్ అమేజింగ్ అనిపిస్తుంది. ఇతర పాత్రల్లో రాజా రవీంద్ర, నాగిరెడ్డి, ప్రవీణ్, పరుచూరి వెంకటేశ్వరరావులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఆటోనగర్ సూర్య లాంటి భారీ డిజాస్టర్ తరువాత గ్యారెంటీ హిట్ కొట్టాల్సిన సమయంలో దేవాకట్ట కరెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఎమోషనల్ డ్రామాలు మాత్రమే డీల్ చేసిన దేవ ఈ సినిమాతో యాక్షన్ థ్రిల్లర్లు కూడా ఈజీగా డీల్ చేయగలడని ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే దేవాకట్ట కెరీర్ లోనే బెస్ట్. థ్రిల్లర్ సినిమాలకు ప్రాణం లాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చిన్నా మంచి మార్కులు సాధించాడు. సతీష్ సినిమాటోగ్రఫి, విజయన్ ఫైట్స్ సూపర్బ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
విశ్లేషణ :
యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు టైట్ స్క్రీన్ప్లే తో ఈ మూవీ ప్రతీ ఆడియన్ ను థియేటర్ లో కదలకుండా కూర్చోబెట్టగలదు. విలన్ ఎవరు అన్న విషయం రివీల్ అయ్యే వరకు నడిచే మైండ్ గేమ్, ఆ తరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. తొలి భాగంలో కొన్నిసన్నివేశాలు ఇబ్బంది పెట్టినా, రెండో భాగం మాత్రం చాలా ఇంట్రస్టింగ్గా సాగుతుంది. విష్ణు కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిలిం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది.
ఓవరాల్గా మంచి ప్రయత్నం, యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్
- సతీష్ రెడ్డి, సాక్షి ఇంటర్ నెట్ డెస్క్