మనోల్లాసం | mano the singer | Sakshi
Sakshi News home page

మనోల్లాసం

Published Fri, Mar 20 2015 11:45 PM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

మనోల్లాసం - Sakshi

మనోల్లాసం

ఆయన పాటందుకుంటే అల్లరి ఉంటుంది. పద్యం అందుకున్నాడంటే ఆ ప్రవాహం ఆపడం ఎవరి తరం కాదు.

ఆయన పాటందుకుంటే అల్లరి ఉంటుంది.  పద్యం అందుకున్నాడంటే ఆ ప్రవాహం ఆపడం ఎవరి తరం కాదు. తెలుగునాట తన గాత్రంతో ట్రెండ్ సెట్టర్‌గా మారిన మనోకు ఉగాది అంటే మనోల్లాసంగా జరుపుకునే వేడుక. షడ్రుచుల ఉగాది పచ్చడి జీవిత సత్యాన్ని తెలియజేస్తుందంటున్న మనోతో ‘సిటీప్లస్’ ఉగాది ముచ్చట్లు.
 ..:: భువనేశ్వరి
 
నాకప్పుడు ఏడేళ్లు. ఓ పండుగపూట అమ్మ అన్నయ్యలకు చిన్న చిన్న గిన్నెల్లో ఏదో స్వీటు పెట్టి ఇచ్చింది. నాకివ్వలేదు. అమ్మ వంటింట్లో లేని సమయంలో మెల్లిగా వెళ్లి ఆ స్వీటు ఉన్న గిన్నె ఎక్కడ పెట్టిందో వెతికాను. ఇంతలో రెండు గిన్నెలు పడి పెద్ద శబ్దం వచ్చింది. అమ్మ వచ్చేలోపు ఆ గిన్నె అందుకుని బయటకు పరిగెత్తాను. చేతికి వచ్చినంత తీసుకుని నోట్లో వేసుకున్నాను. అయ్య బాబోయ్.. చేదు! దెబ్బకు ఆ గిన్నె అక్కడే పడేసి అమ్మ దగ్గరికెళ్లి ఆ చేదు తగ్గడానికి ఏదైనా తీపి పెట్టమని అడిగితే పావలా చేతిలో పెట్టింది. వెంటనే కిరాణా కొట్టుకెళ్లి పిప్పరమెంటు కొనుక్కుని నోట్లో వేసుకున్నాను.
 
బుల్లిబాబు...

‘ఇంత చేదుగా ఉన్నదాన్ని అంత ఇష్టంగా ఎలా తింటున్నారమ్మా?’ అని అడిగితే.. ‘అది ఉగాది పచ్చడిరా.. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.. జీవితం అంటే షడ్రుచుల సమ్మేళనం. ఈ ఆరు రుచులను ఒకే విధంగా ఆస్వాదించడమే జీవిత సత్యం’ అంటూ అమ్మ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను పుట్టింది, పెరిగింది సత్తెనపల్లిలో.. నాకు ఆరేళ్లుండగా విజయవాడకు మకాం మార్చాం. నాన్న రసూల్ హార్మోనిస్టు, అమ్మ షహీబా పౌరాణిక డ్రామా ఆర్టిస్టు. చింతామణి, సత్యభామ పాత్రలు బాగా చేసేది. ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క. నేనే చిన్నోణ్ని. ఇంట్లో అందరూ ముద్దుగా బుల్లిబాబు అనేవారు. అమ్మ  ఇంకొంచెం ముద్దుగా ‘బుల్లోడా..’ అని పిలిచేది. మొదటిసారి ఉగాది పచ్చడి తిన్నప్పుడు ‘ఇంత ప్రేమగా పిలిచే అమ్మ ఇంత చేదు స్వీటు ఎలా చేసిందబ్బా’ అని అనుకున్నా. (నవ్వుతూ...).
 
ఆ రుచుల విలువ...

నాకు చిన్నప్పుడే చేదు, తీపిల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. పద్నాలుగేళ్ల వయసులో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. చిన్న చిన్న చాన్సులు.. ఒక రోజు ఇరవై రూపాయలు.. ఇంకో రోజు ముప్పయ్.. సంపాదించి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో నాకు చేదు వెనుకున్న తీపి ఎలా ఉంటుందో తెలిసింది. ఒక్కోరోజు 22 గంటలు పనిచేసిన సందర్భాలున్నాయి. తక్కువ సమయంలోనే గురువు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంటు ఉద్యోగం సంపాదించుకున్నాను. పిల్లాడు దారిలో పడ్డాడు అనుకున్నారో ఏమో.. అమ్మానాన్న నాకు ఇరవై ఏళ్లకే పెళ్లి చేసేశారు. దాంతో ఇంకాస్త బాధ్యత పెరిగింది. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నదేంటంటే.. కుటుంబం, వృత్తి పట్ల బాధ్యతగా మసులుకునే వారికి షడ్రుచుల విలువ త్వరగా తెలుస్తుంది.
 
గురువుగారింట్లో..

మా ఇంట్లో అన్ని పండుగలూ గ్రాండ్‌గా చేస్తారు. సంక్రాంతి నుంచి శ్రీరామనవమి వరకూ అన్నీ చాలా శ్రద్ధగా చేస్తారు. ఉగాది పచ్చడి స్పెషల్ ఏంటంటే.. ఆ రోజంతా ఇంటికి వచ్చినవారికి ప్రేమగా పచ్చడి పెట్టడం. ఆ తర్వాత ఆ ప్రేమను చక్రవర్తిగారింట్లో చూశాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే రోజుల్లో ఉగాది రోజున ఇంటికి పిలిచి పచ్చడి పెట్టి, భోజనం పెట్టించి బట్టలు పెట్టి పంపేవారు. నాకే కాదు.. ఆయన దగ్గర పనిచేస్తున్న ప్రతిఒక్కరికి పెట్టేవారు.

ఇన్నేళ్లలో చాలామంది మిత్రుల ఇళ్లలో పచ్చడి తిన్నాను. ముఖ్యంగా కమలహాసన్, రజనీకాంత్ ఇళ్లలో. వారి ప్రత్యేకత ఏంటంటే.. వారి పండగ కాకపోయినా ఈ రోజున ప్రత్యేకంగా పచ్చడి చేయించి ఇంటికి వచ్చిన వారందరికీ పెట్టేవారు. ఎందుకంటే వాళ్లు పొద్దునలేచి పనిచేసేది తెలుగువారితోనే కదా! దాంతో మిగతా పండుగలు ఎలా ఉన్నా ఉగాది రోజు పచ్చడి సందడి చాలా ఉండేది. కొందరు తెలియనివారు మాలాంటి వారిని అడిగిమరీ తెలుసుకుని పచ్చడి తయారు చేయించేవారు.
 
అమ్మచేతి పచ్చడి...

మా అమ్మగారు కళాకారిణిగా ఎంత బిజీగా ఉన్నా.. వంట విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఆమె వంటలు చాలా రుచిగా ఉండేవి. పచ్చడి ఎవరూ చేసినా చేదుగానే ఉంటుందనుకోండి. కానీ అమ్మ చేతి పచ్చడి కొంచెం డిఫరెంట్. ఇప్పుడు నా భార్య జమీలా కూడా అమ్మలాగే ఉగాది రోజు చాలా హడావిడి చేస్తుంది. ఇంటికొచ్చినవారికి పచ్చడి పెట్టకుండా పంపదు. మిగతా పండుగలన్నీ మనకు సంతోషాన్ని పంచేవైతే ఈ పండగ సంతోషంతో పాటు జీవిత సత్యాన్ని కూడా తెలుపుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement