ఈ యముడు పూర్తి భిన్నంగా ఉంటాడు!
‘‘నా కెరీర్‌లో యముడు పాత్ర చేయడం ఇదే ఆఖరు. అంతకు ముందు చేశాను కానీ... ఇక నా వల్ల కాదు. ఇన్నిసార్లు పౌరాణిక పాత్రలు చేయడం ఒక్క ఎన్టీఆర్‌కే దక్కింది’’ అని మోహన్‌బాబు అన్నారు. ‘యమలీల’ చిత్రానికి కొనసాగింపుగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కుతోన్న చిత్రం ‘యమలీల-2’. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో.. డి.ఎస్.మ్యాక్స్ పిక్చర్స్ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కేవీ సతీశ్ హీరోగా పరిచయం అవుతున్నారు. డియానికోలస్ కథానాయిక. ఈ సినిమా ప్రచార చిత్రాలను మంగళవారం హైదరాబాద్‌లో డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మరిన్ని విషయాలు చెబుతూ -‘‘నేను బాపు రమణలతో పనిచేశాను. వాళ్లకు కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కూడా అంతే.
కృష్ణారెడ్డితో అప్పట్లోనే ఓ సినిమా చేద్దామనుకున్నా కుదర్లేదు. ఇప్పటికైనా ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా గత యముని పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందీ పాత్ర’’ అన్నారు. ‘‘1994లో ‘యమలీల’ రిలీజైంది. 2014లో ‘యమలీల-2’ వస్తోంది. ఇరవై ఏళ్ల క్రితం ‘యమలీల’ ఎంత జాగ్రత్తగా తీశానో... ‘యమలీల-2’ కూడా అంతే జాగ్రత్తగా తీస్తున్నాను. ‘ఈగ’ తర్వాత అంతటి అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కేవీ సతీశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను. బెంగళూరులో ఎనిమిదేళ్ల క్రితం ఓ చిన్న కంపెనీలో రెండు వేల జీతంతో జీవితాన్ని మొదలు పెట్టినతను... ఈ రోజు ఎనిమిది వేలమందికి జీతాలిచ్చే స్థాయికి ఎదిగాడు. కృష్ణారెడ్డి అంటే కామెడీ, సెంటిమెంట్. అందుకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టి తీరుతా’’ నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు టి.సుబ్బిరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, బండ్ల గణేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.