
సాక్షి, తమిళసినిమా : నటుడు ధనుష్‌తో జోడీ కట్టిన హీరోయిన్ తాజాగా శింబుతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందట. నటుడు శింబు చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అయ్యిపోతున్నారు. ఈయన మణిరత్నం దర్వకత్వంలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘సెక్క సివంద వానం’ (తెలుగులో నవాబ్) సినిమా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక, దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించడానికి శింబు కమిట్ అయ్యారు. అదేవిధంగా ఇటీవల లైకా సంస్థ కూడా శింబుతో చిత్రం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్ద తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్ర రీమేక్ హక్కులను పొందిన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా రీమేక్‌లో పవన్‌కల్యాణ్ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్‌కు అవకాశం వరించిందట. ఈ అమ్మడు ఇప్పటికే కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా ‘ఎన్నై నోక్కి పాయుం తూటా’ చిత్రంతోపాటు ఒరు పక్క కథై, అధర్వకు జతగా బూమరాంగ్ చిత్రాలలో నటిస్తోంది. అయితే ఈ మూడింటిలో ఏ ఒక్క చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. తెలుగులో ఇప్పటికే లై, ఛల్ మోహనరంగా వంటి చిత్రాల్లో నటించింది. ఇక, అత్తారింటికి దారేది చిత్రంలో సమంత పాత్రను మేఘా ఆకాశ్ పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రను నటి ప్రణీత చేయగా.. తమిళంలో ఆ పాత్ర ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.