కస్తూరి
‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలో హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటకు చెబుతున్నారు. చాలా మంది నటీమణులు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి, ‘అన్నమయ్య’ ఫేమ్ కస్తూరి కూడా ‘మీటూ’ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఈ విషయం గురించి కస్తూరి మాట్లాడుతూ– ‘‘పబ్లిసిటీ కోసమే హీరోయిన్లు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాటిని వ్యతిరేకిస్తున్నాను. ఎవరైనా ఒక స్త్రీ వచ్చి తనకు ఇలా జరిగిందని చెప్పగానే మనం చేసే మొదటి పని తనని జడ్జ్ చేయడం. ఇలా ఆరోపించడం వల్ల తనకు లాభం ఏంటి? అని ఆలోచిస్తున్నారు కూడా. అలాంటి సంఘటనలు బయటకు చెప్పడానికే ఎంతో ధైర్యం కావాలి.
ఇలా చెప్పడం వల్ల తను ఏదో సాధిస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. తప్పుడు ఆరోపణలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలని, పాపులర్ అవ్వాలని ఏ స్త్రీ కోరుకోదు. మనం అనవసరంగా ప్రశ్నిస్తే ఇంకెప్పుడూ ఎవరూ ముందుకు వచ్చి తమ వేదనను పంచుకోరు. ‘ఈ విషయం జరిగినప్పుడే ఎందుకు బయటకు చెప్పలేదు?’ అని చాలామంది అంటుంటే విన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవ్వరైనా వాటి నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తుంటారు తప్పితే కంప్లయింట్ ఇవ్వాలనుకోరు. నేనిచ్చే సలహా ఏంటంటే స్త్రీలను ప్రశ్నించడం మానేసి, అలాంటి ఇబ్బందులు పెట్టిన వారి నుంచి సమాధానాలు రాబట్టడం మంచిదనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment