
తండ్రి బాటలో...ప్రిన్స్ మైఖేల్ జాక్సన్
ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ని మరచిపోవడం అంత సులువు కాదు. పాటల రూపంలో చిరంజీవిగా ఉన్నారాయన. మైఖేల్ అభిమానులకు ఓ శుభవార్త. ఆయన తనయుడు ప్రిన్స్ మైఖేల్ జాక్సన్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. యువ పాప్‌స్టార్‌గా సంగీత అభిమానులను సంపాదించుకున్న జస్టిన్ బీబర్‌తో కలిసి ప్రిన్స్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నాడని సమాచారం.
కాలిఫోర్ని యాలో ఈ ఆల్బమ్ రికార్డింగ్ జరుగుతున్నట్లు భోగట్టా. ఈ ఆల్బమ్ వివరాలను గోప్యంగా ఉంచాలని ప్రిన్స్, జస్టిన్ బీబర్ భావిస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ ఆల్బమ్ విడుదల కానుందని హలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ ఆల్బమ్ గురించి ఆ నోటా ఈ నోటా మైఖేల్ జాక్సన్ అభిమానుల వరకూ వెళ్లడంతో.. తండ్రిలానే ప్రిన్స్ భేష్ అనిపించుకుంటాడనే అంచనాలతో ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. మైఖేల్ చనిపోయి ఐదేళ్లయినా ఆయన స్థానాన్ని భర్తీ చేసే పాప్ స్టార్ రాలేదు. ఆ స్థానాన్ని ప్రిన్స్ భర్తీ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.