అప్పుడు జింకలా మారతా! | Mohanlal interview about Odian movie | Sakshi
Sakshi News home page

అప్పుడు జింకలా మారతా!

Published Sun, Dec 16 2018 1:23 AM | Last Updated on Sun, Dec 16 2018 1:23 AM

Mohanlal interview about Odian movie - Sakshi

మోహన్‌లాల్‌

మోహన్‌లాల్‌... నటుడిగా 41 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. వయసేమో 58కి పైనే. పాత్ర ప్రేమగా అడిగితే పాతికేళ్ల యువకుడిగానూ మారిపోతారు. భాష తెలియదంటే నేర్చుకుని మరీ నటిస్తారు. అభిమానులు అభిమానంగా ‘కంప్లీట్‌ యాక్టర్‌’ అని పిలుచుకుంటారు. నా సినిమాలు, నా దర్శకులే ఆ కంప్లీట్‌నెస్‌కి కారణం అని మోహన్‌లాల్‌ అంటారు.  మోహన్‌లాల్‌ హీరోగా వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒడియన్‌’. ప్రకాష్‌రాజ్, మంజు వారియర్‌ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా మోహన్‌లాల్‌ పంచుకున్న పలు విశేషాలు....

► ‘ఒడియన్‌’ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తోంది?
కేరళ నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి ఒపెనింగ్స్‌  వస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా వస్తోందని అనుకుంటున్నాను. ఒక నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది.

► శ్రీకుమార్‌మీనన్‌కు దర్శకునిగా పెద్దగా అనుభవం లేదు. ఆయన ఇంత పెద్ద సినిమాను తీయగలరని ఎలా నమ్మారు?
శ్రీకుమార్‌ మీనన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌  ఏదీ తీయకపోయినా అతను చాలా యాడ్‌ ఫిల్మ్స్‌ చేశాడు. నాతో కూడా కొన్ని యాడ్స్‌ చేశాడు. తను చేయగలడనే నమ్మకంతోనే ఈ సినిమా చేశాను.

► ‘ఒడియన్‌’ కోసం ఎలాంటి పరిశోధన చేశారు?
ప్రత్యేకంగా ఏ పరిశోధన చేయలేదు. కానీ సినిమా కోసం కష్టపడ్డాం. కాన్సెప్ట్‌ గురించి బాగా ఆలోచించాం. ఇది యాక్షన్‌ సినిమా కాదు. ఎమోషనల్‌ సినిమా. స్పిరిచ్యువల్‌ డెస్టినేషన్‌ ఉంది. ఎద్దు, పులి.. ఇలా ఎలా కావాలంటే ఆ విధంగా మారిపోయే శక్తులు ఉన్న ఒడియన్‌ అనే వ్యక్తి కథ.

► సినిమాలో ఎలా కావాలనుకుంటే అలా మారిపోతారు. ఒకవేళ నిజంగా అలా మారిపోవాలనుకుంటే?
(నవ్వేస్తూ).. సినిమాలో చేసినట్టు మారే విషయం గురించి నేను ఆలోచించలేదు. అది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. (కాసేపు మౌనం) జింకలా మారతాను.

► నటుడిగా 41 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంత సుదీర్ఘ కెరీర్‌కు ఇన్‌స్పిరేషన్‌ ఏంటి?
ఇంత సుదీర్ఘ ప్రయాణం ఆశీర్వాదం అని నమ్ముతాను. నేను ఇలా చేశాను. అలా చేశాను.. దాని వల్లే ఇలా కొనసాగుతున్నాను అనుకోను. మంచి పాత్రలు లభించాయి. మంచి దర్శకులతో పని చేశాను. ఇవన్నీ నన్ను నిలబెట్టాయి. ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు, ఇండస్ట్రీకు థ్యాంక్స్‌.

► ఈ ఏజ్‌లో కూడా యాక్షన్‌ సినిమాలు చేస్తున్నారు? రిస్క్‌ అనిపించడంలేదా?
యాక్షన్‌ సినిమాలంటే నాకు ఇష్టం. నా కెరీర్‌లో ఎన్నో యాక్షన్‌ సినిమాలు చేశాను. రీసెంట్‌గా ‘పులిమురుగన్‌’ (తెలుగులో ‘మన్యంపులి’) చేశాను. అందులో పులులతో యాక్షన్‌ ఉంటుంది. ‘ఒడియన్‌’ క్యారెక్టర్‌ యాక్షన్‌ సన్నివేశాలను చేసి తీరాలి.. లేదా సినిమా చేయలేనని చెప్పాలి. యాక్షన్‌ సినిమాలు నేను చేయలేను అని నాకు అనిపించినప్పుడు తప్పకుండా ఆపేస్తాను. కానీ ఇప్పుడు చేయగలనన్న నమ్మకం ఉంది. సో.. చేస్తూనే ఉంటాను.

► ఈ మధ్య భాషా బేధాలు తొలగిపోయాయి అనిపిస్తోంది. అన్ని భాషల సినిమాలను అందరూ  చూస్తున్నారు...
 కేరళలో ఇతర భాషల సినిమాలకు ఆదరణ ఉంది. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ కూడా పెరిగాయి. నా కెరీర్‌ స్టార్టింగ్‌లో కేరళలో ఇతర భాషల సినిమాలు కూడా అనువాదం అయి విడుదలయ్యేవి. చిరంజీవిగారి సినిమాలు వచ్చేవి. బాగా ఆడేవి. ఈ మధ్య ఆ హద్దులు పూర్తిగా తొలగిపోయాయి అనిపిస్తోంది.

► తెలియని భాషలో నటించనని కొన్ని సందర్భాల్లో చెప్పారు. తెలుగులో నటిస్తున్నారు కదా?
అవును. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు భాష పై కమాండ్‌ ఉంటే నటించడం సులభంగా ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉంటుంది. క్యారెక్టర్‌పై కమాండ్‌ కూడా వస్తుంది. యాక్ట్‌ చేసేటప్పుడు ట్రైనింగ్‌ తీసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్‌ అనిపించదు. ఇప్పుడు మాట్లాడమంటే మలయాళంలో అనర్గళంగా మాట్లాడతాను. కానీ తెలుగులో సినిమా చేసేప్పుడు డైలాగ్‌లు మాత్రమే చెప్పగలం. అంతవరకూ అయినా కమాండ్‌ ఉంది కాబట్టే చేస్తున్నాను.

► ఇటీవల మీరు వరుసగా హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చేస్తున్నట్లున్నారు?
ప్లాన్‌ చేయలేదు. అలా జరుగుతున్నాయి అంతే. అయినా ‘ఒడియన్‌’ హిస్టారికల్‌ ఫిల్మ్‌ కాదు. నివిన్‌ పౌలితో ‘కాయమ్‌కులమ్‌ కొచ్చిన్‌’ సినిమా చేశాను. అది హిస్టారికల్‌ మూవీ. ఇప్పుడు ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ‘మరాక్కర్‌’ అనే హిస్టారికల్‌ మూవీ. చేస్తున్నాను.

► ఆర్టిస్టుల దాహం తీరదంటారు. మీ ఫ్యాన్స్‌ అంతా మిమ్మల్ని ‘కంప్లీట్‌ యాక్టర్‌’ అని సంబోధిస్తారు. మిమ్మల్ని మీరు కంప్లీట్‌ యాక్టర్‌గా భావిస్తారా?
కంప్లీట్‌ యాక్టర్‌ అనేది ఫ్యాన్స్‌ పిలుచుకునేది. అలాంటి బిరుదులు ఇచ్చేశారని పరిపూర్ణంగా అయిపోయాం అనుకోకూడదు. లక్కీగా నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. దర్శకులు నా కోసం అలాంటి పాత్రలు ఇస్తుండటాన్ని బ్లెసింగ్‌గా భావిస్తున్నాను. ప్రేక్షకులు ఆదరించే ఆసక్తికరమైన సినిమాలు చేస్తున్నప్పుడు  పేర్లు అవే వస్తాయి. నాకు ఫలానా పాత్రలు కావాలనుకుంటే రావు. వచ్చిన పాత్రలనే బాగా చేస్తున్నాను అంతే.

► ఈ వయసులోనూ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు?
ఒక సినిమాను కంప్లీట్‌ చేసిన వెంటనే ఇంకో సినిమాను స్టార్ట్‌ చేస్తున్నాను. సినిమాలను ప్రేమిస్తాను.  నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. నేను వర్క్‌హాలిక్‌ని (అతిగా పని చేసే వ్యక్తి) సెట్‌లో సీన్‌ ఎంత ఆలస్యం అయినా వెయిట్‌ చేయాలి. ఒక నటుడిగా దర్శక–నిర్మాతలకు మనం ఇచ్చే గౌరవం అది. నా వర్క్‌ని ఎంజాయ్‌ చేస్తాను. నీ పనిని నువ్వు ప్రేమించనప్పుడు అందులో ఎక్కువకాలం ఎలా కొనసాగుతావు? పనిని ఎంజాయ్‌ చేయలేకపోతున్నాను అని అనిపించినప్పుడు చేయకపోవడమే మంచిది.

► టాలీవుడ్‌తో మీకు ఉన్న అనుబంధం?
‘గాంఢీవం’ సినిమాలో చిన్న గెస్ట్‌ రోల్‌ చేశాను. ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ చేశాను.  ‘మనమంతా’ చేశాను. నా సినిమాలు కొన్ని తెలుగులో డబ్‌ అవుతుంటాయి. అలాగే  కొన్ని సినిమాలను రీమేక్‌ చేశారు. మోహన్‌బాబు, చిరంజీవిలతో మంచి రిలేషన్‌ ఉంది. వెంకటేశ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇలా ఇంకొందరితో మంచి స్నేహం ఉంది.

► ఈ మధ్య భారీ బడ్జెట్‌ సినిమాలు పెరుగుతున్నాయి. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి?
హాలీవుడ్‌ సినిమాలు చూస్తుంటాం. ఎందుకు? భారీ బడ్జెట్, భారీ కాన్వాస్, లార్జర్‌ దాన్‌ లైఫ్‌లా ఆ సినిమాలు ఉంటాయని. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దొరుకుతుంది. మంచి మార్కెట్‌ క్రియేట్‌ అవుతంది. ఆ విషయాన్ని ‘బాహుబలి’ నిరూపించింది. ఇప్పుడు ‘మరాక్కర్‌’ అనే చిత్రం చేస్తున్నాం. బిగ్‌ బడ్జెట్‌ సినిమాలు తప్పనిసరిగా రావాలి. అవకాశం, సామర్థ్యం ఉన్నప్పుడు చేయడంలో తప్పు లేదు.

► మీ తనయుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చారు..
ప్రణవ్‌ చైల్డ్‌ ఆర్టిస్టుగా కూడా చేశాడు. ఫస్ట్‌ సినిమా ‘ఆది’లో హీరోగా బాగా నటించాడు. మంచి హిట్‌ అయింది.  ఇప్పుడు రెండో సినిమా షూటింగ్‌ కూడా జరుగుతోంది. ‘మరాక్కర్‌’లో నా చిన్ననాటి పాత్ర చేస్తున్నాడు. అయితే సినిమాల్లో కొనసాగలని ప్రణవ్‌ ఇంకా నిర్ణయించుకోలేదు. ఇంకో 3,4 సినిమాలు చేసి ఒక నిర్ణయానికి వస్తాడేమో.

► మమ్ముట్టి, మీ మధ్య ఎలాంటి అనుబంధం ఉంది?
మేము మంచి మిత్రులం. ఇద్దరం కలిసి దాదాపు 54 సినిమాలు చేశాం.  ‘ఒడియన్‌’ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ కూడా ఇచ్చారాయన.

► మాలీవుడ్‌ యంగ్‌ హీరోలు (దుల్కర్‌ సల్మాన్, నివిన్‌ పౌలి) కూడా తెలుగులో ఫ్యాన్స్‌ సంపాదించుకోవడంపై మీ ఒపీనియన్‌?
 మంచి మంచి పాత్రలు చేస్తూ వాళ్లను వారు నిరూపించుకుంటున్నారు. వారికి మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు రావాలని నేనూ కోరుకుంటున్నాను.

► ప్రస్తుతం మలయాళంలో ‘అమ్మ’ అసోసియేషన్‌లో నటుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దాని గురించి...
అక్కడ ఏం జరిగిందో బయట వాళ్ళకు పూర్తిగా అవగాహన లేదు. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు.


ఒడియన్‌లో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement