ముందే చేస్తే ‘హెల్త్‌’ బాగుంటుంది! | Medical Insurance | Sakshi
Sakshi News home page

ముందే చేస్తే ‘హెల్త్‌’ బాగుంటుంది!

Published Sun, Feb 19 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

ముందే చేస్తే ‘హెల్త్‌’ బాగుంటుంది!

ముందే చేస్తే ‘హెల్త్‌’ బాగుంటుంది!

వయసు మీరాక బీమా చేస్తే ప్రీమియం భరించలేం  
కంపెనీ ఇచ్చే పాలసీతో పాటు సొంతదీ ఉండాలి  


రజని వయసు 23 ఏళ్లు. ఈ మధ్యే తను ఒక అడ్వర్టై జింగ్‌ కంపెనీలో ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. జీతం నెలకు రూ.25 వేలు. కంపెనీ ఇచ్చిన పీఎఫ్‌ ఖాతా, పేరెంట్స్‌ బహుమతిగా ఇచ్చిన ఎల్‌ఐసీ పాలసీ ఉన్నాయి. ఆ వయసులోని మిగతా వారిలానే రజనికి సొంత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఏదీ లేదు. కంపెనీ తరఫునున్న రూ.5 లక్షల కవరేజీ తప్ప. తను కెరీర్‌ ప్రారంభంలో ఉంది. ఇప్పుడే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సిన అవసరమేంటన్నది తన అభిప్రాయం. ఇరవైలలో ఉన్న నేహా  విషయాన్ని పక్కనబెడితే... ముప్ఫైలలో ఉన్న వారు కూడా చాలా మంది ఇలానే ఆలోచిస్తున్నారు. అదెంతమాత్రం మంచిదికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలొస్తే ఎక్కడ లేని డబ్బూ సరిపోదు. రూ.3 లక్షల కవరేజీ ఉన్నా సంక్లిష్టమైన సర్జరీ లేదా తీవ్ర అనారోగ్యాల బారిన పడితే 5 రోజుల హాస్పిటల్‌ ఖర్చులకు మించి రావడం లేదు. అలాగని వ్యక్తిగతంగా పొదుపు చేసి, ఆ మొత్తాన్ని వైద్యానికి వాడదామంటే అయ్యే పని కాదు. అందుకని సాధ్యమైనంత ముందే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే ఇటు పొదుపు మొత్తాలు భద్రంగా ఉంటాయి. అటు మీ కుటుంబానికీ భరోసా ఉంటుంది.
రెండు రకాల ప్రయోజనాలు...    

వైద్య బీమాను సాధ్యమైనంత ముందు తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మొదటిది.. పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన రిస్కులు తక్కువ, దీర్ఘకాలం పాటు ఎక్కువ కవరేజీ లభిస్తుంది. రెండోది.. ఎంత ముందుగా తీసుకుంటే ప్రీమియం అంత తక్కువ. అదే నలభై ఏళ్లు వచ్చే దాకా ఆగి అప్పుడు తీసుకుంటే.. జీవిత కాలం తక్కువగా ఉంటుంది కనుక ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది.

ఎంత ముందయితే.. అంత మంచిది!
కంపెనీ పరంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పటికీ.. సొంత పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఒకవేళ మీరో, లేదా మీ కుటుంబ సభ్యులో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు ఒకోసారి కంపెనీ ఇచ్చే పాలసీ మొత్తం చికిత్స ఖర్చులకు సరిపోకపోవచ్చు. అలాగే, మీరు రిటైరయిన తర్వాత కంపెనీ ఇచ్చే పాలసీ కవరేజీ కూడా ముగిసిపోతుంది. సొంతంగా తీసుకున్న పాలసీనే అప్పుడు అక్కరకొస్తుంది. లేకపోతే కష్టపడి పొదుపు చేసిన డబ్బును ఖరీదైన వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పోనీ అప్పుడు పాలసీ తీసుకుందామనుకుంటే 60 ఏళ్లు వచ్చాక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలంటే కష్టం. ప్రస్తుతం చాలా పాలసీలు డే–కేర్‌ ప్రొసీజర్స్‌ మొదలుకుని, మెటర్నిటీ, ఓపీడీ మొదలైన వాటన్నింటికీ కూడా కవరేజీ ఇస్తున్నాయి. కాబట్టి ఆస్పత్రిలో చేరకపోయినా జీవితంలో చాలా మటుకు వైద్య ఖర్చులను ఎదుర్కొనేందుకు హెల్త్‌ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే, పాలసీ తీసుకున్నాక నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే కొన్ని రకాల అనారోగ్యాలు, ప్రత్యేక ట్రీట్‌మెంట్స్‌కు కవరేజీ వర్తిస్తుంది.

కాబట్టి స్థూలంగా చెప్పాలంటే.. అరవయ్యో పడిలోకి వచ్చేదాకా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆ తర్వాత వైద్య ఖర్చులకు భారీ మొత్తాలను జేబులో నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు పాలసీ తీసుకోవాలనుకున్నా ప్రీమియం కూడా భారీగానే కట్టుకోవాల్సి వస్తుంది. కనుక, ఎంత ముందుగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అంత మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement