
డబ్బింగ్ కార్యక్రమాల్లో 'మెంటల్ మదిలో'
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో సినిమా మెంటల్ మదిలో.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ షూటింగ్ ముగించుకునే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తోంది. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''పెళ్ళిచూపులు' విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. శ్రీవిష్ణు, నివేతాల జంట చాలా బాగుంది, శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ 'మెంటల్ మదిలో' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మా ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం 'మెంటల్ మదిలో' అని గర్వంగా చెప్పగలను. ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం.. జూలైలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలు ప్రకటిస్తాం' అన్నారు.