
తెలుగులో మోహన్‌లాల్
బాలకృష్ణ నటించిన ‘గాండీవం’ చిత్రంలో ‘గోరువంక వాలగానే గోపురానికి’ పాటలో తళుక్కున మెరిశారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. మళ్లీ ఆ తర్వాత నేరుగా ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు. అయితే అనేక అనువాద చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇటీవలే ‘జిల్లా’ అనే చిత్రంతో తెలుగు తెరపై కనిపించిన మోహన్‌లాల్, ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు చిత్రంతో మన ముందుకు రానున్నారు.
సురేశ్ వంశీ దర్శకత్వంలో విశ్వనాథ్ ఇ.ఎస్ నిర్మించనున్న చిత్రం ‘నువ్వే నా ప్రాణమని’. సూరజ్, కవిత జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో యాక్షన్, సెంటిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మోహన్‌లాల్ వంటి అగ్ర హీరో ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివ, సంగీతం: సందీప్ కుమార్, మహమ్మద్ రఫిక్, సహ నిర్మాత: కొండారెడ్డి.