మెగాస్టార్ సినిమాలు నేలక్లాసులో చూశా.. | Mantra-2 Hero chetan chit chat | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ సినిమాలు నేలక్లాసులో చూశా..

Published Wed, Aug 5 2015 2:05 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

మెగాస్టార్ సినిమాలు నేలక్లాసులో చూశా.. - Sakshi

మెగాస్టార్ సినిమాలు నేలక్లాసులో చూశా..

*'ముఠామేస్త్రి' పోస్టర్‌కు కూరగాయల దండేశా
*నేను కోనసీమ కుర్రాడినని గర్వంగా చెప్పుకొంటా..
*'మంత్ర-2' కథానాయకుడు చేతన్ శ్రీను


అమలాపురం : 'అమలాపురంలో నా చిన్నతనంలో చిరంజీవి సినిమాల్ని స్నేహితులతో కలసి నేల టిక్కెట్లు కొనుక్కుని చూసేవాడిని. 'ముఠామేస్త్రి'  సినిమా వచ్చినప్పుడు చిరంజీవి పోస్టర్‌కు కూరగాయల దండ వేశాం' అని అప్పటి జ్ఞాపకాల్ని నెమరేసుకున్నాడు 'మంత్ర-2' హీరో చేతన్ శ్రీను. ఛార్మితో కలిసి ఆ చిత్రంలో నటించిన చేతన్ అమలాపురంలో పుట్టి పదేళ్ల దాకా ఇక్కడ పెరిగినోడే.

ఆ చిత్రం విడుదలయ్యాక ఆ యువ హీరో తన సొంతూరు అమలాపురంలోనూ, చిన్న తనంలో తాను తిరిగిన కోనసీమలోనూ గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాడు. చేతన్‌కు ఇక్కడి యువత బ్రహ్మరథం పడుతున్నారు. అమలాపురం కొంకాపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకుడు మేడిది రమేష్‌బాబు ఇంట మంగళవారం చేతన్ 'సాక్షి'తో కొద్దిసేపు ముచ్చటించారు. అమలాపురంతో తనకున్న అనుబంధాన్ని ఇలా నెమరేసుకున్నారు..

 'నేను అమలాపురంలోనే పుట్టాను. సెయింట్ జాన్స్ స్కూలులో అయిదో తరగతి వరకూ చదువుకున్నా. మా నాన్న సత్యనారాయణకు మద్రాసులో చందమామ పత్రికలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగం రావటంతో మా కుటుంబం అక్కడే స్థిర పడిపోయింది. నా 11 ఏటనే తమిళ సినిమాల్లో సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత చదువు పూర్తి చేసి ముంబైలోని అనుపమకేర్ యాక్టింగ్ స్కూల్‌లో చేరా. అక్కడే యాడ్ ఫిలిమ్స్‌లో అవకాశాలు వచ్చాయి. ఫైవ్ స్టార్, మ్యాంగ్ జ్యూస్ తదితర యాడ్‌ల్లో పనిచేశా. హెయిర్ కలర్ గార్నియర్‌కు అంబాసిడర్‌గా ఉండి యాడ్ ఫిలిమ్స్‌లో గుర్తింపు తెచ్చుకున్నా. తమిళంలో హీరోగా చేసిన నాలుగు  సినిమాల్లో 'కరుంగళి' లో కోనసీమ అమ్మాయి  అంజలితో హీరోగా నటించా.

తెలుగులో మరో నాలుగు సినిమాల్లో హీరోగా పనిచేస్తున్నాను. మంత్ర -2 సినిమా పెద్ద హిట్ కాకపోయినా తెలుగులో నా తొలి సినిమా విడుదలైన ఆనందాన్ని సొంతూరు, సొంతగడ్డ వారితో పంచుకోవాలని వచ్చాను. నా రెండో తెలుగు సినిమా ‘రాజు గారి గది’ ఈనెలలోనే విడుదల కానుంది. సెరో గ్రూప్స్ సంస్థ నేను హీరోగా తీస్తున్న చిత్రాన్ని దాదాపు కోనసీమలోనే తీసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కాక భారీ బడ్జెట్‌తో నిర్మించే మరో రెండు సినిమాల్లో నటించేందుకు అంగీకారాలు కుదిరాయి. నాకు రఘువరన్, ప్రకాశ్‌రాజ్‌లు స్ఫూర్తి. బాల నటుడిగా వారిద్దరితో కలిసి నటించినప్పుడు వారి నటన నాపై బలమైన ముద్ర వేసింది. ‘నాది అమలాపురం...నేను కోనసీమ కుర్రాడి’నని గర్వంగా చెప్పుకుంటాను. ఎప్పటికైనా రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఆశగా ఉంది. మంత్ర- 2లో ఛార్మి నాకు నటనపరంగా చాలా సహకరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement