Mantra-2
-
మెగాస్టార్ సినిమాలు నేలక్లాసులో చూశా..
*'ముఠామేస్త్రి' పోస్టర్‌కు కూరగాయల దండేశా *నేను కోనసీమ కుర్రాడినని గర్వంగా చెప్పుకొంటా.. *'మంత్ర-2' కథానాయకుడు చేతన్ శ్రీను అమలాపురం : 'అమలాపురంలో నా చిన్నతనంలో చిరంజీవి సినిమాల్ని స్నేహితులతో కలసి నేల టిక్కెట్లు కొనుక్కుని చూసేవాడిని. 'ముఠామేస్త్రి' సినిమా వచ్చినప్పుడు చిరంజీవి పోస్టర్‌కు కూరగాయల దండ వేశాం' అని అప్పటి జ్ఞాపకాల్ని నెమరేసుకున్నాడు 'మంత్ర-2' హీరో చేతన్ శ్రీను. ఛార్మితో కలిసి ఆ చిత్రంలో నటించిన చేతన్ అమలాపురంలో పుట్టి పదేళ్ల దాకా ఇక్కడ పెరిగినోడే. ఆ చిత్రం విడుదలయ్యాక ఆ యువ హీరో తన సొంతూరు అమలాపురంలోనూ, చిన్న తనంలో తాను తిరిగిన కోనసీమలోనూ గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాడు. చేతన్‌కు ఇక్కడి యువత బ్రహ్మరథం పడుతున్నారు. అమలాపురం కొంకాపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకుడు మేడిది రమేష్‌బాబు ఇంట మంగళవారం చేతన్ 'సాక్షి'తో కొద్దిసేపు ముచ్చటించారు. అమలాపురంతో తనకున్న అనుబంధాన్ని ఇలా నెమరేసుకున్నారు.. 'నేను అమలాపురంలోనే పుట్టాను. సెయింట్ జాన్స్ స్కూలులో అయిదో తరగతి వరకూ చదువుకున్నా. మా నాన్న సత్యనారాయణకు మద్రాసులో చందమామ పత్రికలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగం రావటంతో మా కుటుంబం అక్కడే స్థిర పడిపోయింది. నా 11 ఏటనే తమిళ సినిమాల్లో సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత చదువు పూర్తి చేసి ముంబైలోని అనుపమకేర్ యాక్టింగ్ స్కూల్లో చేరా. అక్కడే యాడ్ ఫిలిమ్స్‌లో అవకాశాలు వచ్చాయి. ఫైవ్ స్టార్, మ్యాంగ్ జ్యూస్ తదితర యాడ్‌ల్లో పనిచేశా. హెయిర్ కలర్ గార్నియర్‌కు అంబాసిడర్‌గా ఉండి యాడ్ ఫిలిమ్స్‌లో గుర్తింపు తెచ్చుకున్నా. తమిళంలో హీరోగా చేసిన నాలుగు సినిమాల్లో 'కరుంగళి' లో కోనసీమ అమ్మాయి అంజలితో హీరోగా నటించా. తెలుగులో మరో నాలుగు సినిమాల్లో హీరోగా పనిచేస్తున్నాను. మంత్ర -2 సినిమా పెద్ద హిట్ కాకపోయినా తెలుగులో నా తొలి సినిమా విడుదలైన ఆనందాన్ని సొంతూరు, సొంతగడ్డ వారితో పంచుకోవాలని వచ్చాను. నా రెండో తెలుగు సినిమా ‘రాజు గారి గది’ ఈనెలలోనే విడుదల కానుంది. సెరో గ్రూప్స్ సంస్థ నేను హీరోగా తీస్తున్న చిత్రాన్ని దాదాపు కోనసీమలోనే తీసే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాక భారీ బడ్జెట్‌తో నిర్మించే మరో రెండు సినిమాల్లో నటించేందుకు అంగీకారాలు కుదిరాయి. నాకు రఘువరన్, ప్రకాశ్‌రాజ్‌లు స్ఫూర్తి. బాల నటుడిగా వారిద్దరితో కలిసి నటించినప్పుడు వారి నటన నాపై బలమైన ముద్ర వేసింది. ‘నాది అమలాపురం...నేను కోనసీమ కుర్రాడి’నని గర్వంగా చెప్పుకుంటాను. ఎప్పటికైనా రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఆశగా ఉంది. మంత్ర- 2లో ఛార్మి నాకు నటనపరంగా చాలా సహకరించారు. -
ఇండియన్ స్క్రీన్‌పై చూడని హారర్
చార్మి కెరీర్లో గుర్తుంచుకోదగిన సినిమా ‘మంత్ర’. థ్రిల్లర్ చిత్రాల్లో ఆ సినిమా ఓ సంచలనం. ‘మంత్ర’ను అనుసరించి తర్వాత చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఆ రకంగా ఆ సినిమాను ఓ ట్రెండ్ సెట్టర్ అని కూడా అనొచ్చు. ప్రస్తుతం చార్మి ‘మంత్ర-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘మంత్ర’కి ఈ సినిమా కొనసాగింపు కాదని ఆ చిత్రం ప్రారంభంలోనే దర్శకుడు ఎస్.వి.సతీష్, నిర్మాతలు బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ తెలియజేశారు. అయితే... అదే పేరుతో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఉండటం సహజం. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ... కథ రీత్యా ఇది సీక్వెల్ కాకపోయినా... ఓ విధంగా సీక్వెలే అనాలని కొత్త రాగం అందుకున్నారు నిర్మాతలు. ఆ వివరాలను తెలుపుతూ-‘‘‘మంత్ర’ మాదిరిగానే ఇది కూడా హారర్ నేపథ్యంలో సాగే కథ. అలాగే... కథనం కూడా ఎక్కువశాతం రాత్రి వేళల్లోనే నడుస్తుంది. చిత్రీకరణ పరంగా చూస్తే ‘మంత్ర’ కంటే ఈ సినిమా బాగా వస్తోంది. అందుకే ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. చార్మీ అందిస్తున్న సహకారం మరిచిపోలేం. ఈ నెల మూడోవారం నుంచి ఆర్ఎఫ్సీలో ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని తెలిపారు. ‘‘మాతృకలోనూ సీక్వెల్లోనూ ఒకే కథానాయిక నటించడం ఇండియన్ స్క్రీన్‌పై ఇదే ప్రథమం. ఆ రకంగా చార్మీ చరిత్రలో నిలిచిపోతారు. అనుక్షణం ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇది. మనదేశంలో ఇప్పటివరకూ ఇలాంటి హారర్ సినిమా రాలేదని నమ్మకంగా చెప్పగలను’’ అని దర్శకుడు చెప్పారు. తనికెళ్లభరణి, రాహుల్‌దేవ్, రావురమేష్, నల్లవేణు, సుధ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివశంకర్, ఛాయాగ్రహణం: ఆర్.పి.తనికెళ్ల, కూర్పు: బాబు సిద్దంశెట్టి, సహ నిర్మాతలు: పవన్, సురేష్ కొండవీటి. -
చార్మి నాయికగా మంత్ర 2
‘‘నేను ‘మంత్ర’ చేసిన తర్వాత అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారు? అని చాలామంది నన్నడిగారు. అదే తరహా సినిమా చేసే అవకాశం ఇప్పుడు దక్కింది. అయితే ‘మంత్ర’కీ ఈ సినిమాకీ పోలిక ఉండదు. ఇదొక కొత్త రకం కథ. నేను సవాల్‌గా తీసుకోవాల్సిన సినిమా’’ అన్నారు చార్మి. శ్రీమతి పద్మ సమర్పణలో తేజ ఫిలింస్ పతాకంపై బోనాల శ్రీకాంత్, పి. శౌరిరెడ్డి, రవితేజ నిర్మిస్తున్న చిత్రం ‘మంత్ర-2’. చార్మి నాయికగా ఎస్వీ సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కెమెరా స్విచాన్ చేయగా బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. ఎన్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ‘మంత్ర’కి ఇది సీక్వెల్ కాదు. అదే తరహాలో ఉండే హార్రర్, థ్రిల్లర్ మూవీ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన రవితేజ మాట్లాడుతూ - ‘‘ఈ కథకు చార్మీ అయితేనే బాగుంటుందనుకున్నాం. కథ వినగానే, ఆమె అంగీకరించారు. ‘మంత్ర’ అంతటి విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. సంగీతదర్శకుడిగా ఐదో సినిమా అని, పాటలతో పాటు, రీ-రికార్డింగ్‌కి కూడా స్కోప్ ఉందని శివశంకర్ తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: కె. సురేష్.