ఈ కాంబినేషన్‌ కొత్తగా ఉంది | Meeku Maathrame Cheptha Trailer launch | Sakshi
Sakshi News home page

ఈ కాంబినేషన్‌ కొత్తగా ఉంది

Published Thu, Oct 17 2019 1:48 AM | Last Updated on Thu, Oct 17 2019 1:48 AM

Meeku Maathrame Cheptha Trailer launch - Sakshi

మహేశ్‌బాబు, విజయ్‌ దేవరకొండ

‘‘విజయ్‌ ప్రొడ్యూసర్, తరుణ్‌ భాస్కర్‌ హీరో అని వినగానే కొత్తగా అనిపించింది. నాకు బాగా నచ్చిన సినిమా ‘పెళ్ళి చూపులు’. నిర్మాతగా విజయ్‌ చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్‌ చాలా బాగుంది. కథ ఆసక్తిగా అనిపించింది’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. తరుణ్‌ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్‌ గోమటం, పావని గంగిరెడ్డి ముఖ్య తారలుగా షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’.

కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విజయ్‌ దేవరకొండ, వర్ధన్‌ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని మహేశ్‌బాబు విడుదల చేశారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మీకు మాత్రమే చెప్తా’ కథాంశం బాగా నచ్చి నేనే నిర్మించా. నిర్మాత బాధ్యతలు మా నాన్న వర్ధన్‌ దేవరకొండగారు తీసుకున్నారు. నా మనసుకు నచ్చిన సినిమా ఇది.  నా అభిమాన హీరో మహేశ్‌గారు ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మూవీలో నన్ను హీరో అంటున్నారు.

కానీ, నేను ఓ నటుడిగానే భావిస్తున్నా. కథ, కథనాలు ఫన్‌గా ఉంటాయి’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌. ‘‘ఈ సినిమా ఓ సంఘటన ఆధారంగా ఉంటుంది. డైలాగ్స్‌ రాసిన తరుణ్‌ భాస్కర్‌కి థ్యాంక్స్‌. అందరికీ కనెక్ట్‌ అయ్యే పాయింట్‌తో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాం’’ అన్నారు షమ్మీర్‌ సుల్తాన్‌. నటీనటులు అనసూయ భరద్వాజ, వాణి భోజన్, అభినవ్‌ గోమటం, నవీన్‌ జార్జ్‌ థామస్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మదన్‌ గుణదేవా, సంగీతం: శివకుమార్, లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అనురాగ్‌ పర్వతనేని.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement